Singareni | గోదావరిఖని : సింగరేణి లో రాజకీయ జోక్యం తో రూ.51 వేల కోట్ల బకాయిలను సంవత్సరాలు దాటిన చెల్లించకుండా సంస్థ ను దివాలా తీయించారని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కార్మికుల సమస్యలను పరిష్కరించడం లో యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినందున గుర్తింపు సంఘం ఏఐటియుసి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందన్నారు. సింగరేణి లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాలు గడిచినా యాజమాన్యం కొన్ని సమస్యల ను స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో అంగీకరించి ఇంత వరకు వాటిపై అమలు కోసం యాజమాన్యం సర్క్యులర్ లు జారీ చేయలేదని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా మారుపేర్లు విజిలెన్స్ కేసుల సమస్య, సొంత ఇంటి పథకం, పెర్క్స్ పై ఇన్ కం టాక్స్ సమస్య, డిస్మిస్ కార్మికుల కు ఒక అవకాశం కల్పించాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఈ క్రమంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుండి 30 వరకు సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపు నివ్వడం జరిగిందని, వాటిని జయప్రదం చేయాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శులు మడ్డి ఎల్లా గౌడ్, వైవీ రావు, కేంద్ర కార్యదర్శులు కవ్వంపల్లి స్వామి, కందుకూరి రాజారత్నం, జూపాక రాంచందర్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతం గోవర్ధన్, ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, ఆకునూరి శంకరయ్య, దాసరి శ్రీనివాస్, మిట్టపల్లి మొగిళి, దోరగండ్ల మల్లయ్య, ఏవీఎస్ ప్రకాశ్, వినయ్ కుమార్, దేవేందర్ రెడ్డి, ఏ రవికుమార్, పడాల కనకరాజు, గంగారపు చంద్రయ్య, చెప్యాల మహేందర్ రావు, ఎజ్జ రాజయ్య, కల్వల జగన్, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.