Rasamayi Balakishan | తిమ్మాపూర్, మే 22: పంట పండితే సంతోషించాల్సిన రైతన్న నేడు అమ్ముకోవడానికి దుఃఖిస్తున్నాడని.. ధాన్యం కొనుగోళ్లలో తీవ్రంగా జాప్యం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రెండు నెలలుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటూ, ధాన్యం కొనకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారన్నారు. సకాలంలో ధాన్యం కొనకపోవడంతో అప్పులు తీర్చలేక, ఎండవేడిమి తట్టుకోలేక రైతులు చనిపోతున్నారు. చీలాపూర్ గ్రామానికి చెందిన బాలయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.
మానకొండూర్ నియోజకవర్గంలో ఇప్పటికే 8మందికి పైగా చనిపోయారనీ, ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు. ఫొటోలకు పోజులు కొట్టి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి, వాటిని పర్యవేక్షించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర దోపిడీ జరుగుతున్నదనీ, స్వయంగా రైతులే తనకు చెప్పుకుని బాధపడుతున్నారనీ, ఏనాడు రాని నాణ్యమైన వడ్లు ఈ ఏడు వచ్చాయనీ, అలాంటి వడ్లను బీ గ్రేడ్ కు తీసుకొచ్చి రైతును ఆర్థికంగా దోచుకు తింటున్నా ఎవరు పట్టించుకోవడం లేదు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏ గ్రేడ్ కు అర్హత లేదా..?
మానకొండూర్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏ గ్రేడ్ ధాన్యం రావడం లేదా..? అని ప్రశ్నించారు. బీ గ్రేడ్ ధాన్యం పేరు చెప్తూ బస్తా వడ్లపై రూ.20 దోచుకు తింటున్నది ఇక్కడున్న ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వమని ఆరోపించారు. యూరియా ఇచ్చేందుకు యాప్ లు పెట్టి రైతుల బతులకును ఆగం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా..? అని అడిగారు. బస్తాకు 43కిలోల తూకం పెట్టి రైతును నిలువునా దోచుకుంటున్నప్పటికీ ఎమ్మెల్యే కవ్వంపల్లి ఏమి పట్టనట్లు ఉండడం ఏంటని అడిగారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న దోపిడీపై దమ్ముంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. 8మంది రైతులు చనిపోతే కనీసం పరామర్శకు పోని దౌర్భాగ్యుడు కవ్వంపల్లి అని విమర్శించారు. ఇల్లంతకుంట రైతులు పొద్దుతిరుగుడు పెడితే కనీసం పంట కొనుగోలు చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదన్నారు. అన్ని మండలాల్లో మక్కలు పండితే కొనే దిక్కేలేదు..పంటకొనే నాథుడు లేకపోవడంతో మూడు నాలుగు నెలలుగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు కాస్తున్నారనీ, అయినా వారి గురించి పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
60 శాతం కేంద్రాల్లోనే..
60శాతం వడ్లు కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నయ్ అనీ ఇసుక క్వారీలకు వెళ్లే లారీలను కొనుగోలు కేంద్రాలకు తీసుకుపోవాలనీ, ఇప్పటికే ఇసుక క్వారీలు, గ్రానైట్ మాఫియా, ల్యాండ్ మాఫియా చెప్తున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆ పైసలు కూడా సరిపోకపోతే ప్రజల కిడ్నీలు కూడా అమ్ముకోవడానికి వెనుకాడడని మండిపడ్డారు.వర్షాలు వచ్చేలోపు రైతుల పంటలు కొనాలని, సన్ ఫ్లవర్ తో పాటు మక్కలను వెంటనే కొనుగోలు చేయాలని రైతుల నుండి డిమాండ్ పెరుగుతోందని చెప్పారు. లేదంటే ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకొని, రైతులతో కలిసి క్యాంపు కార్యాలయం ఎదుట ధాన్యం పోసి నిరసనకు దిగుతామని హెచ్చరించారు.