ఏ కాలమైనా ఎరువుల కొరత లేదు. రైతులకు పుష్కలంగా అందుబాటులో ఉంటున్నాయి. తమకు ఏ ఎరువు అవసరమైతే ఆ ఎరువునే సమయానికి దుకాణాల నుంచి తీసుకెళ్లి వినియోగిస్తున్నారు. దీంతో ఎరువు పాడైపోతుందన్న రంది కూడా ఉండడం లేదు. అప్పు తెచ్చుకునే పనిలేకుండా రైతుబంధు నగదుతో తమకు కావాల్సినవి కొనుక్కుని పోతున్నారు.
వానకాలమైనా.. యాసంగి అయినా.. సీజన్ వచ్చిందంటే రైతులు పొలాల పనులు వదిలేసి ఇంటిల్లిపాది వెళ్లి ఎరువుల షాపులు, సహకార సంఘాలు, డీసీఎంఎస్, ఆగ్రో సెంటర్ల వద్ద ఎరువుల కోసం పడిగాపులు కాసేది. చెప్పులు, పాసుబుక్కులు లైన్లలో పెట్టి ఎదురు చూసేది. తీరా వచ్చాక తోపులాటలు, పోలీసుల లాఠీచార్జీల మధ్య నలిగిపోయి ఏది దొరికితే అది తీసుకెళ్లేది. దొరకకుంటే మళ్లోరోజు గిదే తిప్పలవడేది. ఇలా ఏండ్లకేండ్లు అరిగోస పడేది. కొందరు సీజన్కంటే అప్పు తెచ్చి రెండు నెలల ముందే తెప్పించుకునేది. దీంతో కొన్ని ఎరువులు పాడయ్యేది.
జూలైలో యూరియా అవసరం : 36,874 మెట్రిక్ టన్నులు
అందుబాటులో ఉన్న నిల్వలు : 65,595 మెట్రిక్ టన్నులు
అవసరమైన డీఏపీ : 11,552 మెట్రిక్ టన్నులు
అందుబాటులో ఉన్న నిల్వలు : 18,344 మెట్రిక్ టన్నులు
అవసరమైన ఎన్పీకే (కాంప్లెక్) : 24,565 మెట్రిక్ టన్నులు
అందుబాటులో ఉన్న నిల్వలు : 63,884 మెట్రిక్ టన్నులు
స్వరాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారింది. 24గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోళ్లతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అయినా ఎరువుల కొరత లేకుండా పోయింది. వానకాలం సీజన్‌కు సంబంధించి ఉమ్మడి జిల్లాలో పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. నెలవారీగా చూస్తే అవసరానికి మించి నిల్వలు ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఇప్పుడిప్పుడే పంటలు సాగు చేయడం కనిపిస్తున్నది. రాష్ట్ర సర్కారు ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా ఎరువులు అందుబాటులో ఉంచడంతో రైతాంగం అవసరమైన మేరకు తెచ్చుకుని వాడుకుంటున్నది.
– కరీంనగర్, జూన్ 27 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో రైతులకు సరిపడా ఎరువులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. సాగు అంచనా మేరకు ఇండెంట్ ఇచ్చి తెప్పించింది. కరీంనగర్లో 3,39,059, సిరిసిల్లలో 2,40,061, పెద్దపల్లిలో 2,83,321, జగిత్యాల జిల్లాలో 3,40,000 ఎకరాల్లో ఈసారి పంటలు సాగవుతాయని ఆయా జిల్లాల వ్యవసాయ అధికారులు అంచనా వేయడంతో పాటు ఇందుకు 3,05,686 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటాయని ఇండెంట్ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా వరి సాగు ఎక్కువ అవుతున్నందున ఇందుకు అవసరమైన యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉంచారు. నిజానికి రైతులు సీజన్ ప్రారంభానికి ముందునుంచే అధికారులు ఏ నెలకు ఆ నెల ఎరువుల అవసరాన్ని గుర్తించి రైతులకు అందుబాటులో ఉంచుతారు. అంటే ఏప్రిల్ నుంచే నెల వారీ అవసరాలకు అనుగుణంగా ఎరువులు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఈసారి వర్షాలు సకాలంలో కురియక రైతులు ఇప్పుడిప్పుడే పంటల సాగుకు ఉపక్రమిస్తున్నారు. అయితే, సీజన్ మొత్తానికి అవసరమైన ఎరువుల్లో ఇప్పటి వరకు అన్ని రకాల ఎరువులు కలిపి ఉమ్మడి జిల్లాలో 1,50, 841 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. ఈ నెలాఖరులో ఉన్నందున వచ్చే జూలై నెలలో వేసిన అంచనా ప్రకారంగా 79,455 మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే అవసరం ఉంటాయి. కానీ, ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఉన్నందున జూలై నెలలో వర్షాలు అనుకూలించినట్లయితే ఎక్కువ మొత్తంలో ఎరువులు వాడకం జరుగవచ్చు. ఈ పరిస్థితి వచ్చినా ఉమ్మడి జిల్లాలో అవసరానికి మించి ఎరువులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పంటలు కీలక దశకు చేరుకున్న తర్వాత వాడే ఎంవోపీ, ఎస్ఎస్పీ వంటి ఎరువులు ప్రస్తుతం తక్కువ నిలువలున్నా, అధికారులు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం ఉమ్మడి జిల్లాకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
జిల్లాల వారీగా నిలువలు
వానకాలంలో అవసరానికి మించి అధికారులు ఎరువులు నిల్వ చేశారు. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేలల స్వభావాన్ని బట్టి ప్రతి హెక్టారుకు 100 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాషియం ఎరువులు వాడుతారు. ఈ మూడు రకాల ఎరువులు ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో రైతులకు అందుబాటులో ఉన్నాయి. నాట్లు వేసే సమయంలో ప్రధానంగా వాడే యూరియా వచ్చే జూలైలో కరీంనగర్ జిల్లాలో 13,091 మెట్రిక్ టన్నులు అవసరం ఉంది. కానీ, ఈ ఎరువు జిల్లాలో 23,230 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నది. అలాగే, సిరిసిల్లలో 5,621 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే 9,568 మెట్రిక్ టన్నులు, పెద్దపల్లిలో 4,998 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే 19,663 మెట్రిక్ టన్నులు, జగిత్యాలలో 13,164 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే ఆ మేరకు ఎరువులు అందుబాటులో ఉన్నాయి. డీఏపీ, ఎంవోపీ, కాంప్లెక్స్ ఎరువులు కూడా పూర్తి అవసరమైన మేరకు ఉన్నాయి. ఈ నెలలో ఎన్పీకే కాంప్లెక్స్ ఎరువులైతే ఉమ్మడి జిల్లాకు కేవలం 24,565 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే 63,884 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి.
గతానికి భిన్నంగా ఎరువులు
తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో ఎరువుల కోసం రైతులు పడిన ఇబ్బందులు ఇప్పటికీ కండ్ల ముందు కదలాడుతున్నాయి. ఒక్క యూరియా బస్తా కోసం రైతు కుటుంబమంతా తండ్లాడాల్సిన పరిస్థితి గతంలో ఉండేది. ఎక్కడ ఎరువు ఉంటే అక్కడికి వెళ్లి రైతులు పొద్దంతా బారులు తీరినా ఒక్క ఎరువు బస్తా దొరకని పరిస్థితి. పోలీసుల పహారాలో ఎరువులు విక్రయించే వారు. కానీ, ఇప్పుడు అందుకు భిన్నంగా రైతు అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం ఎరువులు సరఫరా చేస్తోంది. మార్క్‌ఫెడ్ గోదాముల్లో మునుపెన్నడూ లేని విధంగా బఫర్ నిల్వలు ఉంచుతోంది. సహకార సంఘాలు, డీసీఎంఎస్, ఆగ్రో సెంటర్లు, ప్రైవేట్ డీలర్ల వద్ద పుష్కలంగా ఎరువులు లభ్యమవుతున్నాయి. రైతులు ఎక్కడికో వెళ్లి బారులు తీరాల్సిన అవసరం లేకుండా అవసరం ఉన్నప్పుడే ఎరువు బస్తాలు తెచ్చుకొని వాడుకునే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఎరువులు అందుబాటులో ఉండటంతో పంటలకు సకాలంలో వాడుకుని రైతులు మంచి దిగుబడులు సాధిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో జూలైలో అవసరమైన ఎరువులు.. ఉన్న నిల్వలు మెట్రిక్ టన్నుల్లో
ఎరువు రకం జూలైలో ప్రస్తుతం
అవసరమైనవి ఉన్నవి
యూరియా 36,874 65,595
డీఏపీ 11,552 18,344
ఎంవోపీ 4,814 1,845
ఎన్పీకే 24,565 63,884
ఎస్ఎస్పీ 1,650 1,173
మొత్తం 79,445 1,50,841
ఎరువు రకం కరీంనగర్ సిరిసిల్ల పెద్దపల్లి జగిత్యాల మొత్తం
యూరియా 46,637 22,480 33,323 38,600 1,41,040
డీఏపీ 7,411 4,500 8,552 12,000 32,463
ఎన్పీకే 20,628 15,000 25,488 37,500 98,616
ఎంవోపీ 6,376 6,000 7,125 8.546 28,047
ఎస్ఎస్పీ 241 3,000 600 1,679 5,520
ఎరువు రకం కరీంనగర్ సిరిసిల్ల పెద్దపల్లి జగిత్యాల మొత్తం
యూరియా 23,230 9,568 19,633 13,164 65,595
డీఏపీ 11,524 1,494 3,328 1,998 18,344
ఎన్పీకే 38,759 5,074 16,577 3,474 63,884
ఎంవోపీ 1,362 100 240 143 1,845
ఎస్ఎస్పీ 241 54 447 431 1,173
ఒకప్పడు శానా నష్టపోయినం
పంటకు బలమే ఎరువు. అది సకాలంలో అందక శానా నష్టపోయినం. రైతు ఎరువులు సక్కగ అందకనే పంట దిగుబడి రాక చేసిన కష్టం వేస్టయ్యేది. కానీ, ఇప్పుడు ఆ బాధలు లేవు. పుష్కలంగా ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు అన్నీ అందుబాటులో ఉంటున్నై. ఇప్పుడంతా ప్రణాళిక ప్రకారం వ్యవసాయ శాఖ పనిచేస్తున్నది. అప్పుడట్ల లేకనే కష్టాలపాలైనం.
-ఆవుల విజయ్‌పాల్, రైతు, గోలివాడ (అంతర్గాం మండలం
పొలాలల్ల కాదు.. రోడ్లమీదనే ఉండేది
పొలం దున్నుకొని పంట సాగుజేసుకునే మేము ఎరువుల కోసం పొలాలల్ల కాదు రోడ్లమీదనే ఎక్కువగా ఉండేది. వాటికోసమే మేము మా పిల్లలు ఎదురు జూసుకుంట ఉండేది. అవి వచ్చినై అంటే ఓ దిక్కు పోలీసోళ్లు మరో దిక్కు మేము ఇరుగవడేది. ఒక్క బస్త రావాల్నంటే ఎంతో కష్టమయ్యేది. ఇప్పుడట్ల కాదు. ఎన్ని బస్తాలైనా సరే ఇక్కడ అందుబాటులో ఉంటన్నై. ఏ నెలల ఎంత యూరియా కావాలె, ఎంత డీఏపీ కావాలె అనేది ముందే రాసిపెట్టుకొని తెప్పిస్తున్నరు. అందువల్ల ఎవుసానికి ఏ బాధలు లేవు.
– రమణారెడ్డి, రైతు (పెద్దపల్లి)
ఎరువుల బాధలు తీరినయ్
గత ప్రభుత్వాల హయాంలో ఎవుసంజేద్దామంటే దుఃఖమచ్చేది. నీళ్లు రాకపోయేది. కరెంటు ఉండకపోయేది. విత్తనాలు దొరక్కపోయేది. ఎరువులు రాకపోయేది. శానా తిప్పలవడ్డం. ఇప్పుడు బీఆర్ఎస్ సర్కార్ అచ్చినకాన్నించి బాధలు ఒక్కొక్కటి తీరినై. ఎరువుల కోసం పడిగాపులు కాసేది. రైతులమందరం రోడ్లమీదనే ఉండేది. ఓవైపు కాలం మీదికచ్చేది. ఓటుంటె ఓటుండక అరిగోస పడ్డం. ఇప్పుడా బాధలు లేవు.
