సుల్తానాబాద్, మే 31: సుల్తానాబాద్‌లో శుక్రవారం సాయంత్రం ఓ లారీ బీభత్సం సృష్టించింది. మద్యంమత్తులో ఉన్న డ్రైవర్ ఇష్టమొచ్చినట్లు నడుపుతూ ఆరు బైక్‌లు, గప్‌చుప్ బండిని ఢీకొట్టడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఎస్ఐ శ్రావణ్‌కుమార్ వివరాల ప్రకారం.. ఇసుక లోడ్ కోసం హైదరాబాద్ నుంచి పెద్దపల్లికి వెళ్తున్న లారీ సుల్తానాబాద్ తెలంగాణ చౌరస్తా వద్ద అదుపు తప్పింది. వేగంగా వెళ్లి పూసాల రోడ్డు చౌరస్తా వద్ద బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని ఢీకొట్టింది. అక్కడి నుంచి కుడివైపునకు తిరిగి బైక్‌పై వెళ్తున్న చొప్పదండికి చెందిన వినయ్‌కుమార్‌ను ఢీకొట్టింది. తర్వాత ఎదురుగా ఉన్న గప్‌చుప్ బండిని ఢీకొట్టి డివైడర్‌పై నుంచి దూసుకెళ్లింది.
మరో నాలుగు ద్విచక్ర వాహనాలను ఢీకొంటూ వెళ్లి సంగీత మొబైల్‌షాపు వద్ద వేపచెట్టును ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో పూసాల రోడ్డు వైపు నుంచి వెళ్తున్న నసీ మా, దిలీష్ హుస్సేన్ తీవ్రంగా గాయపడగా చికి త్స కోసం దవాఖానకు తరలిచారు. చొప్పదండి గ్రామానికి చెందిన వినయ్ కుమార్, యూసుఫ్ గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం కరీంనగర్ దవాఖానకు తరలించారు. డ్రైవర్ మద్యం మ త్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్రేన్ సహాయంతో లారీని రోడ్డుపై నుంచి తొలగించారు. బాధితుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.