Ramagundam Baldia | కోల్ సిటీ, డిసెంబర్ 26: కూతురి పెళ్లి కోసం దాచుకున్న నగలు అమ్మి తల్లి జయమ్మ కట్టుకున్న షాపును అర్ధరాత్రి నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తారా..? అంటూ అఖిల పక్షం ఆగ్రహోదగ్రులైంది. గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుంచి అఖిల పక్ష దళం భారీ బైక్ ర్యాలీగా రాజీవ్ రహదారిపైకి చేరుకుంది. అక్కడ అంబేద్కర్ విగ్రహంకు వినతి పత్రం అందజేసి మానవహారంగా ఏర్పడింది. అనంతరం రామగుండం బల్దియా కార్యాలయం ముట్టడించింది. స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారుల వైఖరిపై మండిపడింది. పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించింది.
బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదని హెచ్చరించింది. గోదావరిఖని గాంధీ చౌక్‌లో సిరిశెట్టి జయసుధ-మల్లేశంకు చెందిన దుకాణం నేలమట్టం చేసిన సంఘటనకు నిరసనగా ఆరు రోజులుగా జరుగుతున్న సత్యగ్రహ దీక్షలో భాగంగా వివిధ పార్టీలు, ప్రజా సంఘాలతో కూడిన అఖిల పక్షం నాయకులు శుక్రవారం మధ్యాహ్నం దీక్ష స్థలి నుంచి ప్రధాన రాజీవ్ రహదారికి చేరుకొని ఆందోళన చేపట్టింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట గోడు వెల్లబోసుకుంది. అక్కడ నుంచి మళ్లీ ర్యాలీగా రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంకు చేరుకొని బైఠాయించింది.
స్థానిక ఎమ్మెల్యే, కమిషనర్ దిగి వచ్చి దిద్దుబాటు చర్యగా జయమ్మకు ఆ షాపు నిర్మించి ఇవ్వాలని భీష్మించుకొని కూర్చుంది. రామగుండంలో కమిషన్లు, విధ్వంస పాలన జరుగుతుందంటూ, సామాన్య ప్రజలకు ఇక్కడ బతికే పరిస్థితి లేకుండా చేస్తున్నారంటూ నినాదాలతో హోరెత్తించారు. ఓ ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని సకల జనులు చౌరస్తాకు వచ్చి కన్నీరు పెడుతుంటే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధికి నవ్వులాటగా ఉండటం శోచనీయమన్నారు.
మున్సిపల్ అధికారులు స్వయం ప్రతిపత్తి కోల్పోయారని, ఇక మీదట క్యాంపు ఆఫీసులోనే జీతాలు తీసుకోవాలని దుయ్యబట్టారు. అఖిల పక్షం ఆందోళనతో అట్టుడికిపోయింది. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించి మళ్లీ చౌరస్తాలోని సత్యగ్రహ దీక్ష వద్దకు చేరుకొని కూర్చున్నారు.
ఓట్ల కోసం వచ్చి ఏడ్చింది ఇందుకేనా..? : కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే
నాడు ఓట్ల కోసం ఇంటింటికి వెళ్లి ఏడ్చింది ఇందుకేనా..? అప్పుడే ఎందుకు చెప్పలేదు.. అన్యాయం జరిగితే నా క్యాంపు ఆఫీసుకు వస్తేనే పట్టించుకుంటా.. లేదంటే పట్టించుకోను అని…అప్పుడేమో మీకు ఏ కష్టం వచ్చినా ముందుంటా అని మొసలి కన్నీరు పెట్టి ఇప్పుడేమో నష్టం జరిగితే ఎమ్మెల్యే దగ్గరకు పోయి చెప్పుకోవాలె.. చౌరస్తాలో దీక్ష చేస్తే న్యాయం జరుగదు అంటూ కార్యకర్తలతో బహిరంగ ప్రకటనలు చేయించడం విడ్డూరమని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ దుయ్యబట్టారు. రోడ్డున పడి న్యాయం కోసం ఆరు రోజులుగా చలిలో ఓ కుటుంబం దీక్ష చేస్తుంటే తన కాళ్ల దగ్గరకు వచ్చి న్యాయం అడిగితే ఎందుకు చేయను అంటూ చెప్పించడం మోసపూరితం కాదా అని ప్రశ్నించారు.
అభివృద్ధికి అఖిల పక్షం వ్యతిరేకం కాదని, కానీ ‘తానే రాజు తానే మంత్రి’ అని అంటే ప్రజలు ఒప్పుకోరన్నారు. కూల్చివేసిన చోటనే దిద్దుబాటుగా ఎమ్మెల్యే స్పందించి వెంటనే నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక బస్టాండ్ వద్ద కూల్చివేతలో నష్టపోయిన వారికి సింగరేణి చే ఏలాగైతే షెడ్లు నిర్మించారో మిగతా వారికి కూడా అదే తరహాలో నిర్మించి ఇవ్వాలన్నారు. నియంతృత్వ ధోరణికి, ఆడబిడ్డ కన్నీళ్లకు మధ్య జరుగుతున్న ఈ సత్యగ్రహ దీక్షలో గెలుపు అఖిల పక్షందేనని అన్నారు. మలివిడత ఉద్యమం తరహాలో ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు కౌశిక హరి, మూల విజయారెడ్డి, గోపు ఐలయ్య, కందుల సంధ్యారాణి, కొండపర్తి సంజీవ్, కోమళ్ల మహేష్, పిడుగు కృష్ణ, మేకల గోపాల కృష్ణ, పర్లపల్లి రవి, మారుతి, తోట వేణు, రాజనర్సయ్య, జేవీ రాజు, కల్వచర్ల కృష్ణవేణి, గాదం విజయ, జనగామ కవిత సరోజని, బాదె అంజలి, బొడ్డుపల్లి శ్రీనివాస్, నూతి తిరుపతి, దేవరాజ్, చిలుక ప్రసాద్, శ్రావణ్, అర్షణపల్లి శ్రీనివాస్, గుంపుల లక్ష్మి, కనక లక్ష్మి, సుజాత తో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.