జగిత్యాల టౌన్, మే 24 : నాణ్యమైన విత్తనాలు వాడితే అధిక దిగుబడులు పొందవచ్చని రైతులకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ సంచాలకుడు డాక్టర్ జీ శ్రీనివాస్ సూచించారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో శుక్రవారం విత్తన మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసుకోవడంతోపాటు సరైన సమయంలో పంటలు సాగు చేస్తే చీడపీడల ఉధృతి తగ్గి పంట పెట్టుబడి ఖర్చు తగ్గుతుందన్నారు.
దీంతోపాటు నాణ్యమైన అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. రైస్ బ్రీడర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతులు విత్తనోత్పత్తి చేపట్టడం ద్వారా విత్తనానికి అయ్యే ఖర్చు తగ్గించుకోవచ్చన్నారు. రైతులు సాగు చేసిన వరిని విత్తనాలుగా ఇతర రైతులకు అమ్మడం వల్ల కూడా ఆదాయం పొందవచ్చని సూచించారు.
అనంతరం పరిశోధనా స్థానం నుంచి విడుదలైన వివిధ రకాల విత్తనాలు, వాటి లక్షణాలు, వరి విత్తనోత్పత్తిలో చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులను వివరించారు. అనంతరం ఏడీఆర్ జీ శ్రీనివాస్ విత్తన మేళాను ప్రారంభించారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విత్తనాలను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ గోన్యానాయక్, ఇతర విభాగాల శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.