Godavarikhani | కోల్ సిటీ, జనవరి 24: కోల్ బెల్ట్ నాట్య మయూరి.. గోదావరిఖనికి చెందిన ప్రముఖ అంతర్జాతీయ కూచిపూడి కళాకారిణి గుమ్మడి ఉజ్వలకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు రావాలని భారత సాంస్కృతిక, మంత్రిత్వ శాఖ నుంచి ఆహ్వానం అందుకుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి 30 మంది కళాకారులకు ఇంతటి అవకాశం లభించగా, అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గోదావరిఖనికి చెందిన కూచిపూడి కళాకారిణి గుమ్మడి ఉజ్వల ఉండటం విశేషం.
ఈనెల 26న భారత రాజధాని న్యూఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారతదేశ ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా త్రివర్ణ పతాకం ఆవిష్కరించే సమయంలో భారత సాంస్కృతిక శాఖ తరపున వందేమాతరం అనే నేపథ్యంతో దాదాపు 2500 మంది ప్రఖ్యాత కళాకారులతో భారత సార్వభౌమత్వానికి సంస్కృతికి చిహ్నంగా అరుదైన, అద్భుతమైన నాట్య ప్రదర్శన కొనసాగనుంది. ఈ నాట్య ప్రదర్శనకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీత కూర్పు చేస్తుండగా, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ గానంతో సంతోష్ నాయర్ కొరియోగ్రఫీగా వ్యవహరిస్తున్నారు. గణతంత్ర వేడుకల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచే నాట్య ప్రదర్శనలో తనకు అవకాశం రావడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని గుమ్మడి ఉజ్వల పేర్కొన్నారు. తనలోని కళా నైపుణ్యంను గుర్తించి ఇంతటి అవకాశం కల్పించిన భారత సాంస్కృతిక శాఖకు కృతజ్ఞతలు తెలిపింది. ఆమె గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. ఈమేరకు స్థానిక కళాకారులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు. గోదావరిఖని గర్వించదగ్గ కళామతల్లి బిడ్డగా భావిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు.