ధర్మారం/ వీణవంక/ జూలపల్లి, నవంబర్ 15 : గ్రూప్-4 ఉద్యోగాల్లో యువతీ యువకులు సత్తా చాటారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించగా, తాజాగా ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన నలుగురు యువకులు (జూనియర్ అసిస్టెంట్) ఉద్యోగాలు సాధించారు. ఇందులో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. పిల్లలమర్రి వినోద్, అరవింద్ అన్నదమ్ములు కాగా, అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు లైశెట్టి అఖిల్, అలువాల కమలాకర్ కొలువులు కొట్టారు. అందరిదీ వ్యవసాయ కుటుంబాలే కాగా, తొలి ప్రయత్నంలో ఒకే గ్రామానికి చెందిన యువకులు ఉద్యోగాలు సాధించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
వెంకటేశ్‌కు నాలుగు ఉద్యోగాలు
వీణవంక మండలంలోని ఐలాబాద్కు చెందిన పురంశెట్టి వెంకటేశ్ పటేల్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆ యువకుడు బాసర ట్రిపుల్ ఐటీ బీటెక్ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో చదివాడు. గతంలో ఏఈఈ గెజిటెడ్ ఆఫీసర్, ఏఈ మున్సిపల్, ఎస్సెస్సీలో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగం సాధించగా, గ్రూప్-4 ఫలితాల్లో సత్తాచాటాడు. ప్రస్తుతం వెంకటేశ్ జగిత్యాల జిల్లా పంచాయతీరాజ్‌లో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
సాయికుమార్‌కు మూడు కొలువులు
జూపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి గోరువంతుల సాయికుమార్ మూడు ఉద్యోగాలకు ఎంపికై సత్తా చాటాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ యవకుడు, ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేశాడు. అతడికి ఏడాది వయస్సునప్పుడే తండ్రి శంకరయ్య అదృశ్యం కావడంతో తల్లి ప్రమీల కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషించింది. కనీసం ఉండడానికి ఇల్లు లేక ప్రమీల తన అమ్మగారింట్లో జీవిస్తున్నది. ఈ క్రమంలో ఆత్మైస్థ్యెర్యం కోల్పోకుండా సాయికుమార్ మొదటి ప్రయత్నంలోనే 2023లో సీఐఎస్ఎఫ్ ఉద్యోగం సాధించాడు. ఆ తర్వాత ఇటీవల తెలంగాణ పోలీస్ ఉద్యోగ నియామకాల్లో సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికై ఖమ్మం సీటీసీలో దాదాపు 9 నెలల నుంచి శిక్షణ పొందుతున్నాడు. గురువారం విడుదల చేసిన గ్రూప్-4 ఫలితాల్లో వార్డ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు.