POCSO Case | గాంధీచౌక్ : మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు కోటగిరి శ్రీనివాస్ గౌడ్ (55) కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన తొమ్మిదేళ్ల మైనర్ బాలికను 2020 ఫిబ్రవరి 23న అదే ప్రాంతానికి చెందిన నిందితుడు కోటగిరి శ్రీనివాస్ గౌడ్ మాయమాటలతో తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గంభీరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాలు, బాధితురాలి వాంగ్మూలం, వైద్య నివేదికలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిందితుడిపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసు సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజనీకాంత్ వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ సమర్పించిన మౌఖిక, డాక్యుమెంటరీ సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిపై అభియోగాలు రుజువైనట్లు నిర్ధారించి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించింది. బాలలపై లైంగిక నేరాలకు పాల్పడే వారిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని, ఇలాంటి ఘటనలపై బాధిత కుటుంబాలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే సూచించారు.