Ramagundam Baldia | కోల్ సిటి , జూన్ 25: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆదేశాలను రామగుండం నగర పాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రోడ్లపై పశువులు కనిపిస్తే వెంటనే గోశాలకు తరలించాలని ఈ నెల 4న ఆమె ఆదేశాలు జారీ చేశారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేపట్టాలని సూచించారు. అయినప్పటికీ నగర పాలక సంస్థ అధికారులు అవేమి పట్టించుకోవడం లేదు. దీంతో నగరంలోని ప్రధాన రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పశువులు తగ్గేదేలే అన్నట్టుగా సంచరిస్తూ స్థానికులు భయకంపితులను చేస్తున్నాయి.
ఈ క్రమంలో బుధవారం గోదావరిఖని తిలకనగర్ ప్రాంతంలో ఒక ఆంబోతు బీభత్సం సృష్టించింది. అక్కడే రోడ్డుపై ఆవులతో తలపడటంతో స్థానికులు, వాహనదారులు భయంతో పరుగులు పెట్టారు. నగరంలోని ప్రధాన రోడ్లపై పశువుల సంచారం ఏమాత్రం తగ్గడం లేదు. కమిషనర్ హెచ్చరికలను అటు పశువుల యజమానులు కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఎల్బీనగర్, జవహర్ నగర్, తిలక్ నగర్, ప్రధాన చౌరస్తా, గాంధీనగర్, మార్కండేయ కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్డపై నిత్యం పశువులు పదుల సంఖ్యలో తిష్టవేస్తున్నాయి.
దీనితో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల పశువులను తప్పించబోయి ప్రమాదాలకు గురవుతున్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆదేశించినా నగర పాలక అధికారులు ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏలాంటి ప్రాణనష్టం జరగకముందే మరొకసారి కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.