జగిత్యాల, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల నడిబొడ్డున కొద్ది రోజులుగా భూ వివాదం రాజుకున్నది. పట్టణంలోని 138 సర్వే నంబర్ భూమిలో 20 గుంటల స్థలం చర్చనీయాంశమవుతున్నది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాజకీయ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ సత్యప్రసాద్ వివాదాస్పదమైన 20 గుంటల స్థలంపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలంటూ ప్రత్యేకంగా కమిటీ వేశారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ రామ్మోహన్, మున్సిపల్ కమిషనర్ స్పందనతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ.. రెవెన్యూ, మున్సిపల్, సబ్ రిజిస్ట్రార్ శాఖల్లో భూమికి సంబంధించి అందుబాటులో ఉన్న అన్ని వివరాలను పరిశీలించే పనిలో పడ్డారు. ఐదు రోజుల క్రితమే ఆ స్థలంలో రెవెన్యూ, మున్సిపల్, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, సిబ్బంది కలిసి కొలతలు వేశారు.
తాజాగా మాన్యువల్‌గా వేసిన కొలతలతోపాటు జీపీఎస్ పద్ధతిలో సైతం 20 గుంటల స్థలాన్ని నిర్ధారించాలని కమిటీకి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెవెన్యూ, మున్సిపల్, హైవే అథారిటీ సిబ్బంది మంగళవారం మరోసారి వివాదాస్పద భూమిలో జీపీఎస్ పద్ధతిలో విస్తీర్ణాన్ని లెక్కించారు. భవన సముదాయాలు, బార్లు, వైన్సులు, షాపింగ్ కాంప్లెక్స్ ఇలా అన్నింటి విస్తీర్ణాన్ని కొలిచారు. నాలుగైదు రోజులుగా నివేదికను రూపొందించే విషయంలో నిమగ్నమైన అధికారులు, నివేదికను పూర్తి చేసినట్టు తెలుస్తున్నది. మంగళవారం రాత్రి లేదా బుధవారం వరకు కలెక్టర్‌కు ఇవ్వనున్నట్టు తెలిసింది. కాగా అధికారులు ఇచ్చే ఆ నివేదికపై జిల్లా వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. వివిధ పార్టీలతోపాటు అన్ని వర్గాల్లోనూ దీనిపైనే చర్చ జరుగుతున్నది.