PRTU | పెద్దపల్లి, అక్టోబర్26: జిల్లా సబ్ రిజిస్ట్రార్‌ను మోసం చేసి పీఆర్టీయూ (టీఎస్) హౌసింగ్ బోర్డు సొసైటీకి చెందిన ఓపెన్ ప్లాట్లను అక్రమంగా బయట వ్యక్తులకు విక్రయించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపించాలని పీఆర్టీయూ తెలంగాణ ప్రెసిడెంట్, కంటెస్టెడ్ అభ్యర్థి కర్రు సురేష్ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2021లో ఉపాధ్యాయ సంఘ సొసైటీ ఓపెన్ ప్లాట్ల అమ్మకంలో శ్రీపాల్ రెడ్డి బూటకపు తీర్మానాలు చేసి, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జాలి మహేందర్ రెడ్డి, మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట అధ్యక్షుడు కమలాకరరావు, మాజీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మనోహర్‌రావు సంతకాలను ఫోర్జరీ చేశారని ఆరోపించారు.
బాధ్యతాయుత పదవిలో ఉండి నీచపనులు చేయడం సభ్య సమాజానికి అవమానకరమన్నారు. ఇలాంటి అవినీతిపరులకు చట్టసభల్లో కొనసాగే అర్హతలేదని పేర్కొన్నారు. సంఘ నాయకుల అక్రమాలను ఎండగడుతున్న వారిని క్రమశిక్షణ చర్యల పేరుతో తొలగిస్తూ, అక్రమ నియామకాలతో సంఘ నియమావళిని తుంగలో తొక్కుతున్నారని దుయ్యబట్టారు. 2019 నుంచి సంఘ బైలా, నూతన మేనేజిమెంటు కమిటీ అప్రూవల్ కాలేదని రాష్ర్ట అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనధికార వ్యక్తులుగానే పరిగణించబడతారని స్పష్టం చేశారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల అసమర్ధత, అవగాహనలోపం, తీవ్ర నిర్లక్ష్యం వలన సంఘ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యత్వం రద్దయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అక్రమాలపై కమిషనర్ అండ్ ఐజీ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖకి, జీఏడీకి ఫిర్యాదు చేయడం జరిగిందని వివరించారు. ఒంటెద్దు పోకడలతో వెళుతూ సంఘానికి నష్టం జరిగేతే, పోరాటాన్ని తీవ్రతరం చేసి త్వరలోనే పీఆర్టీయూ టీఎస్ రాష్ర్ట సంఘం అన్ని జిల్లా శాఖలకు ఎన్నికలు నిర్వహించి రాష్ర్ట సంఘాన్ని స్వాధీనం చేసుకుటామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ర్ట నాయకులు బొంతల సతీష్, బాబు, వంతడుపుల రఘు, సత్యనారాయణ, కుంట రామన్న, మోగురం సుధాకర్, శ్రీధర్, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజమౌళి, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి, ఆడెపు రవి, నాగరాజు, కిష్టయ్య, మల్లేశ్, రామన్న, ఓదెలు, సతీష్ కుమార్, అరుణ్, కేశవ్, కృష్ణ, రవి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.