ఎనిమిదేండ్లలో ఏ ఒక్క వర్గం సంక్షేమాన్ని పట్టించుకోని కేంద్రం ప్రభుత్వోద్యోగులపైనా చిన్నచూపే ఆదాయ పన్ను పరిమితి పెంచకుండా వివక్ష రాష్ట్రం వేతనాలు పెంచితే ట్యాక్స్ రూపంలో కోతఉమ్మడి జిల్లా ఉద్యోగుల నుంచే ఏటా 450 కోట్ల వసూలు అన్ని రంగాల్లో ఆదర్శంగా రాష్ట్రం సమర్థ నాయకత్వంతోనే దేశ పురోగతి కేసీఆర్ లాంటి నాయకుడితో దేశంలోని ఉద్యోగవర్గాలకు మేలు ఆయన జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే అది సాధ్యం అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు ముక్తకంఠంతో సంపూర్ణ మద్దతు
‘ఒక దేశ అభివృద్ధి, సంక్షేమం ఒక సమర్థ నాయకత్వంపైనే ఆధారపడి ఉంటుంది. సమస్యను అర్థం చేసుకొని పరిష్కరించే నాయకుడుంటే ప్రజానీకానికి న్యాయం జరుగుతుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటే అన్ని వర్గాలకూ మేలు చేకూరుతుంది. ఇప్పుడు దేశానికి ఇలాంటి నాయకుడు, నాయకత్వమే కావాలి. ఇది ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది. అందుకు నిదర్శనమే ఎనిమిదేళ్ల పాలన’ అని ప్రభుత్వోద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. వేతనాలు పెంచినందుకు ఈ మాటలు చెప్పడం లేదని.. ఉద్యమం చేపట్టి, రాష్ర్టాన్ని సాధించి, నవ తెలంగాణ నిర్మాణం కోసం అడుగులు వేస్తున్న ఆయన సంకల్పాన్ని చూస్తే ఎవరైనా ఇలానే ప్రశంసిస్తారని చెబుతున్నారు. మారిన జీవన ప్రమాణాలు, పెరుగుతున్న ధరలు, ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం.. తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచితే.. కేంద్రం మాత్రం ఆదాయ పన్ను రూపంలో మింగేస్తున్నదని, పన్ను మినహాయింపు పరిమితి పెంచకుండా ఎనిమిదేళ్లుగా వివక్ష చూపుతున్నదని మండిపడుతున్నారు. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్‌తోనే తెలంగాణ ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అదే దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వస్తే భారతదేశం ఒక రోల్‌మోడల్‌గా మారుతుందని అభిప్రాయపడుతున్నారు.
కరీంనగర్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సమైక్య రాష్ట్రంలో దగా పడిన ఉద్యోగులకు స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో న్యాయం జరుగుతున్నది. తెలంగాణ సర్కారు ఆది నుంచీ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీగా ఉంటున్నది. 2018 జూలై ఒకటో తేదీ నుంచే కొత్త పీఆర్సీ అమల్లోకి తెచ్చి, 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వేతన చెల్లింపులు చేస్తున్నది. కొత్త పీఆర్సీ ప్రకారం చూస్తే.. 30 శాతం ఫిట్మెంట్తో కూడిన వేతన స్థిరీకరణ చేయడంతోపాటు ఇటీవలి కాలంలో దాదాపు 10 శాతం డీఏ పెంచింది. దీంతోపాటు మూల వేతనంపై పెరిగిన హెచ్ఆర్ఏ లాంటి ఇతర వాటిని పరిగణలోకి తీసుకొని చూస్తే.. వేతనం దాదాపు 50 శాతం పెరిగింది. ఈ విషయాన్ని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఇప్పటికే సగర్వంగా ప్రకటించాయి. నిజానికి ఉత్తర భారతంతో పోలిస్తే మన ఉద్యోగులకు వేతనాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచడంతో అటెండర్ నుంచి మొదలుకొని ప్రతి ఉద్యోగి ట్యాక్స్ పరిధిలోకి వచ్చినా.. కేంద్రం తీరుతో ఉద్యోగుల్లో ఆ సంతోషం కనిపించడం లేదు.
మారిన జీవన ప్రమాణాలు, పెరుగుతున్న పెట్రోలు, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు, ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం.. తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచుతున్నది. దీంతో అటెండర్ నుంచి మొదలు ప్రతి ఉద్యోగీ టాక్సు పరిధిలోకి వచ్చినా.. కేంద్రం మాత్రం ఆ పన్ను, ఈ పన్ను అంటూ దోచేస్తున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, ఎలక్ట్రిసిటీతోపాటు వివిధ విభాగాలకు చెందిన 30 వేలకు పైగా ఉద్యోగులు ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చారు. వీరితోపాటు పెన్షనర్లు 25 వేల నుంచి 30 వేల మంది ఉన్నారు. ఒక్కో ఉద్యోగి సుమారు 60 వేల నుంచి 4లక్షల వరకు పన్నులు కడుతున్నారు. ఉద్యోగుల గణాంకాల ప్రకారం చూస్తే.. సగటున లక్షా 50 వేల వరకు పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ లెక్కన చూస్తే.. ఉమ్మడి జిల్లా ఉద్యోగులు ఏటా 450 కోట్ల వరకు ఆదాయ పన్నును కేంద్రానికి చెల్లిస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా ట్యాక్స్ కటింగ్‌పై మళ్లీ 4 శాతం సర్‌చార్జీని కేంద్రం వసూలు చేస్తున్నది. ఇదో అదనపు భారం. పెన్షనర్లు కూడా పన్ను పరిధిలోనే ఉన్నారు.
ఈ దేశానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే నాయకుడు చాలా అవసరం. ఇదే సమయంలో క్షేత్రస్థాయి నుంచి పనిచేసిన నాయకత్వం కావాలి. సమస్యలపై పరిపూర్ణ అవగాహన ఉంటే పరిష్కారం చూపించవచ్చు. దీనికి ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనే నిదర్శనమంటున్నారు ప్రభుత్వోద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు. వేతనాలు పెంచినందుకు ఈ మాటలు చెప్పడం లేదని.. ఉద్యమం చేపట్టి, రాష్ర్టాన్ని సాధించి, నవ తెలంగాణ నిర్మాణం కోసం అడుగులు వేస్తున్న ఆయన సంకల్పాన్ని చూస్తే ఎవరైనా ఇవే మాటలను చెబుతారని అంటున్నారు. ఒక్క ఉద్యోగులకే కాదు, అన్ని వర్గాల సంక్షేమానికి మేలు చేశారని కొనియాడుతున్నారు. కారు చీకట్లు అలుముకుంటాయని అంతా భావించిన తెలంగాణలో 24 గంటలు వెలుగులు విరజిమ్మేలా చేయడం అనేది ఒక విజన్ ఉన్న నాయకుడికి మాత్రమే సాధ్యమంటున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ‘జై కిసాన్..’ ‘జై జైవాన్..’ నినాదం వినడమే తప్ప దానిని ఆచరణలో పెట్టిన నాయకులు గతంలో ఎవ్వరూ లేరని, కానీ నేడు సీఎం కేసీఆర్ మాత్రం రుణ మాఫీ, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్‌ను అమల్లోకి తెచ్చి ‘జై కిసాన్’ అన్న నినాదానికి సార్థకత చేకూర్చారని కొనియాడుతున్నారు. ఐటీ రంగానికి హైదరాబాద్‌ను నేడు కేరాఫ్‌గా మార్చడమే కాదు, ప్రతి పల్లెనూ పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దారని చెబుతున్నారు. కేసీఆర్‌లో ఒక విజన్, చేయాలన్న తపన, అన్ని వర్గాలకు మేలు చేయాలన్న సంకల్పం కనిపిస్తుందంటున్నారు. ఇలాంటి నాయకుడి వల్ల తెలంగాణ ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అదే దేశ రాజకీయాల్లోకి వస్తే మన దేశం ప్రపంచానికే ఆదర్శంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీయే కాదు, జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తి రావాలని, అది కేసీఆర్ అయితేనే బాగుటుందని ముక్తకంఠంతో చెబుతున్నారు. ఉజ్వల భారత్ కోసం ఉద్యమవీరుడు రావాలని బలంగా కోరుకుంటున్నారు.
దేశ ప్రగతికి పల్లెలు పట్టుగొమ్మలు అన్న గాంధీ సూక్తులను నిజం చేసిన కార్యక్రమం పల్లె ప్రగతి. 70 ఏండ్లుగా తుమ్మలు మొలిచి, గుడ్డిదీపాలు సైతం వెలుగలేక, ఎలాంటి మౌలిక వసతులు లేక ఈసడింపులకు గురైన పల్లెలు నేడు పచ్చని కేంద్రాలుగా, పరిశ్రమ ప్రాంతాలుగా విలసిల్లుతున్నాయంటే దానికి కారణం సీఎం కేసీఆర్. వైకంఠధామాలు, ప్రకృతి వనాలు, నర్సరీలు, కంపోస్టు షెడ్లు, అవెన్యూ ప్లాంటేషన్లు, ఎటు చూసినా పచ్చని మొక్కలు, జలకళను సంతరించుకున్న చెరువులు, పచ్చని పైర్లతో పొలాలు పల్లెల అందం ఫరిఢవిల్లుతోంది. ప్రజా సంక్షేమంతో పాటు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచే విషయంలోనూ సీఎం కేసీఆర్ గొప్ప చొరవ చూపారు. ఉద్యోగుల సంక్షేమం కోసం సైతం అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే 42 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేసి రికార్డు సృష్టించారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధ్దీకరణ చేస్తున్నారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం కోసం వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇలా అన్ని కార్యక్రమాల్లో తెలంగాణ దూసుకుపోతున్నది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇక్కడి పథకాలకు స్పందన లభిస్తోంది. చాలా దేశాలు వీటిపై అధ్యయనం చేస్తున్నాయి. రైతు బంధు, మిషన్ భగీరథ వంటి పథకాలను యూఎన్వో సైతం కొనియాడిందంటే సీఎం కేసీఆర్ దార్శనికత ఎంత గొప్పదో అర్థమవుతుంది. స్ఫూర్తివంతమైన, చైతన్యవంతమైన నాయకత్వం దేశానికి ఎంతైనా అవసరం. సీఎం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించాల్సిందే.
జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్తే దేశం అభివృద్ధి చెంది ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిపెట్టిన మహానుభావుడు. రాష్ట్రంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రజల మన్ననలు పొంది, రెండుసార్లు అధికారంలోకి వచ్చిన గొప్పవ్యక్తి. కేసీఆర్‌కు రైతులంటే ఎనలేని ప్రేమ. నేను అగ్రికల్చర్ అధికారిగా సిరిసిల్ల అర్బన్‌లో పనిచేస్తున్నా. 24 గంటల ఉచిత కరెంటు అమలు చేయడంతో రాత్రిపూట బాధ తప్పిందని నేను పనిచేసే వద్ద రైతులు సంతోషపడుతున్నరు. రైతు బంధు డబ్బులు పడితే అప్పులు చేయాల్సిన పరిస్థితి తప్పించిన దేవుడు కేసీఆర్ అని అనుకుంటున్నరు. ఎవరైనా రైతులు ఏదైనా కారణంతో చనిపోతే వారి కుటుంబాలకు బీమా ద్వారా వచ్చే రూ.5 లక్షలు ఆర్థిక భరోసా ఇస్తున్నాయి. ఒకప్పుడు సాగుకు సరిపడా నీరులేక రైతులు ఇబ్బందులు పడేవారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సాగునీటి సమస్య తీరడంతో రైతులు సంతోషంగా పంటలు పండిస్తున్నరు. రాష్ట్రంలో రైతుల కోసం అమలవుతున్న పథకాలను నేను ఒక వ్యవసాయ అధికారిగా చాలా దగ్గరగా చూస్తున్నా. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే. అలాంటి వ్యక్తి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశమంతా రైతు సంక్షేమ పథకాలతో అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతాడనే నమ్మకం ఉంది.
– తాళ్లపల్లి సుచరిత, కొలిమికుంట, వ్యవసాయ విస్తరణ అధికారి, సిరిసిల్ల అర్బన్ (చొప్పదండి)
దేశంలో రాజ్యాంగాన్ని కేవలం ఒక ఉత్సవ పుస్తకంగా మార్చివేసే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజల మాటలకు విలువలేని పరిస్థితి దాపురించింది. రాజ్యాంగంలో కేంద్ర, రాష్ర్టాలకు అధికారాలను పంచుతూ, సమాఖ్య పద్ధతిని పొందుపర్చారు. స్పష్టమైన అధికార విభజన చేయడంతోపాటు, కొన్ని అత్యవసర సందర్భాల్లో కేంద్రానికి ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కేటాయించిన జాబితాలోని శాఖలపై కలుగ జేసుకోవాలని స్పష్టం చేశారు. అయితే, కొన్నేండ్లుగా దేశంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో పొందుపర్చిన అంశాలను పాటిస్తున్నట్లు కనిపించడం లేదు. ప్రజాస్వామిక విలువలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో విజనరీ ఉన్న నాయకుడి అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనే ఒక స్వప్నాన్ని సాకారం చేసిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎనిమిదేండ్ల వ్యవధిలో రాష్ర్టాన్ని సుభిక్షంగా మార్చడంతోపాటు అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఆయనకు ప్రజా సమస్యలపై, వాటిని పరిష్కరింపజేసే అంశంపైన స్పష్టమైన అవగాహన ఉంది. ప్రజల ప్రధాన ఆదాయ వనరు, అధిక శాతం మందికి ప్రత్యక్ష ఉపాధిని ఇచ్చే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన రైతు సంక్షేమ పథకాలు, కాళేశ్వరం, ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ వంటి ప్రాజెక్టులు చేపట్టడంతో దేశంలోనే తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారిపోయింది. అలాగే పరిశ్రమలు, ఐటీ వ్యవస్థలోనూ ఆయన తీసుకువచ్చిన రిఫార్మ్స్ ప్రజలకు ఉపాధి, ఉద్యోగాలతో పాటు, రాష్ట్ర తలసరి ఆదాయాన్ని పెంచేందుకు దోహదం చేశాయి. దేశంలో రెండు శాతం భూభాగం, రెండున్నర శాతం జనాభాను కలిగి ఉన్న తెలంగాణ రాష్ట్రం జాతీయ ఆదాయంలో మాత్రం 11 శాతం వాటాను కలిగి ఉందంటే దీనికి సీఎం కేసీఆర్ విజనరే కారణం. దేశంలో ప్రజాస్వామిక విలువలు తగ్గి, అధికారాలు కేంద్రీకృతమై, అభివృద్ధి అంతా కొన్ని చోట్లకు మాత్రమే పరిమితమై, వసుధైక భారతం అన్న మహోన్నత ఆశయానికి భంగం ఏర్పడిన ప్రస్తుత తరుణంలో దేశానికి విజనరీ ఉన్న కేసీఆర్ వంటి నాయకుడి అవసరం ఉంది.
– ఎండీ వకీలు, రెవెన్యూ అసోసియేషన్ జగిత్యాల శాఖ అధ్యక్షుడు
తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమం విషయంలో దేశం మొత్తం తెలంగాణ వైపు తిరిగి చూసేలా సీఎం కేసీఆర్ మార్చారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ప్రపంచం మొత్తం భారతదేశం వైపు తిరిగి చూస్తుందనడంలో సందేహం లేదు. అరు దశాబ్దాల పాటు అనేక అవమానాలకు, దోపిడీకి, సాంస్కృతిక ఈసడింపునకు గురైన తెలంగాణ ప్రాంతాన్ని విముక్తం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడంలో కేసీఆర్ చూపిన తెగువ కీర్తించదగినది. సీఎం హోదాలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు నభూతో నభవిష్యత్. కాళేశ్వరం ప్రాజెక్టు నాలుగేండ్లలో నిర్మించడం ఒక ఆశ్చర్యం. మల్లన్నసాగర్, ఎస్సారార్, ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ వంటి పథకాలతో నేడు తెలంగాణ భూమికి ఒక పచ్చని కోకలా మారింది. 10 జిల్లాలను 33 జిల్లాలుగా వికేంద్రీకరించి, ప్రజల చెంతకు పాలనను తీసుకువెళ్లిన ఆలోచనాపరుడు కేసీఆర్. విద్యారంగాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం విప్లవాత్మక చర్య. కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, ఆరోగ్యలక్ష్మి, ప్రభుత్వ దవాఖానల్లో డయాలసిస్ కేంద్రాలు, ప్రసవాలు ఇలా అనేక ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టడం ప్రజలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అవినీతి రహిత పాలనతో దేశంలో రెండో స్థానంలోకి చేరుకుంది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేకపోవడం అందరినీ ఆలోచింపజేస్తుంది. చాలా రాష్ర్టాల్లో ఇప్పటికీ సరైన నీటిపారుదల సౌకర్యాలు లేవు. ప్రాజెక్టుల నిర్మాణాలు లేవు. పరిశ్రమల స్థాపన ఒక కళగా మారిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ క్రమంగా ప్రైవేటీకరించబడుతున్నాయి. కొద్ది రోజుల్లో మిలిటరీ సైతం ప్రైవేటీకరణ జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ స్థితిలో దేశానికి దిక్సూచిగా మార్గాన్ని చూపగలిగిన నాయకుడు కావాలి. అలాంటి జ్ఞానత, దార్శనికత, సీఎం కేసీఆర్‌కు ఉంది.
– బోగ శశిధర్, డిప్యూటీ తహసీల్దార్, టీఎన్జీవోస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు సైతం రైతుబంధు, రైతు బీమా, దళితబంధు వంటి పథకాలను వర్తింపజేస్తున్నది. ఇలాంటివి అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దేశవ్యాప్తంగా అమలు చేస్తే కేంద్ర ఉద్యోగులంతా గుండెల్లో పెట్టుకుని పూజిస్తరు. రాష్ట్రం ఏర్పడిన కేవలం ఎనిమిదేళ్లలో ఇక్కడి ఉద్యోగులకు ఒకసారి 42, మరో సారి 30 శాతం చొప్పున 72 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ఉద్యోగుల ఉద్యమాలను గుర్తించి తెలంగాణ ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారు. కరోనా సమయంలో ఇచ్చిన ఫిట్మెంట్ కోసం బిశ్వాల్ కమిటీ 7.5 శాతం మాత్రమే సిఫారసు చేస్తే కేసీఆర్ మాత్రం 30 శాతం ఇచ్చి తమది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంటని మరోసారి రుజువు చేశారు. ఉద్యోగుల కష్ట, నష్టాలు, సాదక బాదకాలు తెలిసిన నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే రాష్ట్ర ఉద్యోగులు ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు. అయితే, దేశంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ఎజెండాలు తీసుకుంటే జాతీయ స్థాయిలో కేసీఆర్‌కు ఎదురే ఉండదు. ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఉన్న కొత్త నేషనల్ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని, పాత పెన్షన్ విధానాన్నే కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతోపాటు రాష్ట్రంలో కొనసాగుతున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపీఎస్) రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తే దేశంలోని ఇతర రాష్ర్టాల ఉద్యోగులు కేసీఆర్‌ను హృదయ పూర్వకంగా విశ్వసిస్తారు. అంతే కాకుండా ఆదాయ పన్ను పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని, ప్రతి ఉద్యోగికి కుటుంబానికి ఉచిత కార్పొరేట్ వైద్య సహాయం అందిస్తామని కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీ ఎజెండాలో చేర్చితే ఆయనకు దేశంలో ఎదురే ఉండదు. ఉద్యోగులే ముందుండి గెలిపించుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉద్యోగుల సమస్యలు తెలిసిన నాయకుడైన కేసీఆర్ రాష్ట్రంలో ఉద్యోగులకు మద్దతుగా నిలిచినట్లే దేశంలోని మిగతా రాష్ర్టాల ఉద్యోగులకు వెన్నుదన్నుగా నిలుస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఏది చేయాలనుకుంటారో అది ఖచ్చితంగా చేసి తీరుతరు.
– దారం శ్రీనివాస్ రెడ్డి,
టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కరీంనగర్
ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో మార్పులు రావాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ పనితీరు వల్ల రోజు రోజుకూ అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యుడు బతకడం కష్టంగా మారింది. అదే ఇక్కడ మాత్రం సీఎం కేసీఆర్ పాలనలో ఓ వైపు సంక్షేమ, అభివృద్ధి పనులతో వేగంగా రాష్ట్రం అభివృద్ధి సాధిస్తున్నది. రాష్ట్రంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందుతున్నది. 24 గంటల కరెంటు వస్తున్నది. ఇతర రాష్ర్టాల్లో మాత్రం తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. బీజేపీ ప్రభుత్వం అన్ని సేవలు, వస్తువులపై జీఎస్టీ పెంచుతూ పోతున్నది. ఇలా అయితే సామాన్యులపై ఆర్థిక భారం ఎక్కువగా పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయపన్ను పరిమితిని పెంచాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా ఏ మార్పులూ చేయడం లేదు. రోజు రోజుకూ పడిపోతున్న రూపాయి విలువ వల్ల ఆర్థికంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సంస్కరణలు జరగాలంటే తప్పనిసరిగా కేసీఆర్ వంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి.
