మానకొండూర్ రూరల్, ఏప్రిల్ 22: ఆలయంలో పెళ్లి చేసుకున్న నూతన జంట కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న కారు కల్వర్టు కిందకు దూసుకెళ్లిన ఘటన మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి శివారులో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, మరో ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మానకొండూర్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండకు చెందిన రిటైర్డ్ ఎస్ఐ దామెర సురేందర్, కౌసల్య దంపతుల కుమారుడి వివాహం ఆదివారం వేములవాడలో జరిగింది. సోమవారం మధ్యాహ్నం వధూవరులు దామెర తిలక్, స్వాతి, వరుడి తల్లిదండ్రులతోపాటు వధువు చెల్లి విద్య ఐదుగురు కారులో హనుమకొండకు తిరుగు పయనమయ్యారు.
ఈ క్రమంలో గట్టుదుద్దెనపల్లి గ్రామ శివారులో నేషనల్ హైవే రోడ్డు విస్తరణలో భాగంగా చేపట్టిన కల్వర్టు నిర్మాణం వద్ద కారు అదుపుతప్పింది. కల్వర్టు కిందకు కారు దూసుకెళ్లడంతో వధూవరులతో పాటు సురేందర్, కౌసల్య, విద్య వాహనంలోనే ఇరుక్కుపోయారు. వెంటనే స్థానికులు పోలీసులకు, 108 వాహనానికి సమాచారం అందించారు. సహాయక చర్యలు చేపట్టి కారు నడుపుతున్న తిలక్తోపాటు మిగతా వారందరినీ బయటకు తీశారు. ప్రమాదంలో కౌసల్య, విద్యకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా, వారందరినీ కేశవపట్నం 108 వాహనంలో ఈఎంటీ శ్రీధర్, పైలట్ గోపీకృష్ణ కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మానకొండూర్ సీఐ రాజ్ కుమార్ తెలిపారు.