రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమం అతివలకు వరంలా మారింది. జిల్లాలోని మూడు ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి మంగళవారం మహిళలకు వివిధ పరీక్షలు చేస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు 6,880 మందికి పరీక్షలు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న మహిళలను వైద్యులు పరీక్షించి ప్రభుత్వ దవాఖానకు రెఫర్ చేసి సరైన చికిత్స అందిస్తున్నారు.
-విద్యానగర్, జూలై 14
జిల్లా కేంద్రంలోని బుట్టిరాజారాం కాలనీలో గల అర్బన్ హెల్త్ సెంటర్, వీణవంక మండలం చల్లూరు, చొప్పదండిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఈ కేంద్రాలను ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి మంగళవారం ఈ కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేకంగా పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 6,880 మందికి ఆరోగ్య పరీక్షలు చేశారు. ఇందులో కొంతమందికి క్యాన్సర్‌తోపాటు మహిళలకు వచ్చే థైరాయిడ్, బరువు తగ్గడం, పీసీవోసీ, మూత్రంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, లైంగిక సమస్యలు, ఇతర వ్యాధులకు పరీక్షలు చేస్తున్నారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న 547 మందిని గుర్తించి ఇప్పటికే ప్రభుత్వ దవాఖానలోని ప్రత్యేక వార్డుకు రెఫర్ చేసి చికిత్స అందిస్తున్నారు. చల్లూరు పీహెచ్సీ పరిధిలో ఇద్దరు, బుట్టిరాజారాం కాలనీలో ఒకరికి, చొప్పదండిలో మరొకరికి క్యాన్సర్ ఉన్నట్లు అనుమానించి సంబంధిత దవాఖానకు తరలించారు. మహిళల్లో వస్తున్న క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించినట్లయితే పూర్తిగా నయం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహిళలకు ఆరోగ్య మహిళ కేంద్రాలు ఎంతో మేలు చేకూర్చుతున్నాయి.
మహిళల్లో బయట పడుతున్న వ్యాధులు
మహిళలకు పరీక్షలు చేస్తే వారిలో చాలా రోజులుగా ఉన్న వ్యాధులు బయట పడుతున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని మూడు మహిళ ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటి వరకు నిర్వహించిన వైద్య పరీక్షల వివరాలను పరిశీలిస్తే చాలా మంది వివిధ వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 5,530 మందికి ఓరల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించగా ఐదుగురిలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 5,440 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించగా 41 మందిలో ఉన్నట్లు గుర్తించి 38 మందిని సంబంధిత దవాఖానలకు రెఫర్ చేశారు. 680 మందికి సర్వేకల్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 23 మందికి ఉన్నట్లు గుర్తించి 18 మందిని రెఫర్ చేశారు. 191 మందికి యూటీఐ పరీక్షలు నిర్వహించి స్థానికంగానే చికిత్స అందిస్తున్నారు. మెనోపాజ్ కింద 2,956 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి 2,779 మందిలో ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించి చికిత్స అందించారు. వ్యాధి తీవ్రత ఉన్న 381 మందిని మెరుగైన చికిత్స కోసం రెఫర్ చేశారు. ఎస్టీఐలో 41 మందికి పరీక్షలు చేయగా 18 మందికి స్థానికంగా చికిత్స చేస్తుండగా, 26 మందిని రెఫర్ చేశారు. 1,646 మందికి వెయిట్ మేనేజ్మెంట్ కౌన్సెలింగ్ ఇచ్చారు. రక్తహీనతతో బాధపడుతున్న 3,527 మందిని పరీక్షించారు. 542 మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించి రెఫర్ చేశారు.
