రెండున్నరేళ్ల ప్రజాకంఠక కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో ప్రజలందరికీ ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది. ‘సీఎం రేవంత్‌రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి’ అని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని చెప్పడానికి జీవన్‌రెడ్డే ఒక సాక్ష్యం. ఆయన ఈ నెల 20న కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్లో చేరుతుండడం చాలా సంతోషం. ఈ చేరిక కరీంనగర్ జిల్లాకే కాదు, యావత్ ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఎంతో బలాన్నిస్తుంది. నిన్న పార్లమెంటులో జరిగిన రెండు పరిణామాలు తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలచివేశాయి.
కర్నాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును ఇండియా, పాకిస్తాన్ వర్గీకరణతో పోల్చడం మన రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. ఆ మాటలు చూస్తుంటే ప్రజల గుండెలు రగిలిపోతున్నాయి. రాజ్యాంగబద్ధ ప్రక్రియపై కనీస అవగాహన లేకుండా తెలంగాణపై, తెలంగాణ ఉద్యమంపై బీజేపీ నేతలు విషం చిమ్ముతున్నారు. తేజస్వితో బేషరతుగా క్షమాపణ చెప్పించాల్సింది పోయి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెనకేసుకురావడం అంత్యంత దుర్మార్గం. మన రాష్ట్రం నుంచి ఎనిమిది మంది కాంగ్రెస్, ఎనిమింది మంది బీజేపీ ఎంపీలున్నా మౌనంగా కూర్చోవడం సిగ్గుచేటు. ఇవ్వాళ బీఆర్ఎస్ ఎంపీలు లేనిలోటు స్పష్టంగా కనిపించింది.
మన ఎంపీలు సభలో ఉండి ఉంటే తేజస్వికి మూతి పగిలేలా సమాధానం చెప్పేవాళ్లు. ఇప్పటికైనా తేజస్వి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. మహిళా బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్‌కు క్లారిటీ లేదు. అవి దొందూ దొందే. మహిళలకు తీరని ద్రోహం చేశాయి. డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ విధానం లోక్‌సభలో నవ్వులపాలైంది. అది హైబ్రిడ్ కాదు క్రాస్ బ్రీడ్ అని దేశానికి తెలిసింది. ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అర్థమవుతుందో లేదో! తేజస్వి సూర్య విషం చిమ్ముతుంటే రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందిచలేదు. బడేభాయ్కి కోపం వస్తుందనా? రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా విఫలం చెందింది. ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనే నినాదంతో నిర్వహిస్తున్న జగిత్యాల సభ భారీ సక్సెస్ అవుతుంది.
– మీడియాతో బీఆర్ఎస్ శాసన సభాపక్ష ఉపనేత హరీశ్ రావు