– కడారి కొమురేశ్, రైతు, బొంపల్లి (పెద్దపల్లి మండలం)
ఎరువుల గోస తీరింది
నాటి సమైక్య పాలనలో ఎరువులు దొరక్క అరిగోసపడ్డం. వరి నార్లు పోసినంక ఎరువుల కోసం సిరిసిల్లకు పొద్దుగాలొచ్చి చెప్పులు, చీపుర్లు లైనులో పెట్టి కూసుంటె దొరికినోళ్లకు దొరుకుతుండే. దొరకనోళ్లు రోజుల తరబడి ఎదురుచూత్తనే ఉండేది. వారం రోజులు తిరిగీ తిరిగీ బేజారైతుండె. యాష్టకొచ్చి రోడ్డుపైన బైఠాయించి బస్సులు, ఆటోలు ఆపితే కానీ, బత్తా దొరకలేదు. పోలీసులొచ్చి మా బాధలు జూసి వాళ్లు ఏమనక పోయేది. అప్పుడు పడ్డ కష్టాలు ఇప్పుడుంటే ఎవుసం జేసుకునోటోళ్లమే కాదు. నాడు గీగోస వద్దనుకుని నాకున్న మూడెకరాల భూమిల ఎకరం పంట సాగు చేసుకున్నం. తెలంగాణ వచ్చుడు తోటే మాకష్టాలు తీరినయ్. ఎరువుల కొరత లేదు. ఎప్పుడువడితే అప్పుడు దొరుకుతున్నయ్. ఉన్న మూడెకరాల భూమిల వరేసిన. నిన్ననే రైతుబంధు పైసలు పడ్డయ్. మందుల షాపుకొచ్చి ఎరువు బత్తా కొనుక్కుని పోతున్న.
– అలువాల రాజేశం, రైతు, ఒగులాపూర్ (తంగళ్లపల్లి మండలం)
ఆ బాధలు ఇప్పుడులేవు
నాకు మల్లాపూర్‌ల ఎనిమిదెకరాలు ఉన్నది. నేను మక్క, సోయా, వరి సాగు చేస్తుంట. ఉమ్మడి రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల కోసం అరిగోస పడ్డం. రోజుల తరబడి లైన్ల నిలబడితేకానీ దొరక్కపోయేవి. కానీ, తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో మా బాధలన్నీ తీరినయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అంతా మేలైతంది. సాగుకు ముందే రైతుబంధు కింద ఎకరానికి రూ.5 వేలు ఖాతాల్లో వేస్తున్నడు. ఉచిత కరెంట్, రైతు బీమా ఇస్తండు. ఎరువుల కోసం ఎదురుచూసే బాధ లేకుండా ముందే తెప్పించి ఇస్తున్నరు.
– చిట్యాల లక్ష్మణ్, రైతు (మల్లాపూర్)
పైరవీ చేస్తేనే దొరికేవి
తెలంగాణ వచ్చిన తర్వాత ఎరువులు పుష్కలంగా దొరుకుతున్నయి. రైతుల అవసరానికి తగ్గట్టు తెప్పించి ఇస్తున్నరు. గత పాలనలో ఎరువుల కోసం చాలా బాధలు పడుతుండె. మా నాన్న ఎన్నో పైరవీలు చేస్తేగానీ దొరక్కపోయేవి. ఇప్పుడు ఏ పైరవీ చేసే అవసరం లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్నది. అంతే కాకుండా వ్యవసాయ అధికారులు పంట పొలాల్లోకి వచ్చి మాకు సూచనలు, సలహాలు ఇస్తున్నరు. మట్టి పరీక్షలు చేసి ఎరువుల వినియోగం గురించి మాకు అవగాహన కల్పిస్తున్నరు. సీఎం కేసీఆర్ ఇస్తున్న రైతు బంధుతో విత్తనాలు, ఎరువులు కూడా కొనుగోలు చేస్తున్నం. ఆయిల్‌పామ్ తోటల కు భారీగా సబ్సిడీ ఇవ్వడంతో ఐదెకరాల్లో సాగు చేస్తున్న.
