కలెక్టరేట్, అక్టోబర్ 14 : ‘మాకు జరుగుతున్న అన్యాయంపై ఉన్నతాధికారులు పట్టించుకోరు. మా సమస్యలు పరిష్కరించరు. ఇచ్చిన దరఖాస్తులు ఇచ్చినట్లుగా చెత్తకుప్పలో వేస్తున్నారు. ఇక అర్జీలు ఇచ్చుడెందుకు? ప్రజావాణికి వచ్చుడెందుకు’ అంటూ, పలువురు అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి గోడు వినకుండా, ఫిర్యాదులు ఇలా తీసుకుని అలా సంబంధితాధికారులకు అందజేస్తున్నారే తప్ప, పరిష్కారమార్గాలు మాత్రం చూపడం లేదని మండిపడుతున్నారు. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటే తాము ఇబ్బందుల నుంచి గట్టెక్కేవారమని, అధికారుల వ్యవహార శైలే సమస్యల పరిష్కారానికి గొడ్డలి పెట్టులా మారుతున్నదంటూ ధ్వజమెత్తుతున్నారు. తన సమస్యపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ వృద్ధుడు కలెక్టర్ ఎదుటే తన దరఖాస్తు నేలకేసి విసిరి కొట్టి నిరసన తెలిపాడు. తనకు న్యాయం చేసే దాకా ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ ఫిర్యాదుల స్వీకరణ టేబుల్ ఎదుట బైఠాయించాడు. తాను ఇప్పటికే యాభైకి పైగా దరఖాస్తులు ప్రజావాణిలో అందించినా, ఇప్పటివరకు న్యాయం జరుగలేదని, తహసీల్ అధికారులు, భూకబ్జాదారులు కుమ్మక్కవడంతోనే తన భూమి తనకు దక్కకుండా పోతుందంటూ రోదించాడు. అధికారులను దూషిస్తూ వృద్ధుడు కేకలు వేయడంతో ప్రజావాణిలో దరఖాస్తులు తీసుకుంటున్న యంత్రాంగం ఒక్కసారిగా విస్తుపోయింది. వెంటనే తేరుకుని సమస్య పరిష్కరిస్తామని సముదాయించినా, ససేమిరా అనడంతో పోలీసులు వృద్ధుడిని బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. కాగా, సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు 127 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దసరా సందడి ఇంకా కొనసాగుతుండగా, అటు ప్రజలు, ఇటు అధికారులు కూడా హాజరుకాలేదని స్పష్టమవుతున్నది.
నిర్దిష్ట సమయానికి ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతున్నా, అధికారులు మాత్రం ఆలస్యంగా వస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం పదిన్నర గంటలకు మొదలయ్యే ప్రజావాణిలో ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు అందుకునేందుకు జిల్లా ఉన్నతాధికారులు విధిగా హాజరుకావాల్సి ఉంటుంది. అయితే, పదకొండు దాటినా రాకపోగా, కేవలం జిల్లా రెవెన్యూ అధికారి పవన్‌కుమార్ మాత్రమే దరఖాస్తులు స్వీకరించడంపై పలువురు ఫిర్యాదుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నామ్కేవాస్తేగా వస్తూ ఇలా దరఖాస్తులు తీసుకుని, అలా సంబంధిత విభాగాల సిబ్బందికి అందజేస్తున్నారనే ఆరోపణలు చేశారు. తాము అందజేస్తున్న ఫిర్యాదులపై తమకు న్యాయం జరుగకున్నా, ఉన్నతాధికారులు ఫిర్యాదులు పరిశీలిస్తేనైనా తమకు సంతృప్తి కలుగుతుందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
నేను కొన్నేళ్ల క్రితం రాంపూర్ నుంచి నగరానికి వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డా. మా ఊరిలో 714 సర్వే నంబర్లో నా తల్లి పేర కొంత భూమి ఉండగా, దానిని బంధువులు కొందరు నాకు తెలియకుండా ఇతరులకు విక్రయించారు. దీనిపై సంబంధిత రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన. ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రజావాణిలో అర్జీ ద్వారా సమస్య వివరించిన. పది నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో ఆగ్రహానికిలోనై అధికారుల ఎదుట బైఠాయించిన. అయినా, వారు మాత్రం నాకు ఎలాంటి భరోసా ఇవ్వకుండానే పోలీసులతో బయటకు గెంటివేయించారు. నా గోడు చెప్పుకొనేందుకు కలెక్టర్‌ను కలిసే అవకాశం కల్పించాలంటూ పోలీసులను దీనంగా వేడుకున్నా, కనికరించలేదు.