అసెంబ్లీ ఎన్నికల్లో నిధులు కాజేసిన బాగోతం వెలుగు చూస్తున్నది. ఎలక్షన్ నిర్వహణకు సంబంధించి జగిత్యాల జిల్లాలోని ఓ నియోజకవర్గానికి వచ్చిన డబ్బులను పక్కదారి పట్టించినట్టు తెలుస్తున్నది. డివిజన్ స్థాయి అధికారితోపాటు మరో అధికారి స్వాహా పర్వం కొనసాగించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, అప్పుడు ఎన్నికల కోసం పనిచేసిన హోటల్, జిరాక్స్ షాప్ వ్యాపారులు, ఫొటో, వీడియోగ్రాఫర్లు లబోదిబోమంటున్నారు. బిల్లుల కోసం ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. శుక్రవారం కూడా జగిత్యాల సబ్ డివిజన్లోని ఒక కీలక అధికారి కార్యాలయానికి పలువురు బాధితులు వచ్చి నిరాశగా వెనుదిరిగారు. విషయం తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎన్నికల కోసం తాము పనిచేస్తే ఇలా మోసం చేస్తారని అనుకోలేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
జగిత్యాల, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఎలక్షన్ నిర్వహణకు ప్రతి నియోజకవర్గానికి నిధులు కేటాయించింది. జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను డీడీవో (డ్రాయింగ్ అండ్ డిశ్చార్జీ ఆఫీసర్)లుగా నియమించారు. వారి పేరిట అకౌంట్‌ను ఓపెన్ చేయించి నిధులను ట్రాన్స్ఫర్ చేశారు. ఒక్కో నియోజకవర్గానికి కోటీ 60 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో ఎన్నికల సిబ్బందికి భోజనాలు నుంచి మొదలు కొని అన్ని వ్యవహారాలు నిర్వహించాల్సి ఉంటుంది. పోల్ చిట్టీలు, ఓటర్ లిస్టు జాబితా, ఫ్లెక్సీలు, కరపత్రాలు, సీసీ కెమెరాలు, స్ట్రాంగ్‌రూమ్స్, విద్యుత్ సౌకర్యం, ఫొటోగ్రాఫర్లు, చెకింగ్ స్వాడ్స్కు సంబంధించిన వాహనాలు ఇలా అన్నింటిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. సహజంగా మండల స్థాయి అధికారులుగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఉంటారు. అయితే వీరు నిధుల అకౌంట్ నిర్వహణకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు డీడీవో ఆథరైజేషన్‌ను తమ దిగువ క్యాడర్లో ఉన్న అధికారులకు ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని గమనించిన ఓ డివిజన్ స్థాయి అధికారి డీడీవో ఆథరైజేషన్ పొందిన ఓ అధికారిని మచ్చిక చేసుకొని, ఎన్నికల నిధులను పక్కదారి పట్టించేందుకు పథకం రూపొందించాడు. డీడీవో పేరిట ఏర్పాటు చేసిన అకౌంట్ నుంచి నిధులను దిగువ స్థాయి అధికారి తన పేరిట తెరిచిన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. అక్కడి నుంచి డివిజన్ స్థాయి అధికారి, మండల అధికారికి దిగువస్థాయి అధికారి ఇద్దరు నిధులను యథేచ్ఛగా మళ్లించినట్టు సమాచారం.
డివిజన్ స్థాయి అధికారి రెండు వాహనాలు ఎన్నికల విధుల్లో పెట్టకుండానే దాదాపు మూడు నాలుగు నెలలు నడిపినట్టు చూపి అద్దె పేరిట లక్షలాది రూపాయలు స్వాహా చేసినట్లు తెలుస్తున్నది. 2023 ఆగస్టు 6 నుంచి డిసెంబర్ 6 వరకు పోల్ చిట్టీలు, ఓటర్ లిస్టు జాబితా, ఫ్లెక్సీలు, కరపత్రాలు, సీసీ కెమెరాలు, స్ట్రాంగ్‌రూమ్స్, విద్యుత్ సౌకర్యం, ఫొటోగ్రాఫర్లు, చెకింగ్ స్వాడ్స్ సేవలను వినియోగించుకున్నారు. వారి వద్ద నుంచి బిల్లులు తీసుకుంటూ వారికి కొంత డబ్బులు చెల్లిస్తూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత డివిజన్ స్థాయి అధికారితో పాటు డీడీవోగా ఆథరైజేషన్ పొందిన అధికారి ఇద్దరు ఇతర జిల్లాలకు బదిలీలపై వెళ్లిపోయారు. అయితే ఎన్నికల సమయంలో పనిచేసిన వ్యాపారులు, ఫొటో, వీడియో గ్రాఫర్లకు చివరి విడుత డబ్బులు ఇవ్వకుండానే వెళ్లిపోయారు. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు భోజనం అందజేసిన హోటల్ నిర్వాహకుడికి 2.10 లక్షలు, పోల్‌చిట్టీలు, ఓటర్ జాబితాలు జిరాక్స్ చేసిన షాప్ యజమానికి 310లక్షలు, ఫ్లెక్సీలు తయారు చేసిన దుకాణదారుడికి 3లక్షలు, వాహనదారులకు పెట్రోల్ డబ్బులతో పాటు వాహనాల అద్దెలు ఇలా లక్షలాది రూపాయలు చెల్లించకుండానే బకాయిలు పెట్టారు. దాదాపు నాలుగు నెలల పాటు పనిచేయించుకొని డబ్బులు ఇవ్వకపోవడంతో ఎన్నికల విధుల్లో కార్యాలయాలకు పనిచేసిన వారంతా ఆరు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆఫీసుల్లో సరైన సమాధానం రాక బిత్తరపోతున్నారు. కొద్దిమంది ధైర్యం ఉన్న వాళ్లు కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి తమ బాధను ఉన్నతాధికారులకు మొరపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
నిబంధనల ప్రకారం ఎన్నికలు ముగిసిన తదుపరి నిధులను ఎలా ఖర్చు చేశారన్న వివరాలను జిల్లా ఎన్నికల అధికారికి అందించాల్సి ఉంటుంది. భోజనాల నుంచి మొదలుకొని జిరాక్స్‌ల వరకు, ఫొటోల నుంచి మొదలు కొని విద్యుత్ సైప్లె వరకు దేనికెంత చొప్పున చెల్లించారు? ఎవరెవరికి చెల్లించారు? అన్న వివరాలు, బిల్లులతో సహా సబ్మిట్ చేయాలి. దీన్ని యుటిలైజేషన్ సర్టిఫికెట్‌గా వ్యవహరిస్తారు. అయితే జగిత్యాల జిల్లాలో ఎన్నికల నిధులు స్వాహా చేసిన నియోజకవర్గానికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్‌ను సదరు అధికారులు ఇప్పటి వరకు సమర్పించలేదు. ఆ సర్టిఫికెట్ లేకపోతే ఎంపీ ఎన్నికలకు సంబంధించిన నిధులు మంజూరు చేయడం ఇబ్బంది అవుతుందని ఉన్నతాధికారులు డివిజన్, మండల స్థాయి అధికారులకు తెలుపగా, నిధుల స్వాహా పర్వం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అప్పటికప్పుడు మరో అధికారికి బాధ్యతలు అప్పగించి, ఒక యుటిలైజేషన్ సర్టిఫికెట్ తయారు చేయించి ఉన్నతాధికారులకు, రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదించినట్టు సమాచారం.
ఎన్నికల నిధుల్లో పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగిందని, ఇద్దరు అధికారులు పెద్ద మొత్తంలో స్వాహా చేశారన్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా ఇంత వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అందరిన ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. బాధితులు పలుసార్లు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి తమకు న్యాయం చేయాలని వేడుకున్నా.. కష్టపడి చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోవడం ఎంత వరకు సమంజసం అడిగినా ఎలాంటి చర్యలు లేకపోవడం విమర్శలకు తావిస్తున్నది. కాగా, నిధులు స్వాహా చేసి బదిలీపై వెళ్లిపోయిన వారిలో ఒకరు ఉన్నతాధికారి కావడం, మరో అధికారికి పరపతి ఎక్కువగా ఉండడం కారణంగానే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఒకటి రెండు సార్లు సదరు అధికారులకు ఫోన్ చేసిన ఉన్నతాధికారులు ఆ తర్వాత సైలెంట్ అయిపోయినట్లు సమాచారం. కాగా, ఈ వ్యవహారంపై ఎన్నికల సిబ్బందికి భోజనం సరఫరా చేసిన హోటల్ వ్యాపారి, జిరాక్స్ దుకాణం యజమాని మాట్లాడుతూ.. తమ లాంటి వారు దాదాపు ఇరవై మంది ఉన్నారని చెప్పారు. తమకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.