Road Accident | వేములవాడ రూరల్, జూన్ 24: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం హనుమాన్ ఆలయ సమీపంలో పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న ఓ యువకుడు టిఫిన్ చేసి తిరిగి వచ్చే క్రమంలో రోడ్డు క్రాస్ చేస్తున్న ఆటోను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం బస్వాపూర్ కు చెందిన ఒంటెడు శేఖర్ (20) గత మూడు సంవత్సరాలుగా వేములవాడ నంది కమాన్ వద్ద గల పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు.
పెట్రోల్ బంక్ నుండి అగ్రహారం వైపు టిఫిన్ చేసేందుకు వెళ్లాడు. తిరిగి తన ద్విచక్ర వాహనంపై నంది కమాన్ వద్ద గల పెట్రోల్ బంకు వైపు వస్తున్నాడు. కాగా అగ్రహారం హనుమాన్ ఆలయం ముందు రోడ్డు క్రాస్ చేస్తున్న ఆటోను ద్విచక్ర వాహనం ఢీకొంది. దీంతో శేఖర్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వేములవాడ పట్టణ సీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగంగా ద్విచక్ర వాహనం రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు.