చిగురుమామిడి, జనవరి 21 : కరీనంగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని తిమ్మాపూర్, చిగురుమామిడి, గన్నేరవరం మండలాల్లో జంతు గణన సర్వే నిర్వహించామని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శేఖర్ తెలిపారు. మండలంలోని చిన్న ముల్కనూరులో ఆయన మాట్లాడుతూ.. 2026 సంవత్సరాలకు గాను జంతువుల గణన సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి సర్వే చేపడతామన్నారు. తిమ్మాపూర్ మండలంలో తిమ్మాపూర్, మల్లాపూర్ గ్రామాల్లో వలస పక్షులు, పునుగు పిల్లి, అడవి పిల్లి, గోల్డెన్ నక్క హైనాలు, ఎలుగుబంట్లు ఉన్నాయన్నారు.
వాటితో పాటు తిమ్మాపూర్ మండలంలోని తాపాల నరసింహస్వామి ఆలయం వెనుకగల మానేరు డ్యామ్ లో వలస పక్షులు, నెమల్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. చిగురుమామిడి, గన్నేరువరం మండలాల్లో ఎలుగుబంట్లు, కుందేళ్లు, నక్కలు,హైనాలు ఉన్నాయన్నారు. గ్రామాల్లో గుట్టలు చెరువులతోపాటు పరువు ప్రాంతాలను పరిశీలించి సర్వే ను చేపట్టడం జరిగిందన్నారు. నాలుగు రోజుల్లో సర్వే పూర్తికానున్నట్లు సెక్షన్ ఆఫీసర్ శేఖర్ తెలిపారు.