ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన పెద్దాపూర్ బాలుర గురుకులంలో మృత్యుఘోష వినిపిస్తున్నది. సౌకర్యాల లేమి, పాలకుల చోద్యం, అధికారుల అలసత్వం పిల్లల ప్రాణాలను బలిగొంటున్నది. పదిహేను రోజుల క్రితం ఓ విద్యార్థి మృతిచెందిన విషయం మరిచిపోకముందే, శుక్రవారం మరో విద్యార్థి చనిపోవడం, ఇంకో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడం భయాందోళన కలిగిస్తున్నది. వరుస ఘటనలకు పాముకాటే కారణమన్న అనుమానాలు బలంగా కనిపిస్తుండగా, విద్యార్థులు వణికిపోవాల్సి వస్తున్నది. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు, ముళ్లపొదలు ఉండడం, పాముల సంచారం ఉండడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉన్నది. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల భవిష్యత్ కోసం పంపామని, ఇలా చంపుకోవడం కోసం కాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ)/ మెట్పల్లి/ మెట్‌పల్లిరూరల్ : మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు జగిత్యాల జిల్లాలోనే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యంత ఘనమైన చరిత్ర కలిగి ఉంది. 1983లో దీనిని ఏర్పాటు చేయగా, కాలగమనంలో జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్ అయింది. 40 ఏండ్ల కాలంలో వేలాది మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దింది. ప్రస్తుతం పెద్దాపూర్ గురుకులంలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యాబోధన కొనసాగుతుండగా, 540 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఈ గురుకులంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం, మరో నలుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థత చెందడం కలకలం రేపుతున్నది.
గత నెల 26న గురుకులంలో 8వ తరగతి చదువుతున్న రాజారపు గణాదిత్య(13)తోపాటు ఆడెపు గణేశ్, రాపర్తి హర్షవర్ధన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులతో పాటు కడుపునొప్పితో తల్లడిల్లారు. గురుకుల సిబ్బంది ఆ పిల్లలను ఆలస్యంగా దవాఖానకు తరలించగా, గణాదిత్య మృతిచెందాడు. మిగిలిన ఇద్దరు విద్యార్థుల పరిస్థితి సైతం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు తరలించగా, కొద్దిరోజులకు వారు కోలుకున్నారు.
పాముకాటుకు గురికావడంతోనే గణాదిత్య మృతి చెందాడని, మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థత చెందారని అనుమానించారు. అప్పుడు భయాందోళనకు గురైన తల్లిదండ్రులు గురుకులంలో ఉన్న తమ పిల్లలను స్వగ్రామాలకు తీసుకువెళ్లారు. పదిపదిహేను రోజుల తర్వాత ఇప్పుడిప్పుడే కొద్ది మంది విద్యార్థులు గురుకులానికి చేరుకున్నారు. అయితే, ఇంతలోనే గురువారం రాత్రి 6వ తరగతి చదువుతున్న ఎడ్మల అనిరుధ్(11)తోపాటు హేమంత్‌యాదవ్, మోక్షిత్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.
వారిని దవాఖానకు తరలించగా, అనిరుధ్ పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కోరుట్ల పోలీసులు, అధికారులు పాఠశాలకు చేరుకొని విచారణ జరిపారు. అలాగే, జగిత్యాల ఇన్చార్జి డీఈవో జనార్దన్‌రావు సైతం స్కూల్‌కు వెళ్లి విచారణ చేపట్టారు. పాఠశాల తరగతి గదులను, పరిసరాలను పరిశీలించారు.
ఇరవై రోజుల క్రితం ఇక్కడి నర్సింగ్ ఆఫీసర్ నిర్మల్‌కు బదిలీ అయింది. అనంతరం ఐదు రోజులకే ఓ విద్యార్థి ప్రాథమిక చికిత్స అందక ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అప్రమత్తం కావాల్సిన అధికారులు నర్సింగ్ ఆఫీసర్ పోస్టును భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహించారు. ఈ క్రమంలోనే మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సకాలంలో అనిరుధ్‌కు ప్రథమ చికిత్స అందిస్తే ప్రాణాలు దక్కే అవకాశాలుండేవన్న అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి.
ఇటు రాత్రి పూట పనిచేసే ఇద్దరు కేర్ టేకర్లపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పిల్లలను సరిగ్గా పట్టించుకోవడం లేదని, ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉందని పిల్లలు చెబితే ఆగ్రహిస్తున్నారని, అందుకే వారికి చెప్పుకునేందుకు విద్యార్థులు భయపడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అందుకే అనిరుధ్ రాత్రి 10 గంటల నుంచి తనకు కడుపు నొప్పి వస్తున్నా చెప్పుకోలేదని తెలుస్తున్నది.
రాత్రంతా నొప్పితో తల్లడిల్లిపోయాడు. శుక్రవారం 5.30 గంటలకు ఎక్కువ కావడంతో తోటి విద్యార్థులు కేర్ టేకర్‌కు తెలిపారు. తీవ్ర అస్వస్థతతో ఉన్న అనిరుధ్‌ను వెంటనే 108 అంబులెన్స్‌లో జగిత్యాలకు తరలిస్తుండగా చనిపోయాడు. వాస్తవానికి కేర్టేకర్లు విద్యార్థులు బస చేసే గదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తే ఈ ఘటన జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 9 : ‘అయ్యో కొడుకా.. మంచిగా చదువుతున్నావని పంపితే ఎంత పనాయె బిడ్డా.. నన్ను ఇట్ల వదిలేసిపోయావా నాన్నా.. సౌదీలో ఉన్న మీ నాన్నకు ఏం చెప్పాలి బిడ్డా’ అంటూ ఎడ్మల అనిరుధ్ (11) తల్లి గుండెలవిసేలా రోదించింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో మృతదేహంపై పడి గుండెలు బాదుకున్నది. వేములవాడ మండలం మర్రిమడ్లకు చెందిన ఎడ్మల కృష్ణారెడ్డి – ప్రియాంక దంపతులకు అనిరుధ్ ఒక్కడే కొడుకు.
కృష్ణారెడ్డి బతుకుదెరువు నిమిత్తం సౌదీకి వెళ్లగా, ప్రియాంక తన కొడుకుతో కలిసి తల్లిగారిల్లయిన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో ఉంటున్నది. అనిరుధ్ రెండేండ్ల క్రితం గురుకుల ప్రవేశ పరీక్ష సీటు సంపాదించడంతో పెద్దాపూర్ గురుకులంలో చేర్పించింది. మంచిగా చదువుతుండడంతో సంతోష పడింది. ప్రస్తుతం కొడుకు ఆరో తరగతి చదువుతుండగా.. సెలవు రోజుల్లో చూసి వచ్చేది. ఇలానే ఇటీవల వెళ్లి కొడుకుతో మాట్లాడి వచ్చింది. అంతలోనే చనిపోయాడన్న విషయం తెలిసి ఆ తల్లి జీర్ణించుకోలేకపోయింది. వెంటనే జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు చేరుకొని, బాలుడి మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించింది. విషయం తెలిసిన వెంటనే బాలుడి తండ్రి సౌదీ నుంచి బయలుదేరినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరి, గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు మృత్యువాత పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దాపూర్ గురుకులం పట్టణానికి, గ్రామానికి దూరంగా అటవీ ప్రాంతంలో ఉంటుంది. అయితే, పాఠశాల స్థాయి పెరగడం, భవనం పాతబడడంతో 2017లో 4.25 కోట్లతో 12 ఎకరాల స్థలంలో కొత్త భవనాన్ని నిర్మించారు. అది ఇంకా పూర్తి కాలేదు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యుత్ సౌకర్యం కల్పించలేదు.
