రాజన్నసిరిసిల్ల, ఏప్రిల్ 19( నమస్తే తెలంగాణ)/ వేములవాడ రూరల్: తెలంగాణ ఉద్యమకారురాలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వీరాభిమాని చిందం సత్తెవ్వ(88) అలియాస్ తెలంగాణ సత్తెవ్వ కన్నుమూశారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన ఆమె, కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. కేసీఆర్ వీరాభిమాని అయిన సత్తెమ్మకు కేటీఆర్ అంటే ఎనలేని ప్రేమ, అభిమానం. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంది.
తెలంగాణ సత్తెవ్వగా పేరుపొందింది. సత్తెవ్వ స్వగ్రామం చీర్లవంచ మధ్యమానేరులో పూర్తిగా ముంపునకు గురికాగా, కేటీఆర్ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడులో డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చి అండగా నిలిచాడు. భర్త నర్సయ్య 20 ఏండ్ల క్రితమే మృతిచెందాడు. కొడుకు రవి, కూతురుకు వివాహాలు జరిపించింది. కొద్దిరోజుల క్రితం కొడుకు రవి చనిపోగా, అప్పటి అతడి నివాసం వేములవాడ మండలం చీర్లవంచ ఆర్అండ్ఆర్ కాలనీలోనే ఉంటున్నది. 15 రోజుల క్రితం అనారోగ్యం బారిన పడిన సత్తెవ్వ కరీంనగర్‌లోని దవాఖానలో చేర్పించారు. ఆపరేషన్ నిర్వహిస్తుండగా హార్ట్స్ట్రోక్ రావడంతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కన్నీటి వీడ్కోలు
తెలంగాణ సత్తెవ్వ మృతివార్త తెలువగానే కేటీఆర్ తీవ్ర ద్రిగ్భాంతికి గురయ్యారు. సత్తెవ్వ చివరి చూపుకోసం హైదరాబాద్ నుంచి హుటాహుటిన వేములవాడ మండలం చీర్లవంచ ఆర్‌అండ్‌అర్ కాలనీకి చేరుకున్నారు. సత్తెవ్వ భౌతిక కాయంపై పార్టీ జెండాను కప్పి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్తెవ్వ మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసి, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సత్తెవ్వ భౌతికకాయాన్ని చూసి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. చెమ్మగిల్లిన కండ్లతో అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావుతో కలిసి స్వయంగా పాడె మోసి కన్నీటి వీడ్కోలు పలికారు.
సత్తెవ్వ మృతి వార్త తెలియగానే సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలం, వేములవాడ అర్బన్ మండలం నుంచి భారీగా బీఆర్ఎస్ నేతలు ఉద్యమనేతలు తరలివచ్చారు. సత్తెవ్వ అంత్యక్రియలను సైతం కేటీఆర్ సొంత ఖర్చులతోనే నిర్వహించారు. ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, ఏనుగు మనోహర్‌రెడ్డి, బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, బీఆర్ఎస్ పార్టీ నేతలు గజభీంకార్ రాజన్న, పడిగెల రాజు, సెస్ డైరెక్టర్ హరిచరణ్‌రావు, బొల్లి రామ్మోహన్, జక్కుల నాగరాజుయాదవ్, అబ్బడి అనిల్‌రెడ్డి, మోతె మహేశ్, జక్కుల రవీందర్, ముక్త మహేశ్ ఉన్నారు.
సత్తెవ్వ మృతి బాధాకరం: మాజీ ఎంపీ వినోద్‌కుమార్
తెలంగాణ సత్తెవ్వ మృతి బాధాకరమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. సంతాపం ప్రకటించారు. సత్తెవ్వ స్వగ్రామం మధ్య మానేరులో ముంపునకు గురవ్వడంతో డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చి అండగా నిలిచామని గుర్తు చేశారు.