గురుకులాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అసలే శిథిలావస్థకు చేరిన భవనాలు, అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్న పరిసరాలు, అరకొర వసతుల మధ్యన నిర్వహణ లేక అధ్వానంగా మారాయి. ఆవరణలో చెట్లపొదలు, పాముల పుట్టలు పిల్లలను వణికిస్తున్నాయి. స్నానపుగదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు సరిపడా కరువయ్యాయి. పడుకునేందుకు బెడ్లు కూడా లేక నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
చాలాచోట్ల రాత్రిపూట కరెంట్ పోతే చీకట్లు కమ్ముకుంటున్నాయి. మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకులంలో 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు చనిపోయి, మరో నలుగురు తీవ్ర అస్వస్థత చెందడానికి నిర్వహణ లోపం, వసతుల లేమే కారణమని తెలుస్తుండగా, శనివారం ‘నమస్తే తెలంగాణ’ పలు గురుకులాలను విజిట్ చేసింది. ఎటు చూసినా సమస్యలే కనిపించగా, పిల్లలు భయభయంగా గడుపుతున్నట్టు వెలుగులోకి వచ్చింది.
జగిత్యాల, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): మల్యాల మండలం తాటిపెల్లి బాలికల గురుకుల పాఠశాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఉత్తమ విద్యా కేంద్రంగా పేరుగాంచింది. ఇది 1983 నవంబర్ 20న ప్రారంభమై, నాలుగు దశాబ్దాలుగా విద్యాబోధన సాగిస్తూనే ఉన్నది. మొదట 5 నుంచి పదో తరగతి వరకు ఉండగా, 2019-20 విద్యా సంవత్సరం నుంచి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్ అయింది.
ప్రస్తుతం స్కూల్లో 650 మంది అభ్యసిస్తున్నారు. ఐదు నుంచి పదో తరగతి దాకా రెండేసి సెక్షన్లు నిర్వహిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ విభాగంలో జూనియర్ కాలేజీ నడుస్తుండగా, ప్రస్తుతం ఫస్టియర్‌లో 88 మంది, సెకండియర్‌లో 86 మంది చదువుతున్నారు. సెకండియర్ చదువుతున్న వారందరూ ఫస్టియర్ 400కు పైగా మార్కులు సాధించినవారే కావడం విశేషం. పదో తరగతి వరకు సైతం విద్యార్థులకు నాణ్యమైన విద్యనే అందుతున్నది.
బోధన అంశంలో ఇబ్బందులు
గురుకుల పాఠశాలలో బోధనకు సంబంధించిన కొన్ని సమస్యలు పిల్లలను ఇబ్బందిపెడుతున్నాయి. గురుకులాన్ని జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేసినా, కాలేజీ పిల్లల కోసం ప్రత్యేక వసతిగృహాలు, డార్మెటరీ హాల్, భోజనశాల, తరగతి గదులు, ప్రయోగశాలలు ఏవీ నిర్మించలేదు. దీంతో పాఠశాలకు సంబంధించిన తరగతి గదు లు, ప్రయోగశాలలు, భోజన శాలల్లోనే అడ్జెస్ట్ కావాల్సిన వస్తున్నది. జూనియర్ కాలేజీకి తరగతి గదులు ఇవ్వాల్సి రావడంతో పాఠశాల విద్యార్థుల తరగతి గదులు పూర్తిగా శిథిలమైన వాటిలో నిర్వహించాల్సిన దుస్థితి ఉన్నది.
బెంచీలు, కుర్చీలు సైతం చెడిపోయిన వాటినే పిల్లలు వినియోగించాల్సి వస్తున్నది. పై కప్పులు దెబ్బతిని, కిటికీలు, తలుపులు విరిగిపోయి, ప్రమాదకరంగా ఉన్న తరగతి గదుల్లో చదువు కోవడం కనిపించింది. ఇంటర్ పిల్లలకు ప్రత్యేకమైన ల్యాబ్‌లను ఏర్పాటు చేయలేదు. పదో తరగతి పిల్లలకు సంబంధించిన ల్యాబ్‌లోనే ఇంటర్ పిల్లలు ప్రయోగాలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇక బోధన సిబ్బంది నియామకం విషయంలోనూ ప్రభుత్వం పట్టింపులేనితనం కనిపిస్తున్నది. జూనియర్ కాలేజీని ఏర్పాటు చేసినప్పటికీ, లెక్చరర్లను అపాయింట్మెంట్ చేయలేదు. కేవలం ఐదుగురు ఫ్యాకల్టీ మెంబర్లను మాత్రం తాత్కాలిక పద్ధతిలో నియమించారు. ఇక జూనియర్ కాలేజీ పిల్లల కోసం పీడీ పోస్టును సైతం ఇవ్వకపోవడంతో పాఠశాలకు చెందిన పీఈటీతోనే వెల్లదీస్తున్నారు.
వసతిగృహాల్లో అసౌకర్యాలు
వసతిగృహాల్లో అసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయి. 174 మంది ఇంటర్ విద్యార్థులకు కేవలం 10 స్నానపుగదులే ఉన్నాయి. బాత్రూములే తమకు పెద్ద సమస్యగా మారాయని పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 5 నుంచి 6 మధ్య వ్యాయామం, క్రీడలు ఉంటాయని, 6 నుంచి 7 గంటల మధ్య స్నానానికి సమయం కేటాయించారన్నారు. గంట వ్యవధిలో పది స్నానపుగదుల్లో 174 మంది ఎలా స్నానం చేస్తారని వాపోయారు.
కాలకృత్యాలు, స్నానానికి ఒక్కొక్కరికి కనీసం 10 నుంచి 15 నిమిషాలు పడుతుందని, ఈ లెక్కన గంటలో ఒక్క వాష్‌రూమ్‌ను ఐదుగురి కంటే ఎక్కవ వాడలేరని, ఎంత వేగంగా పనులు చేసుకున్నా 60 నుంచి 70 మంది కంటే ఎక్కువ మించలేరన్నారు. 7 నుంచి 8 గంటల మధ్య అల్పాహారం ఇస్తారని, 8 గంటలకు క్లాసులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆడపిల్లలకు వాష్‌రూమ్స్ అత్యవసరం అన్న విషయం ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. డైనింగ్ హాల్లోను వసతులు లేవని, కొందరుపైన కూర్చొని తింటే మరి కొందరు కింద కూర్చొని భోజనం చేస్తున్నామన్నారు. ఇక రాత్రిపూట పడుకోవడం అంటే భయం వేస్తున్నదని చెప్పారు.
తమకు రెండు డార్మెటరీ హాల్స్ కేటాయించారని, కేవలం 42 డబుల్ డెక్కర్ మంచాలు ఉన్నాయని, అందులో 84 మంది పడుకునేందుకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. అయితే తాము 174 మంది విద్యార్థులం ఉన్నామని, మంచాలు, గదులు సరిపోకపోవడంతో ఒక్క మంచంలో ఇద్దరు పడుకుంటున్నామని వాపోయారు. ఇది అన్నింటి కంటే పెద్ద సమస్యగా మారిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే గురుకులం మొత్తం సువిశాల స్థలంలో ఉంది.
కానీ, ఎటూ చూసిన పిచ్చిచెట్లు పెరిగిపోయి, పాము పుట్టలతో నిండిపోయి కనిపించింది. రాత్రిపూట భయం వేస్తున్నదని, వాష్‌రూమ్స్‌కు వెళ్లాలంటే ఇబ్బందేనని చాలా మంది విద్యార్థినులు వాపోయారు. చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు, పుట్టల మధ్యలో చాలా సార్లు విషకీటకాలు కనిపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం బాగుంటుందని, మెనూ ప్రకారం ఇస్తున్నారని, అయితే ఇతర సౌకర్యాలే భయంకరంగా ఉన్నాయని పేర్కొన్నారు.