మొన్నటి వరకు శిథిలావస్థకు చేరిన పూర్వభవనంలోనే విద్యాబోధన వసతి కొనసాగించారు. అయితే, గత నెలలో గణాధిత్య మృతిచెందడం, మరో ఇద్దరు అస్వస్థత చెందడం, తల్లిదండ్రుల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో విద్యార్థుల వసతిని అసంపూర్తిగా ఉన్న కొత్త భవనంలోకి మార్చారు. అయితే, పదిహేను రోజుల క్రితం జరిగిన ఘటనతో అప్రమత్తంగా ఉండాల్సిన నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
నిజానికి పాఠశాల ఆవరణలో ముళ్లపొదలు, పిచ్చి మొక్కలు ఉండడంతో భయంకరమైన వాతావరణం కనిపిస్తున్నది. కొత్త భవనం వెనకాలే పాడుబడ్డ బావి ప్రమాదకరంగా ఉన్నది. ఇక పూర్వ భవనానికి, కొత్త భవనానికి దాదాపు వంద మీటర్ల దూ రంలో మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉన్నాయి. చుట్టూ అంతా చె ట్లు, పొదలే ఉన్నాయి. ఇప్పటికి వాటినే విద్యార్థులు వాడుతున్నా రు.
చనిపోయిన అనిరుధ్ గురువారం రాత్రి మూత్రశాలకు వెళ్లి వ చ్చాడని, అస్వస్థత చెందిన మరో ఇద్దరు విద్యార్థులు కూడా అలాగే వెళ్లి వచ్చారని తోటి విద్యార్థులు చెబుతున్నారు. మూత్రశాలల వద్ద పాము లేదా విషపురుగులు కరిచి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటంటే బెడ్స్‌ను పాతభవనంలో మూలకు పడేశారు. పిల్లలను గదుల్లో కిందే పడుకో బెడుతుండడంతో రాత్రిపూట పాము కాటుకు గురవుతున్నారని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు.
గణాధిత్య చనిపోయిన సమయంలో ప్రిన్సిపాల్‌ను బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేశారు. అనిరుధ్ మృతి నేపథ్యంలో గురుకులాన్ని పరిశీలించిన అధికారులు, ఇన్చార్జి ప్రిన్సిపాల్ మహిపాల్‌రెడ్డితోపాటు తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలల జిల్లా కమ్యూనిటీ ఆఫీసర్ శ్రీనివాస్‌కు కలెక్టర్ మెమో జారీ చేశారు. అయితే, ఈ చర్యలపై విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సస్పెన్షన్లు, మెమోలు జారీ చేసి చేతులు దులుపుకోవడం కాదని, గురుకులంలో పిల్లలకు రక్షణ కల్పించాలని స్పష్టం చేస్తున్నారు. కొత్త భవనం పూర్తి చేయించడంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాన్ని క్లీన్ చేసి ప్రహరీ నిర్మిస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేదని కాదని చెబుతున్నారు. అలాగే పిల్లలు పడుకునేందుకు బెడ్స్‌ను, డాక్టర్‌ను నియమించాలని స్పష్టం చేస్తున్నారు. అధికారుల కంటే ముఖ్యంగా ప్రభుత్వానిదే పెద్ద తప్పని విమర్శిస్తున్నారు.
విద్యార్థి మృతి విషయం తెలియడంతో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తోపాటు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గురుకులాన్ని సందర్శించారు. నూతన భవనంలో విద్యార్థుల గదులను పరిశీలిస్తుండగా, అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు, విద్యార్థుల మరణాలపై నిలదీశారు. పదిహేను రోజుల క్రితమే ఓ విద్యార్థి చనిపోతే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. పిల్లలకు పడుకునేందుకు బె డ్లు లేవని, మూత్రశాలలు, మరుగుదొడ్లు, స్నానాల గదులు దూరం గా ఉన్నాయని దృష్టికి తెచ్చారు. అప్పటికే అదనపు కలెక్టర్ రాంబా బు అక్కడికి రావడంతో సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని విప్ ఆదేశించారు.