తిమ్మాపూర్, అక్టోబర్16 : 22ఏళ్ల కింద అలుగునూర్ గ్రామంలో స్వయంభువుగా వెలసిన లక్ష్మీగణపతికి ఆలయాన్ని నిర్మించి, త్వరలో ప్రారంభించబోతున్నట్లు ఆలయ చైర్మన్ కంది అశోక్ రెడ్డి తెలిపారు. గురువారం ఆలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన పోస్టర్ ను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులతో కలిసి ఆవిష్కరించారు. నవంబర్ 6వ తేదీన శాంతి మంత్రపఠనం, కంకణధారణ, కలశపూజ, గణపతి పూజ, దీక్ష వస్త్రధారణ, యాగశాల ప్రవేశం, అఖండ దీపస్థాపన, అంకురారోహణ, నాంది సమారాధన, యాగశాల సంస్కారం, నవగ్రహ, వాస్తు, యోగిని మాతృక, క్షేత్రపాలక మండప ఆరాధనలు, శోడశ కలశపూజ, 7న స్థాపితా దేవత పూజ హవనములు, మహా స్నపనం, సామూహిక కుంకుమార్చన, ధాన్యాధివాసం, పుష్యదివాసం, ఫలాదివాసం, శయ్యాదివాసం, 8న యంత్ర ప్రతిష్ట, కలశపూజ, గణపతి పూజ, గర్భగుడి ప్రవేశం, గ్రామ ప్రతిష్ట, వాస్తుబలి, యోగి బలి, మాతృక బలి, తదితర కార్యక్రమాలు ఉంటాయని పురోహితులు శంతన్ శర్మ తెలిపారు. అలాగే 5వ తేదీన మధ్యాహ్నం సిద్దిబుద్ధి సహిత లక్ష్మీగణపతి ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఉత్సవాలను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.
దాతలు ముందుకురావాలి..
స్వయంభూ లక్ష్మీగణపతి ఆలయ నిర్మాణానికి సహకరించేందుకు దాతలు ముందుకు వచ్చి, స్వామివారి కృపకు పాత్రులు కావాలని చైర్మన్ కంది అశోక్ రెడ్డి కోరారు. ఎంతో మహిమ కలిగిన గణపతి ఆలయ నిర్మాణంలో ఇప్పటికే ఎంతో దాతలు వారివంతు ఆర్థికసాయం అందించి ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్నారని తెలిపారు. ఆలయ ట్రస్టు సభ్యులు, భక్తులు కంది లక్ష్మీనారాయణరెడ్డి, సింగిరెడ్డి స్వామి రెడ్డి, కంది రాంచంద్రారెడ్డి, జాప రవీందర్ రెడ్డి, ఎర్రం అనంతరెడ్డి, జాప నాగరాజు, సింగిరెడ్డి జీవన్ రెడ్డి, కాసం సంపత్ రెడ్డి, కంది శ్యాంసుందర్ రెడ్డి, లింగారెడ్డి, నర్సయ్య, శ్రీనివాస్, మహేష్, లక్ష్మారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, సురేందర్, మహేందర్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.