కార్పొరేషన్/ కలెక్టరేట్/శంకరపట్నం/ చిగురుమామిడి/ గంగాధర/ గన్నేరువరం, జూలై 19: అంగన్వాడీ కేంద్రాల్లో తల్లులు, పిల్లలకు అందిస్తున్న సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని నగర డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్ సూచించారు. శుక్రవారం రాంనగర్‌లోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలకు తమ ప్రీస్కూల్ పిల్లలను పంపించాలన్నారు. కేంద్రం ద్వారా అందించే పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. ప్రస్తుత వర్షకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అధికారులు స్వప్న, శ్రీలత, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
26వ డివిజన్లో నిర్వహించిన అంగన్వాడీ బడి బాట కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నక్క పద్మాకృష్ణ పాల్గొన్నారు. చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపించి, మంచి ఆహారంతో పాటు విద్యనందించేందుకు కృషి చేయాలన్నారు. నగరంలోని కార్ఖానాగడ్డ అంగన్వాడీ 1 కేంద్రంలో నిర్వహించిన శుక్రవారం సభ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ రాజమణి పాల్గొని మాట్లాడుతూ, ముసురు వానలు పడుతున్న క్రమంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వర్షపు నీరు నిలిచి ఉంటే వాటిలో దోమల బెడద పెరిగి డెంగ్యూ లాంటి విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉంటుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారం చిన్నారుల్లో ఐరన్ లోపాన్ని నివారిస్తుందన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రామక్క, అంజలి, కళావతి, తల్లులు, పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కాలనీ మహిళలు పాల్గొన్నారు.
అల్గునూర్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన శుక్రవారం సభలో పాల్గొన్న సూపర్వైజర్ శ్రీలత మాట్లాడుతూ, గర్భిణులు, బాలింతలు అంగన్వాడీలో పోషకాహారాన్ని తీసుకోవాలని, ప్రతి నెలా పిల్లల బరువు చూపించుకోవాలని సూచించారు. చిన్నారులకు అన్నప్రాసన చేయించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం శ్రీవాణి, ఆశ కార్యకర్తలు స్వరూప, కనకలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు జమున, అన్నపూర్ణ, వేణుకుమారి, చిన్నారుల తల్లులు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.
శంకరపట్నం మండలం కొత్తగట్టు అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీవాణి పాల్గొని చిన్నారుల తల్లులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అలాగే ఆరోగ్య సంరక్షణకు మహిళలు, తల్లులు, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో వైద్యాధికారి, అంగన్వాడీ టీచర్లు విజయ, భారతి, పంచాయతీ కార్యదర్శి మమత, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
గంగాధర మండలం ఆచంపల్లి, గంగాధర అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగాధరలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో దమ్మని రాము పాల్గొని పోషకాహారం, పరిశుభ్రత, చిల్డ్రన్, మహిళా హెల్ప్‌లైన్ గురించి వివరించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్లు రమాదేవి, రేణుక, అంగన్వాడీ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
చిగురుమామిడి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన శుక్రవారం సభ కార్యక్రమంలో బాలింతలకు పోషకాహారం, ఆరోగ్య సూత్రాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజశ్రీ, పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ, ఏఎన్ఎం రజిత, అంగన్వాడీ టీచర్లు ధనలక్ష్మి, అనురాధ, సంపూర్ణ, ఇందిర, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.
గన్నేరువరం మండలం ఖాసీంపేట అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభ నిర్వహించగా, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఇస్రత్ సుల్తాన పాల్గొని పౌష్టికాహారం, గర్భిణుల ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, పిల్లల పెరుగుదలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రాజేశ్వరి, శ్యామల పాల్గొన్నారు.