ఆవునూరి రమాకాంత్ రావుకు గులాబీ కండువా కప్పిన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు. చిత్రంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి, టీడీటీడీసీ చైర్మన్ ప్రవీణ్, పార్టీ జిల్లాధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షు డు చక్రపాణి, సీనియర్ నాయకుడు చీటి నర్సింగరావు
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): బండి సంజయ్‌ను నమ్మి బీజేపీలో చేరితే నట్టేట ముంచాడని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది ఆవునూరి రమాకాంత్‌రావు మండిపడ్డారు. స్థానిక కార్యకర్తలు, నాయకులతో చర్చికుండా నర్సంపేటకు చెందిన రాణిరుద్రమకు సిరిసిల్ల టికెట్ ఎట్ల ఇస్తారని ప్రశ్నించారు. ఇన్నేండ్లుగా కష్టపడిన తనకు నమ్మక ద్రోహం జరిగిందని, పార్టీ, కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీలో అంత ఒంటెద్దుపోకడలేనని, సమన్వయ లోపం ఉన్న ఈ పార్టీలో తాను పని చేయలేనని స్పష్టం చేశారు. మంగళవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో పైకి కనపడేది సిద్ధాంతమని, లోపల మాత్రం అన్ని గ్రూపు రాజకీయాలేనని విమర్శించారు. ఒక నాయకుడితో మాట్లాడితే ఇంకో నాయకుడికి కోపమని, కార్యకర్తలు, కింది స్థాయి నాయకులను చిత్రవద చేస్తున్న వంటి పార్టీ బీజేపీనేని మండిపడ్డారు.
రాణిరుద్రమకు సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి గెలిపించుకుంటామని, గతేడాదే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందని, ఆ నిర్ణయమేదో పార్టీలోని కార్యకర్తలకు తెలిపితే సహకరించేవాళ్లమన్నారు. రాజకీయాల్లో నమ్మకమే ప్రధాన పెట్టుబడని, నాయకత్వాన్ని నమ్మి పార్టీలో చేరి నాలుగున్నర సంవత్సరాలు కష్టపడిన మాకు నీవిచ్చే ఫలితం ఇదేనా అంటూ.. బండిని నిలదీశారు. నా ప్రశ్నకు బండి సంజయ్ సమాధానం చెప్పి తీరాల్సిందేనన్నారు. నన్ను పార్టీలోకి ఆహ్వానించిన సంజయే.. ఏడాది క్రితం నుంచే ప్రస్తుత అభ్యర్థిని బలపరిచి మమ్మల్ని నట్టేట ముంచారని మండిపడ్డారు. బీజేపీని నమ్మి నాలుగున్నర ఏండ్ల కింద పార్టీలో చేరానని, 25ఏండ్ల తన న్యాయవాద వృత్తి, భార్యాపిల్లలను పక్కనపెట్టి పార్టీ ఎదుగుదల కోసం కష్టపడ్డానని చెప్పారు. పార్టీ తీసుకున్న నిర్ణయాలు చాలా బాధకరం అనిపించి మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుపాలని ముందుకొచ్చినట్లు తెలిపారు. బండి సంజయ్‌ను కలిసి మాలో ఎవరికైనా టికెట్ ఇవ్వాలని అడిగితే అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పారన్నారు. తాము రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదిస్తే మీది ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గమని, ఆయన నిర్ణయమే మేరకే అభ్యర్థినిని ఎంపిక చేసినట్లు సమాధానం ఇచ్చారన్నారు. కార్యకర్తలకు చెప్పకుండా నిర్ణయాలు తీసుకోవడం మామనోభావాలు, ఆత్మగౌరవాన్ని కించేపర్చడమేనన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజా శ్రేయస్సు గురించి పోరాటం చేసే వ్యక్తులనే గౌరవించాలని, నమ్మించి నట్టేట ముంచేవారిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌కి పంపించినట్లు తెలిపారు.
బీజేపీకి షాక్.. బీఆర్ఎస్లో చేరిక
సిరిసిల్ల బీజేపీలో ముసలం మొదలైంది. పార్టీని వీడి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. పార్టీలో గ్రూపు రాజకీయలున్నాయని ఆరోపిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసిన సిరిసిల్లకు చెందిన ప్రముఖ న్యాయవాది ఆవునూరి రమాకాంత్‌రావు తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మంగళవారం ఆయన బీజేపీకి రాజీనామా చేసిన వెంటనే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పార్టీ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సీనియర్ నాయకుడు చీటి నర్సింగరావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్‌తో మంతనాలు జరిపారు. బీఆర్ఎస్ పార్టీలో చేరాలని వారి ఆహ్వానం మేరకు.. రమాకాంత్‌రావు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సంమక్షంలో చేరారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ గెలుపు కోసం తన శక్తి మేరకు పనిచేస్తానని రమాకాంత్‌రావు తెలిపారు.