కమాన్‌చౌరస్తా, నవంబర్ 25: ‘ఇదేం అన్నం.. ముద్దకు మద్ద అయింది. మాడిపోయింది. ఇదెట్ల తినమంటరు’ అని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్ విద్యార్థులు మండిపడ్డారు. సోమవారం మధ్యాహ్నం భోజనంలో ముద్దలు, మాడిపోయిన అన్నం వడ్డించడంతో ఆగ్రహించారు. ‘ఈ ముద్దల అన్నం మాకొద్దు’ అంటూ అన్నం గంజుతో పాఠశాల ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. తమకు రోజూ ఇలాంటి అన్నం పెడుతున్నారని హెచ్ఎం, ఉపాధ్యాయులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఒక్క రోజూ మెనూ పాటించడంలేదని, మధ్యాహ్నం భోజనంలో సాంబార్‌తో సరిపెడుతున్నారని వాపోయారు.
ఇదేంటని సిబ్బందిని ప్రశ్నిస్తే.. ‘ప్రభుత్వం నుంచి ఇవే వచ్చాయి. ఇవే పెడతాం. తింటే తినండి, లేకుంటే లేదు’ అని తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆవేదన చెందారు. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. తమ పిల్లలకు మధ్యాహ్నం భోజనం సరిగ్గా పెట్టడం లేదంటూ తామే వండి పెడతామని సిద్ధమయ్యారు. వెంటనే ఉపాధ్యాయులు కలుగజేసుకుని విద్యార్థులకు సరైన ఆహారం అందిస్తామని తెలపడంతో వారు శాంతించారు. ఈ విషయమై మధ్యాహ్న భోజన కార్మికురాలు కవిత మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి వచ్చిన బియ్యం, వంట సామగ్రితోనే వంట చేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని ఉదయం వంటల ఇన్చార్జి ఉపాధ్యాయురాలు, ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన బియ్యంతోనే వంట చేయాలని సూచించడంతో తాము వంట చేశామని తెలిపారు.