Chigurumamidi | చిగురుమామిడి, జనవరి 23: వైద్య సిబ్బందికి బలవంతపు డ్యూటీ వల్లే ఆశా వర్కర్లకు ప్రమాదం జరిగిందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేష్ అన్నారు. చిగురుమామిడి మండలంలో విధులు నిర్వహించి రేకొండకు వెళ్తున్న క్రమంలో ద్విచక్ర వాహనంపై కిందపడి గాయపడిన రేకొండ ఆశా వర్కర్లు బండారి సరోజన, దుడ్డేల తిరుమలను ఆయన శుక్రవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలకు సైతం ఆశాలకు డ్యూటీ వేయడం జరుగుతుందని, ప్రమాదం జరిగితే వైద్య సిబ్బంది ఇప్పటివరకు కనీసం పట్టించుకోలేదని అన్నారు. సంబంధిత మండల వైద్యాధికారి అక్కడే ఉన్నప్పటికీ వైద్య పరీక్షలు చేయలేదని, ఎలాంటి ట్రీట్మెంట్ చేయలేదని అన్నారు.
ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన పట్టించుకోరా అని ప్రశ్నించారు. ఆశా వర్కర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వం ద్వారా గుర్తింపు లేని డ్యూటీలు ఆశా వర్కర్లు చేయకూడదని అన్నారు. వీరి వెంట యూనియన్ మండల ప్రధాన కార్యదర్శి బోయిన ప్రియాంక, పూజ తదితరులున్నారు.