కార్పొరేషన్, ఏప్రిల్ 6: పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న బండి సంజయ్‌కుమార్ వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని 37వ డివిజన్ మీ కోసం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ప్రజలందనూ బీఆర్ఎస్కు మద్దతుగా ఉంటున్నారన్న కక్షతో బీజేపీ అనేక కుట్రలకు పాల్పడుతున్నదని దుయ్యబట్టారు. గత నాలుగేళ్లుగా బీజేపీ నాయకత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు అనేక కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అన్నదాతలను దూరం చేయాలని బీజేపీ కుట్ర పన్నిందని విమర్శించారు.
అనంతరం ఉద్యోగులను దూరం చేయాలన్న ఆలోచనతో అనేక విమర్శలు చేశారని, కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు రాకుండా అభివృద్ధిని అడ్డుకుందామనే ప్రయత్నం చేశారన్నారు. ఇవేమీ ఫలించకపోవడంతో ఇప్పుడు నిరుద్యోగులు, విద్యార్థులను రెచ్చగొట్టేందుకు టీఎస్పీఎస్సీ, పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం లీకేజీలకు పాల్పడినట్లు దుయ్యబట్టారు. టీఎస్పీఎస్సీ లీకేజీల్లోనూ బీజేపీకి అనుబంధంగా ఉన్న ఉద్యోగులే కీలక పాత్ర పోషించారని, ఇప్పుడు ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే లీకేజీలో అడ్డంగా దొరికాడన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న బండి సంజయ్‌కి ఒక్క రోజు కూడా ఎంపీగా కొనసాగే అర్హత లేదన్నారు.
గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ రూ. లక్ష తీసుకున్నారని సస్పెండ్ చేసిన ఆ పార్టీ అధిష్టానం ఇప్పుడు నిరుద్యోగులు, పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనలకు గురి చేసిన బండి సంజయ్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రజలకు చెప్పాలన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ‘అది చేస్తా… ఇది చేస్తా’ అంటూ యువతను రెచ్చగొట్టే హామీలు ఇచ్చిన బండి సంజయ్ ఈ నాలుగేళ్లల్లో ఏం చేశారో చెప్పాలన్నారు. ఎంపీగా ఏమి చేయలేని బండి సంజయ్ కరీంనగర్ ప్రజలకు మాత్రం పేపర్ లీకేజీల దొంగగా గిఫ్ట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇక్కడి ప్రజలు తల ఎత్తుకోకుండా చేసిన ఘనత బండిదేనన్నారు. చిల్లర దొంగ తీరులో ఎంపీగా ఉన్న బండి ఫోన్ విషయంలో అబద్ధాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గుగ్గిళ్ల శ్రీనివాస్, గూడూరి మురళి, ఆరె రవి గౌడ్, షాకత్ అలీ, రవినాయక్, సాయికృష్ణారెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.