Godavarikhani | కోల్ సిటీ, మే 22: ఆయన మరణించినా కళ్లు మాత్రం ఈ లోకంను చూస్తున్నాయి. గోదావరిఖని ఫైవింక్లయిన్ కాలనీకి చెందిన ముత్యాల కనకయ్య అలియాస్ మొండయ్య (82) అనే సింగరేణి రిటైర్డ్ కార్మికుడు అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. అతడికి భార్య లక్ష్మీ, కుమారులు చంద్రమౌళి, సంపత్, రాజన్న, కూతుళ్లు సమ్మక్క, అనసూయ ఉన్నారు.
తమ తండ్రి మరణించాడన్న పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా కుటుంబ సభ్యులు సమాజ హితం కోసం ఆలోచించి తండ్రి నేత్రాలను దానం చేయడానికి సంకల్పించారు. సదాశయ ఫౌండేషన్ కార్యదర్శి భీష్మాచారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. దీనితో ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి కేఎస్ వాసు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంకు టెక్నిషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో మృతుడి నేత్రాలను సేకరించి హైదరాబాద్ కు తరలించారు.
రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. కనకయ్య మరణించినా మరో ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగు నింపినందుకు కుటుంబ సభ్యులను అభినందించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అభినందన పత్రం అందజేశారు. కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, గౌరవ అధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి, సలహాదారు నూక రమేష్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు పీ మల్లికార్జున్, మాజీ అధ్యక్షురాలు తానిపర్తి విజయలక్ష్మి గోపాల్ రావు, సదాశయ ఫౌండేషన్ పెద్దపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలు వెల్ది కవిత అనంతరాములు తదితరులు అభినందించారు.