తిరువనంతపురం: వరదల్లో చాలా మందిని కాపాడిన వీరుడు, ఒక రైతును కాపాడేందుకు తన లైఫ్ జాకెట్ ఇచ్చాడు. ప్రమాదవశాత్తు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మూడు రోజుల గాలింపు తర్వాత అతడి మృతదేహాన్ని వెలికితీశారు. (Kerala floods Hero Lost Life) కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తిరువనంతపురానికి చెందిన 36 ఏళ్ల ఆర్. రాజేష్ స్విమ్మింగ్, రాపెల్లింగ్ శిక్షకుడు. 2018లో సంభవించిన వరదలు, 2024లో వయనాడ్ ప్రకృతి విలయంలో కొండచరియలు విరిగిపడినప్పుడు సహాయక చర్యల్లో పాల్గొని ఎందరినో కాపాడాడు.
కాగా, ఆగస్ట్ 1న కన్నూర్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. రాజేష్ తన బృందంతో కలిసి సహాయక చర్యలో పాల్గొన్నాడు. ఆగస్ట్ 2న మీన్తుల్లి ద్వీపం సమీపంలో ఎగువన కొండచరియలు విరిగిపడటంతో 61 ఏళ్ల రైతు బెన్నీ తన కాఫీ తోట పరిస్థితి పరిశీలించేందుకు వెళ్లాడు. ఆకస్మిక వరదలకు ఆ వృద్ధుడు అక్కడ చిక్కుకున్నాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న రాజేష్, తన తోటి రక్షకులైన షిబిన్, జితిన్లతో కలిసి రైతు బెన్నీని రక్షించడం కోసం అక్కడకు చేరుకున్నారు. ఈదుతూ కరియంగోడ్ నదిని దాటారు. బెన్నీని సురక్షితంగా వెనక్కి తీసుకువస్తుండగా ఆయన మునిగిపోతూ ఇబ్బంది పడటం చూసి రాజేష్ తన లైఫ్ జాకెట్ తీసి ఆ వృద్ధుడికి తొడిగాడు.
అయితే ఆ బృందం ఒక తాడును పట్టుకుని వస్తుండగా, ఒడ్డు సమీపంలో రాజేష్ పట్టు కోల్పోయాడు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మూడు రోజుల పాటు గాలింపు చర్యల తర్వాత మంగళవారం అతడి మృతదేహాన్ని వెలికితీశారు. వరదల నుంచి ఎందరినో కాపాడిన హీరో రాజేష్ ఒక వృద్ధ రైతును కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోవడంపై కేరళ సీఎం సతీసన్, మాజీ సీఎం విజయన్‌తో సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు.