ఎవుసం ఆగమవుతున్నది. సాగునీటి రంగంపై కాంగ్రెస్ చిన్నచూపుతో కుదేలవుతున్నది. గత ప్రభుత్వంలో మల్లన్న సాగర్ జలాలతో రందిలేకుండా పంటలు పండించుకున్న ముస్తాబాద్ మండల రైతాంగం, రెండేళ్లుగా అల్లాడుతున్నది. మొన్నటిదాకా ఒక మార్గంలో కొంత మేర.. అది కూడా ఆలస్యంగా నీళ్లు ఇచ్చినప్పటికీ, మరోమార్గంలో చుక్కనీళ్లు వదలకపోవడంతో నక్కవాగు పరిసర గ్రామాల్లో సాగు నీటి కటకట తీవ్రమై వందలాది ఎకరాల్లో పంట ఎండిపోతున్నది. చేతికందే దశలో పైరు మాడిపోతుండడంతో రైతులకు కన్నీరే మిగులుతున్నది.
ముస్తాబాద్, ఏప్రిల్ 5: ముస్తాబాద్ మండలంలో ప్రధానంగా వరి పంట సాగు చేస్తారు. ఎగువమానేరు ప్రాజెక్టుతో పాటు బోరుబావులపై ఆధారపడి ఎవుసం చేస్తుంటారు. అయితే మండలంలో పలు గ్రామాలకు నీరందే పరిస్థితి లేకపోవడంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు జలాలను మండలానికి మళ్లించారు. బీడు భూములకు గోదావరి జలాలు అందించి సాగును సస్యశ్యామలం చేశారు. మల్లన్న సాగర్ జలాలు ఒక మార్గంలో సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట నుంచి మండలంలోని బంధనకల్, తెర్లుమద్ది మీదుగా నక్కవాగులోకి వదిలేవారు.
దీంతో పరిసర గ్రామాలైన బంధనకల్, తెర్లుమద్ది, సేవాలాల్ తండా, గన్నెవారిపల్లి, పోతుగల్ గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగి పంటలు పండేవి. అయితే రెండేండ్లుగా చుక్క నీరు వదలడం లేదు. ఈ సారి నీరందక వందలాది ఎకరాల్లో పంట ఎండిపోయింది. ఇక మరోమార్గంలో జలాలు ముస్తాబాద్ మండలం మోహినికుంట, మద్దికుంట ఊర చెరువులోకి విడుదల చేసి, అక్కడి నుంచి ముస్తాబాద్ మండలకేంద్రంలోని లింగంకుంటను నిం పేవారు. అక్కడి నుంచి ముస్తాబాద్ పెద్ద చెరువు నింపి, తూము ద్వారా పోతు గల్ మీదుగా ఉన్న ఎల్లమ్మవాగులోకి విడుదల చేసేవారు. దీంతో భూగర్భజలా లు పెరిగి ఆయా గ్రామాల్లో పంటలు పండేవి. అయితే ఈ సీజన్లో కొంత మేర అది కూడా ఆలస్యంగా వదిలారు.
దీంతో చివరికి నీళ్లు లేక పంటలు ఎండి పోతుండగా రైతులు లబోదిబోమంటున్నారు. ఆదుకునే వారు లేక ‘దేవుడా.. మాకెందుకు ఈ కష్టాలు.. మేమేం పాపం చేశాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాగోడీ నష్ట పోయామని, పశువులకు మేతగా పంటలను వదిలే స్తున్నామని చెబుతున్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టులో నీరు ఉన్నా ముందస్తు ప్రణాళిక లేక నీటిని విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మల్లన్న సాగర్ జలాలు బంధనకల్, గన్నెవారిపల్లె, సేవా లాల్ తండా గ్రామాల్లోని నకవాగుకు మళ్లించి ఆదుకోవాలని కోరుతున్నారు. లేదంటే వేలాది ఎకరాల్లో నష్టం జరుగుతుందని వాపోతున్నారు.
మూడెకరాలు ఎండిపోయింది
నాది ముస్తాబాద్. నాలుగెకరాల్లో వరి వేసిన. బోరు బావులు ఎత్తిపోవడంతో నీరందడంలేదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు వచ్చేవి. ఇప్పుడు నీరు ఆలస్యంగా వదలడం, నీళ్లు మేమంటే.. మేం తెచ్చామని కాంగ్రెస్, బీజేపొళ్లు పోస్టులు పెట్టడంతో మూడు రోజులకే బంద్ పెట్టిన్రు. నా మూడెకరాల వరి ఎండిపోయింది. లక్ష రూపాయల నష్టం జరిగింది. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– రంజాన్ రమేశ్, రైతు (ముస్తాబాద్)
పశువులకు మేతకు వదిలిన
నాకు పల్లె మీది తండాలో రెండెకరాల పొలం ఉంది. 50 వేలు ఖర్చు చేసి వరి పంట వేసిన. బోరు బావులను నమ్ముకుని సాగు చేస్తున్న. నక్కవాగులోకి గోదావరి నీరు వస్తుందని అనుకున్నా. కానీ, రాలేదు. బోరు ఎత్తిపోయి, రెండెకరాలు ఎండిపోయింది. ఏం చేయాలో తెలియక పశువులకు మేతగా వదిలిపెట్టిన. సరారు మాకు సాయం అందించాలి.
– రమావత్ మోహన్ నాయక్, రైతు (పల్లెమీది తండా)
మల్లన్న సాగర్ నీళ్లు ఇవ్వాలి
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లన్న సాగర్ జలాలు వచ్చేవి. రంది లేకుండా పంటలు వేసుకున్నం. ఇప్పుడు చుక్క నీరు వస్తలేదు. భూగర్భ జలాలు అడుగంటాయి. ఒక మా గ్రామంలోనే 300 ఎకరాల పంట ఎండిపోయింది. ఇప్పటికైనా గోదావరి జలాలు అందించి రైతులను ఆదుకోవాలి.
– రేసు రఘు, సర్పంచ్ (గన్నేవానిపల్లె)