వ్యాధులపై అవగాహన
ఆరోగ్య మహిళ కార్యక్రమంతో మహిళల్లో వస్తున్న వ్యాధులపై వారికి అవగాహన పెరుగుతున్నది. ప్రతి కేంద్రంలో సిబ్బంది సహా వైద్యులు కూడా మహిళలే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు తాము ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను నిర్భయంగా చెప్పుకొంటున్నారు. వైద్యులు కూడా మహిళల్లో వచ్చే వ్యాధులపై అవగాహన కలిగే విధంగా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. గత మార్చి 8న ప్రారంభించిన ఈ కేంద్రాల్లో తక్కువ సమయంలోనే ఎక్కువ మంది మహిళలు వచ్చి తమ ఆరోగ్య సమస్యలు చెప్పుకొంటున్నారు. ఇప్పటికే 6,888 మందికి ఈ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారంటే ఆరోగ్య మహిళ కేంద్రాలు ఏ స్థాయిలో పని చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. మహిళలకు సోకే వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతున్నది. వ్యాధి తీవ్రంగా ఉన్న మహిళలను గుర్తించి హయ్యర్ సెంటర్స్ రెఫర్ చేస్తూ వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
ఉల్లాసంగా ఉంది
నెల రోజులుగా మెడ నొప్పితో పాటు జ్వరం ఉండగా, నీరసంగా ఉంది. ప్రైవేట్ దవాఖానల్లోకి వెళ్తే పరీక్షల పేరిట వేలాది రూపాయలు తీసుకుంటున్నరు. ఎక్కువ మోతాదులో మందులు ఇవ్వడంతో వచ్చిన రోగానికంటే మందులతో వచ్చే రోగాలు ఎక్కువ అవుతున్నయి. ఆరోగ్య మహిళ కార్యక్రమం మాలాంటి వారికి ఎంతో మేలు చేస్తుంది. ఇక్కడ వైద్యులు పరీక్షించి నాకు మందులు ఇచ్చిన్రు. కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఉల్లాసంగా ఉంది.
– అమీనా, కిసాన్‌నగర్
రూపాయి ఖర్చు లేకుండా చికిత్స
కొద్ది రోజులుగా తలనొప్పి, తిమ్మిర్లతో బాధపడుతున్నా. ప్రైవేట్ దవాఖానల్లోకి వెళ్లినా తగ్గలేదు. పెయిన్ కిల్లర్స్‌తో తాత్కాలిక ఉపశమనం కలిగినా పూర్తిగా తగ్గడం లేదు. దీర్ఘకాలికంగా ఉండడంతో ఆరోగ్య మహిళ కార్యక్రమం గురించి విని ఈ శిబిరానికి వచ్చాను. ఇక్కడ వైద్యులు పూర్తిగా పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. కౌన్సెలింగ్ ఇచ్చి భరోసా కల్పిస్తున్నారు. రూపాయి ఖర్చు లేకుండా చికిత్స అందించడం ఆనందంగా ఉంది.
-కళ, సుభాష్‌నగర్
కాళ్లు వాపు వస్తున్నయి
కొద్ది రోజులుగా కాళ్లు వాపు వస్తున్నయి. కిడ్నీ సమస్య ఉందేమో అని భయం వేసింది. నేను చేసేది ప్రైవేట్ ఉద్యోగం. ప్రైవేట్ దవాఖానల్లోకి వెళ్తే పరీక్షల పేరిటనే వేలాది రూపాయలు లాగేస్తారు. డబ్బులతో పాటు రోగాల పేరిట భయపెట్టిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య మహిళ కార్యక్రమంలో మహిళా వైద్యులతో పరీక్షలు నిర్వహిస్తూ చికిత్స అందించడంతో ఏ వ్యాధి ఉన్నా నిర్మోహమాటంగా చెప్పుకొనేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతున్నది. ఇది మాలాంటోళ్లకు భరోసా కల్పిస్తున్నది.
– అంజలిదేవి, విద్యానగర్
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా వ్యాప్తంగా మూడు కేంద్రాల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం నిర్వహిస్తున్నాం. మహిళల్లో వచ్చే 7 రకాల వ్యాధులకు పరీక్షలు చేసి అప్పటికప్పుడే మందులు, కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరమైన వారికి హయ్యర్ సెంటర్లకు రెఫర్ చేస్తారు. పైసా ఖర్చు లేకుండా మహిళలకు అన్ని రకాల వ్యాధులకు తెలంగాణ ప్రభుత్వం చికిత్స అందిస్తున్నది. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేసేందుకు వీలవుతుంది. 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళ క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష చేసుకుంటే రాకుండా నివారించవచ్చు.
– డాక్టర్ లలితాదేవి, డీఎంహెచ్‌వో