కాస్మోటిక్స్ లేవు.. బెడ్‌షీట్స్ రావు
గురుకుల విద్యార్థినులకు కాస్మోటిక్స్ చార్జెస్ రావడం లేదని, అలాగే బెడ్‌షీట్స్ సైతం ఇవ్వడం లేదని పిల్లలు చెబుతున్నారు. ఇతర గురుకులాలు, వసతిగృహాల్లో చదివే విద్యార్థులకు కాస్మోటిక్ చార్జెస్ ఇస్తున్నారని, అయితే తమకు సబ్బులు, కొబ్బరినూనె, ఇతర హైజెనిక్స్కు సంబంధించిన పరికరాలు ఇవ్వడం లేదని విద్యార్థులు వాపోయారు. స్వయంగా వాటిని ఏర్పాటు చేసుకోవడం కష్టంగా మారిందని, బెడ్‌షీట్స్ సైతం రాకపోవడం పెద్ద సమస్యగా మారిపోయిందని వివరించారు. అలాగే ప్రతిరోజు తమ దుస్తులను తామే ఉతుక్కోవాల్సి వస్తున్నదని, ఇతర వసతిగృహాల్లో దోబీలను, వాషింగ్ మిషన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, తమకు సౌకర్యం కల్పించకపోవడం సరికాదన్నారు. అలాగే నోట్‌బుక్స్, టెక్స్‌బుక్స్ యూనిఫామ్స్ సరిపడా ఇవ్వడం లేదని వాపోతున్నారు.
ఒక్కో బెడ్డుపై ఇద్దరు.. ఇబ్బందికర అంశం
గురుకులాల్లో ముఖ్యంగా అమ్మాయిల గురుకులాల్లో అసౌకర్యాలు ఉండడం సరికాదని విద్యారంగ నిపుణులతోపాటు వైద్యులు పేర్కొంటున్నారు. కిశోర బాలికలు, యుక్తవయసు బాలికలకు వాష్‌రూమ్స్‌తో పాటు, నిద్రించేందుకు సౌకర్యవంతమైన బెడ్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. 170 మంది విద్యార్థినులకు 10 వాష్‌రూమ్స్ ఏర్పాటు చేయడం సరికాదని, ఈ పద్ధతిని మార్చాలని సూచించారు. తక్కువ వాష్‌రూమ్స్ ఉండడం వల్ల అమ్మాయిలకు ఇబ్బందులు వస్తాయని, అనారోగ్యంబారిన పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇక ఒక మంచంలో ఇద్దరు అమ్మాయిలు అది ఇంటర్మీడియెట్ అమ్మాయిలకు కేటాయించడం అత్యంత ప్రమాదకరమైన అంశమని వైద్యులు వ్యాఖ్యానించారు. ఇది భవిష్యత్తులో ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీసే అవకాశం ఉందని, ప్రతి విద్యార్థినికి ఒక బెడ్ ఏర్పాటు చేయాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.
స్నానం చేయాలంటే..పొద్దున 3 గంటలకు లేవాల్సిందే
600 మందికి ఉన్నవి 14 బాత్రూములే
గంగాధర, ఆగస్టు 10 : గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల గురుకుల పాఠశాలలో సమస్యలు తిష్టవేశాయి. 600 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలను పట్టించుకునేవారు కరువయ్యారు. పాఠశాలలో 14 బాత్రూములు ఉన్నాయని, ఉదయం 3 గంటలకు నిద్ర లేచి స్నానం చేస్తేనే క్లాసుకు అందుతామని, ఏ కాలంలోనైనా చన్నీళ్లతో స్నానం చేస్తున్నామని విద్యార్థులు వాపోయారు. స్నానం చేయడానికి నీళ్లు సరిపోవడం లేదని, రెండు బోర్లలో ఒక్కటే వాడుతున్నారని, మరో దాని దగ్గర నీళ్లు పట్టుకుంటే తిడుతున్నారని ఆరోపించారు. భోజనంలో పురుగులు వస్తున్నాయని, శనివారం కూడా వచ్చాయని తమ తల్లిదండ్రులతో వాపోయారు.
పాఠశాల ఎదుట మొదటి అంతస్తులో రక్షణ గ్రిల్స్ ఏర్పాటు చేసి మిగిలిన అంతస్తులకు ఏర్పాటు చేయలేదని, గదులకు ఉన్న కిటికీలు సరిగా లేక తమకు రక్షణ లేకుండా పోతోందన్నారు. రాత్రి సమయంలో బాత్రూంకు వెళ్లాలంటే లైట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అక్కడికి పాము వచ్చిందని చెబుతున్నారు. సోమవారం అడిషనల్ కలెక్టర్ పాఠశాలకు వచ్చినప్పుడు సమస్యలు వివరించినా ఫలితం లేదని వాపోయారు. పై అధికారులు స్పందించి పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇక్కడి సమస్యలపై ఆర్సీవో అంజలిని ఫోన్లో సంప్రదించగా, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.