Prajavani | కలెక్టరేట్, ఆగస్టు 25 : కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ కొనసాగింది. జిల్లా నలుమూలల : నుంచి వచ్చిన 328 మంది అర్జీదారులు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా అధికారులకు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించిన అధికారులు వాటిని సంబంధిత యంత్రాంగానికి అందజేసి, వెంటనే పరిష్కరించాలంటూ ఆదేశించారు. ఆన్లైన్లో పెండింగ్ ఉంటే సత్వరమే పూర్తి చేయాలని సూచించారు.
అధికారులతో కలెక్టర్ సమావేశం
ప్రజావాణి అనంతరం పలు ప్రభుత్వ శాఖల అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి ఆడిటోరియంలో సమావేశమయ్యారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం కొత్తగా ధరఖాస్తులు వస్తే స్వీకరించాలన్నారు. సుముఖత వ్యక్తం చేయని లబ్దిదారుల స్థానంలో అర్హులైన ధరఖాస్తులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని స్పష్టం చేశారు. ఎంపిడివోలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ దశలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. 15 ఏళ్ళు నిండిన బాలికలు, 50 ఏళ్ళు పైబడ్డ మహిలలు, దివ్యాంగులను స్వయం సహాయక సంఘాల్లో చేర్పించాలని సంబంధిత అధికారులను సూచించారు. కళాశాలలో చదివే బాలికలను కూడా ఈసంఘాల్లో చేర్పించాలని, గ్రూపుల్లో చేరటం ద్వారా విద్యార్థులకు సమావేశాలు, అకౌంట్లు, వ్యాపార నైపుణ్యంపై అవగాహన వస్తుందన్నారు.
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉల్ సబి పండగల నేపథ్యంలో ఎంపిడివోలు, మున్సిపల్ కమీషనర్లు పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రోడ్లపై, మురుగు కాలువల్లో ఉన్న చెత్తను వెంట వెంటనే తొలగించాలని, మండల ప్రత్యేకాధికారులు రానున్న వారం రోజుల్లో అన్ని ప్రభుత్వ వసతి గృహాలను సందర్శించి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మికిరణ్, డిఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్జీవోలు మహేశ్వర్, రమేశ్ బాబుతో పాటు అధికారులు పాల్గొన్నారు.