– సుభాష్‌రెడ్డి, అంతర్గాం, జగిత్యాల జిల్లా
రైతు మంచెరిగిన ప్రభుత్వమిది
తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎండకాలంలోనే విత్తనాలు, ఎరువులు అందించడం సంతోషంగా ఉన్నది. తెలంగాణ రాక ముందు పొద్దుగాల 6 గంటల నుంచి ఎరువుల దుకాణాలు, సొసైటీల ముందు చెప్పులను లైన్లలో పెట్టి చెట్ల నీడలో పడిగాపులు కాసేవాళ్లం. ఇప్పుడా బాధలు లేవు. సొసైటీల్లో, ఎరువుల దుకాణాల్లో అవసరమున్నప్పుడు పోయి వెంటనే ఏమి కావాలంటే అవి కొని తెచ్చుకుంటున్నం. రైతులకు ఇంతకన్నా ఏంకావాలి. రైతు మంచెరిగిన కేసీఆర్ మాకు ఇబ్బందులు లేకుండా ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు అందిస్తున్నడు. నాడు నకిలీ విత్తనాలతో అరిగోస పడి మళ్లీ మళ్లీ విత్తనాలు కొని నష్టపోయేవాళ్లం. కేసీఆర్ సీఎం అయినంక నాణ్యమైన విత్తనాలను పంట వేసే సమయానికి అందిస్తున్నరు. ఇలాంటి ప్రభుత్వం మళ్లీ, మళ్లీ రావాలని కోరుకుంటున్న.
– బోనగిరి భూమేశ్, రైతు, కేశాపూర్ (జగిత్యాల జిల్లా)
ఆ గోస తలుచుకొంటేనే భయమేస్తంది
మునుపు ఎరువుల కోసం పడిన గోస తలచుకొంటెనే భయమేస్తంది. ఆ బాధను మాటల్లో చెప్పలేం. యూరియా వచ్చిందని తెల్వంగనే దుకాణాల వద్దకు ఆగమేఘాల మీద పోయేటోళ్లం. అక్కడ లైన్ చూసి బెగడుపుట్టేది. కిందమీద పడి లైన్లో రెండుమూడు గంటలు నిల్చొన్న తర్వాత బస్తాలు అయిపోయేవి. మళ్లా తెల్లారి గిదే కథ. గిట్లా నాలుగైదు రోజులు తిరిగి తిప్పలవడితే రెండు బస్తాలు దొరికేవి. గవి ఎటూ చాలకపోయేవి. యూరియా కోసం తిరిగితే ఎవుసం పనులు ఎత్తిపోయేవి. ఎరువుల కోసం వెళ్తే గప్పుడు ఇచ్చిన అత్తరబుత్తర కరెంటుకు పొలం పారుడు గగనమయ్యేది. ఆ కష్టాలకు కంటినిండా నిద్ర కూడా పట్టేది కాదు. గిప్పుడు తొమ్మిదేళ్ల నుంచి ఎరువుల బాధ లేనే లేదు. ఎప్పుడు పడితే గప్పుడు పోయి తెచ్చుకుంటున్న. కేసీఆర్ సారు రైతులకు మంచి పనులు చేస్తుండు. కంటి నిండా నిద్ర, కడుపు నిండా బువ్వ తింటున్నం. ఇదంతా కేసీఆర్ సారూ గొప్పతనమే.
– పుట్టపాక కొమురయ్య, ఇప్పల్ నర్సింగాపూర్(హూజూరాబాద్)
ఎరువులకు కొరత లేదు
ఒకప్పుడు ఎరువుల కోసం తండ్లాడెటోళ్లం. సీజన్ మొదలైనంక వచ్చేటియి. పనులు వదిలిపెట్టుకొని వాటి కోసం లైన్లు కట్టెటోళ్లం. రోజుల తరబడి నిలబడినా ఒక్క ఎరువు బస్తా దొరికేది కాదు. అడుగు మందు టైంకు దొరకక నాట్లేసుడు ఎన్కకు పొయ్యేది. ఏ సీజన్లోనూ సరిపడా ఎరువులు ఉండేటియి కాదు. బఫర్ స్టాక్ ఎప్పుడు నిల్ అని చూపెటోళ్లు. రైలు ర్యాకులు వచ్చినయని తెల్వంగనే సొసైటీ ఆఫీసుల కాన్నో, డీసీఎంఎస్ సెంటర్ల కాన్నో లైన్ కట్టెటోళ్లం. మందు బస్తాలు రాక ముందే లైన్ కట్టి నిలబడెటోళ్లం. చెప్పులు లైన్ల పెట్టి ఏ చెట్టు నీడకో నిల్చుండెటోళ్లం. ఎప్పుడో ఓసారి 100, 200 బస్తాలు తెప్పించెటోళ్లు. వచ్చిన గంటలనే ఖతమయ్యేటియి. ఎరువుల కోసం లైన్లళ్ల నిలబడి రైతులు చచ్చిపోయిన సందర్భాలు సుతం ఉన్నయ్. అప్పటి కష్టాలు చెప్పరానివి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సార్ రైతులను చానా మంచిగ చూసుకుంటున్నడు. ఎక్కడా ఎసోంటి బాధలు లేకుంట చూస్తున్నడు. ఇప్పుడు సరిపడా ఎరువులు ఉండంగనే బఫర్ స్టాక్ పెడుతున్నరు. ఎప్పుడు అవుసరం పడితే అప్పుడు పోయి ఏ ఎరువు బస్త కావాల్నంటే ఆ ఎరువు బస్త తెచ్చుకుంటున్నం. ఎక్కడా ఇబ్బంది లేదు.
– మంద తిరుపతి, రైతు, గోపాల్పూర్ (కరీంనగర్)
ఉన్న ఊళ్లోనే పుష్కలంగా ఎరువులు
నేను ఎక్కువగా కూరగాయలు పండిస్త. ఇందుకు యూరియాతోపాటు కాంప్లెక్స్ ఎరువులు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎక్కువగా అవసరం ఉంటది. 2014 కంటే ముందు యూరియా, ఎరువుల బస్తాల కోసం సహకార సంఘాల వద్ద పాసుపుస్తకాలు పట్టుకుని క్యూలైన్లో నిలుచునేది. మరీ జనం ఎక్కువగా ఉంటే చెప్పులను లైన్లో ఉంచేవాళ్లం. అన్ని బాధలు పడ్డా చివరికి రెండు బస్తాల యూరియా కంటే ఎక్కువ ఇచ్చేటోళ్లుకాదు. మనకున్న అవసరం ఎక్కువ కానీ, ప్రభుత్వ సరఫరా, లభ్యత మార్కెట్లో కష్టంగా ఉండేది. కొన్ని సందర్భాల్లో అయితే ప్రైవేటు డీలర్లు నోస్టాక్ అని బోర్డులు పెడుతూ ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకునేవారు. ఆనాడు ఉన్న ప్రభుత్వాలు రైతుల డిమాండ్‌కు తగ్గట్టు ఎరువుల దిగుమతి లేకపోవడంతో ఎరువుల బస్తాల కొరత ఉండేది. కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో సేద్యరంగానికి చే యూతనివ్వడం వల్ల సాగునీరు, ఉచిత 24 గంటల విద్యుత్, ఎరువుల లభ్యత, పెట్టుబడి సాయం అందించడం వల్ల వ్యవసాయరంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. తద్వారా రాష్ర్టానికి అవసరమైన ఎరువులను ముందుగానే గుర్తించడం వ ల్ల సీజన్కంటే ముందే మా గ్రామాల్లో సహకార సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేయడంతో పాటూ నిర్ధేశిత గోదాముల్లో అందుబాటులో ఉంచడం వల్ల ఇప్పుడు ఎరువు బస్తాల కొరత తీరింది.
– సంత ప్రకాశ్‌రెడ్డి, ముత్యంపేట (మల్యాల మండలం)
ఎరువుల కోసం దెబ్బలు తిన్న
ఉమ్మడి రాష్ట్రంలో ఎరువుల కోసం పోరాటమే జరుగుతుండె. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద రాత్రి చెప్పులు క్యూ లైన్లో పెట్టి ఎదరుచూసే పరిస్థితులుండె. కొన్నిసార్లు ఎరువుల తక్కువగా ఉన్నాయని తెలిసి తోపులాట జరిగినప్పుడు పోలీసు లాఠీ దెబ్బలు కూడా తిన్న. అప్పట్లో వ్యవసాయం చేయాలంటే దుఃఖమచ్చేది. ప్రైవేటు షాపుల్లో స్టాక్ తక్కువగా ఉండి ఎక్కువ బ్లాక్‌లో అమ్ముకునే వాళ్లు. డబ్బులు ఎక్కువ పెట్టలేక పీఏసీఎస్‌లు, ఆగ్రోస్ సెంటర్ల వద్ద పడిగాపులుగాసేవాళ్లం. ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆ శ్రమ లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అవసరం ఉన్నన్ని ఎరువులను కొనుగోలు చేసుకుంటున్నం. పట్టణాలకు వచ్చే పని లేకుండా ప్రతి గ్రామానికి పంపిస్తున్నరు. ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే చాలా సులువైంది. సీఎం కేసీఆర్ రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా వంటి మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడంతో మా బతుకుల్లో వెలుగులు నిండినయ్.
– బందెల మల్లయ్య, లక్ష్మీపూర్