– మొహమ్మద్ జహంగీర్, ప్రభుత్వ ఉద్యోగి(కరీంనగర్ కార్పొరేషన్)
పెరుగుతున్న ఖర్చులు, ఇతర అవసరాల ప్రకారం వేతనాలు పెరిగినా.. అందుకనుగుణంగా ఆదాయపన్ను పరిమితి పెంచకుండా కేంద్రం వివక్ష చూపుతున్నది. గతంలో ఒక్క స్లాబ్ మాత్రమే ఉండగా.. కొత్తగా మరో స్లాబ్‌ను అందుబాటులోకి తెచ్చి రెండు రకాల స్లాబ్‌లను అమలు చేస్తున్నదే తప్ప.. ఆదాయ పన్ను, స్టాడెండ్ డిడెక్షన్, పొదుపు మినహాయింపుల పరిమితులు మాత్రం పెంచకుండా ఎనిమిదేళ్లుగా చుక్కలు చూపుతున్నది. ఆదాయ పన్ను మొదటి స్లాబ్ ప్రకారం 2.50 లక్షల నుంచి 5 లక్షల వరకు 5 శాతం.. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20 శాతం.. 10 లక్షలకు పైగా ఆదాయముంటే 30 శాతం ట్యాక్స్ చెల్లించాలి. బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రెండో స్లాబ్ ప్రకారం 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు 5 శాతం.. 5 లక్షల నుంచి 7.50 లక్షల వరకు 10 శాతం.. 7.50 లక్షల నుంచి 10 లక్షల వరకు 15 శాతం.. 12.50 లక్షల నుంచి 15 లక్షల వరకు 20 శాతం.. 15 లక్షలకుపైగా ఆదాయముంటే 30 శాతం ట్యాక్సు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రెండో స్లాబ్‌ను ఉద్యోగులు పక్కన పెట్టారు. రెండో స్లాబ్‌ను ఎంచుకుంటే పొదుపు పరిమితి అంటే లక్షా 50వేల వరకు మినహాయింపులు వర్తించవు. అందుకే ఉద్యోగులంతా మొదటి స్లాబ్‌నే ఆధారంగాచేసుకొని పన్ను చెల్లిస్తున్నారు. ఈ స్లాబ్‌లను మార్చాలని, ముఖ్యంగా ఆదాయ పన్ను పరిమితిని 5 లక్షలకు పెంచాలని, అలాగే ప్రస్తుతమున్న పొదుపు పరిధిని లక్షా 50 వేల నుంచి 3 లక్షలకు పెంచాలని ఉద్యోగులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. కానీ, కేంద్రం మాత్రం ప్రతి బడ్జెట్లో వేతన జీవుల ఆశలపై నీళ్లు చల్లూతూనే ఉన్నది. దీంతో ఏటా లక్షల్లో ట్యాక్స్ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
తెలంగాణ వచ్చిన తర్వాత పే స్కేల్స్, డీఏలు, పీఆర్సీ విషయంలో రాష్ట్రంలోని ఉద్యోగులంతా సంతృప్తిగా ఉన్నరు. కొన్నేండ్లుగా మేం ఇన్‌కం ట్యాక్స్ పరిమితిని పెంచుమని కేంద్రంతో ఎంత కొట్లాడినా అది సాధ్యమైతలేదు. సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లోకి వెళ్తే సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం తేవడంతో పాటు ఇన్‌కాం ట్యాక్స్ పరిమితి పెంచే అవకాశం ఉంది. దేశంలో ట్యాక్స్‌ను నిజాయితీగా పే చేస్తున్నది మేమే. అలాంటి ఐటీ సీలింగ్‌ను పెంచుమంటే కేంద్రం పరిశీలనలోకి తీసుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల సామాన్యుడు కూడా దైనందిన జీవితంలో బతకడం చాలా కష్టంగా మారింది. పాలమీద జీఎస్టీ, మామూలు మధ్య తరగతి కుటుంబాలకు కూడా ట్యాక్స్‌లు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, దళితబంధు, రైతుబంధు వంటి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. అలాంటివి దేశ వ్యాప్తంగా పెడితే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న సామాన్యులకు మేలవుతుంది. ఉద్యోగులంతా రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఆనందంగా ఉన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే అభద్రతా భావంలో ఉన్న పేద, సామాన్య కుటుంబాలకు ఎంతో లాభం జరుగుతుంది.
– బొంకూరి శంకర్, పెద్దపల్లి జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు (పెద్దపల్లి, నమస్తే తెలంగాణ)