Anganwadi | చిగురుమామిడి, అక్టోబర్ 10: అక్షరాలు నేర్చుకునేందుకు అంగన్వాడీలకు కేంద్రాలకు వచ్చేచిన్నారులు భయం భయంగా అంగన్వాడీ కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ-4వ సెంటర్ రెండు నెలల క్రితం అద్దె రూముకు మార్చారు. అద్దె రూములో అంగన్వాడీని కొనసాగిస్తున్నప్పటికీ అందులో సరైన వసతులు లేకపోవడంతో చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంగన్వాడీ కేంద్రానికి విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో పాటు వంట చేసేందుకు అనువుగా లేకపోవడం, నీటి సౌకర్యంతో పాటు మూత్రశాలలు, మరుగుదొడ్డి లేకపోవడంతో చిన్నారులను చుట్టూ ఉన్న కాలి ప్రదేశంలోకి తీసుకెళ్లాల్సి వస్తుంది.
ప్రదేశం అంతా ఖాళీగా ఉండటంతో చెట్లు ఏపుగా పెరిగి నిత్యం పాములు క్రిమికిటకాలు తిరగడంతో చిన్నారులు భయం భయంగా అంగన్వాడి కేంద్రంలో గడుపుతున్నారు. చిన్నారులతోపాటు గర్భిణీలు అంగన్వాడీ కేంద్రాలకు నిత్యం రావాల్సిన పరిస్థితి ఉండడంతో వారు వచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారు. చిన్నారులను సైతం తల్లిదండ్రులు అంగన్వాడికి పంపించేందుకు వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్వాడి కేంద్రాన్ని మరోచోటికి మార్చి చిన్నారులకు అన్ని వసతులు కల్పించేలా ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.