Minister Adluri Laxman Kumar | ధర్మారం ,జూన్ 30: తమ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని పనికిరాని విమర్శలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దమ్ముంటే విచారణ జరిపించి అవినీతిపై నిరూపించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఇటీవల వివిధ సంఘటనల్లో బొమ్మరెడ్డి పల్లి, చామనపల్లి గ్రామాలలో 157 గొర్రెలకు పరిహారం కింద బాధిత పెంపకం దారులకు ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.8 లక్షల 70 చెక్కులను కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి అందజేశారు.
మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం నంది మేడారం గ్రామంలో పర్యటించి రూ.80 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించి అనంతరం అక్కడి ఉద్యానవనంలో 80 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రొసీడింగ్ ప్రతులు, 42 స్వశక్తి సంఘాలకు రూ.ఐదు కోట్ల 9 లక్షల విలువైన రుణాల జంబో చెక్కును ఆయన పంపిణీ చేశారు. అంతకుముందు ధర్మారం విషయం మార్కెట్ యార్డ్ వద్ద మీడియాతో లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు. నిజామాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆదివారం చేసిన ఆరోపణలను లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు.
ఇక్కడి ప్రభుత్వం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా మారిందని, ప్రభుత్వంలో తీవ్రమైన అవినీతి పెరిగిపోయిందని అమిత్ షా చేసిన ఆరోపణలు అర్థరహితమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో పర్యటనకు వచ్చి తమ ప్రభుత్వంపై ఏదో బురద జల్లాలని అమిత్ షా ఆరోపణలు చేశారని ఆయన అన్నారు. ఎన్నో సంక్షేమాలు అమలు చేస్తున్న తమ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏనాడు పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసిన పాపాన లేదని ఆయన మండిపడ్డారు. దమ్ముంటే తమ ప్రభుత్వంపై విచారణ జరిపించి అవినీతి ఏమి జరిగిందో నిరూపించాలని లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు.
ధర్మారం, నంది మేడారం గ్రామాల్లో జరిగిన పర్యటనల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరోగ్యారెంటీ పథకాలలో 4పథకాలను అమలు చేశామని మిగతా రెండు దశల వారిగా అమలు చేస్తామని అన్నారు. తమ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ద్వారా సహాయాన్ని పంపిణీ చేశామని, సన్న బియ్యం పేద ప్రజలకు అందించామని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ గృహజ్యోతి ద్వారా అందిస్తున్నామని ఆయన వివరించారు. కుల సంఘాల భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేస్తామని, ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి లో ఐటీఐ భవన నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తానని ఆయన తెలిపారు.
నంది మేడారం గ్రామంలో 261 విద్యుత్ స్తంభాల కోసం కలెక్టర్ ప్రత్యేక నిధి ద్వారా రూ.22 లక్షలు ఎన్పీడీసీఎల్ సంస్థకు చెల్లించామని ఆయన వివరించారు. ఈ గ్రామంలో ఇంకా అవసరమైన వారికి మరో 100 ఇండ్లు ఇందిరమ్మ పథకం ద్వారా నిర్మిస్తామని, నంది మేడారం నుంచి కటికనపల్లి వరకు ఉన్న 2 రోడ్ల నిర్మాణం, నంది రిజర్వాయర్ మత్తడుల వద్ద 2 జాలీల ఏర్పాటుతో పాటు గ్రామంలో సమస్యలన్నిటిని రెండు నెలలుగా పరిష్కరిస్తానని ప్రజలకు ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.
ఆయా కార్యక్రమాలలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, హౌసింగ్ పీడీ రాజేశ్వరరావు, ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ గంగాధర్, ఆర్డీవో గంగయ్య, జిల్లా పరిషవర్ధక శాఖ అధికారి శంకర్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎన్పీడీసీఎల్ ధర్మారం ఏ డి ఈ విజయ్ గోపాల్ సింగ్, ఎంపీడీవో అయినాల ప్రవీణ్ కుమార్, మండల ఇన్ చార్జీ తహసీల్దార్ ఉదయ్ కుమార్, ఎంపీఓ రమేష్, వెటర్నరీ డాక్టర్ అజయ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ లావుడియా రూప్లా నాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, డైరెక్టర్లు , సెర్ప్ ఏపీఎం దేవరకొండ తులసి మాత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.