సిరిసిల్ల కలెక్టరేట్, జూలై 10: సిరిసిల్ల రాజీవ్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొత్తం 324మంది విద్యార్థులకు ఐదుగురు టీచర్లే ఉండడంపై తల్లిదండ్రులు ఆగ్రహించి రోడ్డెక్కారు. తమ పిల్లల భవిష్యత్‌ను అంధకారంలో పడేయవద్దని ఆగ్రహించారు. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. రాజీవ్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో 122మంది, ఉన్నత పాఠశాలలో 202మంది ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్నారు. కేవలం ఐదుగురు ఉపాధ్యాయులతోనే పదో తరగతి వరకు విద్యార్థులకు బోధన చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల గడుస్తున్నా.. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో టీచర్లను నియమించక పోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహించారు. తమ చిన్నారులకు నాణ్యమైన విద్య అందడం లేదని ఆవేదన చెందారు. వెంటనే ఉపాధ్యాయులను పాఠశాలకు పంపించి, తమ పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే డీఈవో రమేశ్‌కుమార్ అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలు జరుగుతున్నాయని, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజీవ్‌నగర్ పాఠశాలకు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు వస్తారని తెలుపడంతో వారు ఆందోళన విరమించారు.