రాజన్న ఆలయంలో ఏసీబీ అధికారుల తనిఖీల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వామివారికి ఆదాయాన్ని గడించే నాలుగు శాఖలే టార్గెట్‌గా చేసుకొని కొద్ది రోజులుగా వస్తున్న ఫిర్యాదుల ఆరోపణలతో సోదాలు చేడయం కలకలం రేపింది.
వేములవాడ, ఆగస్టు 23 : రాజన్న ఆలయంలోని కొద్ది రోజులుగా అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ప్రధానంగా నాలుగు విభాగాలే టార్గెట్‌గా సోదాలు చేశారు. మొదటి రోజు 20 మంది అధికారులతో కూడిన బృందం దాదాపు 10గంటలపాటు తనిఖీలు చేయగా, రెండో రోజు శుక్రవారం పది మంది 12గంటలపాటు సోదాలు చేశారు.
లీజుల టెండర్లు, నిత్యాన్నదానం సత్రం రికార్డులను పరిశీలించారు. ప్రధానంగా లడ్డూ ప్రసాదాల తయారీ విక్రయాలకు సంబంధించిన గోదాం నిల్వలు, లీజులు టెండర్లు, వసతి గదుల సముదాయాలు, నిత్యాన్నదానం సత్రంలోని అన్ని రికార్డులను పరిశీలించారు. తనిఖీలు చేసిన సమయంలో ప్రతి అంశాన్నీ ల్యాప్‌టాప్‌లలో పొందుపరిచారు. అయితే, అనుమానమున్న ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా, కొన్ని శాంపిళ్లను సేకరించారు.
రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో తిష్ట వేసి, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం ఇటీవలే భారీ ఎత్తున ఉద్యోగ బదిలీలు చేపట్టింది. అయితే, వేములవాడ, యాదగిరిగుట్ట నుంచి అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు బదిలీ అయ్యారు. అయినప్పటికీ విజిలెన్స్, ఇతర ఆరోపణలు ఉన్నవారు మాత్రం బదిలీ కాలేదు. ఈ నేపథ్యంలోనే ఫిర్యాదులు వెల్లువెత్తడం, మొదట విజిలెన్స్ అధికారులు ఆ తర్వాత ఏసీబీ దాడులు చేయడం కలకలం రేపుతున్నది. ఈ వ్యవహారంతో పేదల దేవుడు రాజన్నకు మచ్చ పడేనా? అనే ఆందోళన భక్తుల్లో కనిపిస్తుండగా, దాడులపై జోరుగా చర్చ సాగుతున్నది.