Road accident | పెగడపల్లి: పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన భోగ సతీష్ (30) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈఘటన బుధవారం చోటుచేసుకుంది. పెగడపల్లి ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన భోగ సతీష్, తాటిపాముల భాస్కర్, తాటిపాముల మధు, కొత్తూరి నవీన్ కలిసి మంగళవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలపై రామడుగు మండలం గోపాల్రావుపేటకు బిర్యానీ తినేందుకు వెళ్లారు.
అక్కడ నుండి తిరిగి ఇంటికి వస్తుండగా, మండలంలోని నర్సింహునిపేట వద్ద ముందు వెళుతున్న భోగ సతీష్ స్పీడ్ బ్రేకర్ రావడంతో ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుకే వస్తున్న మధు వాహనం ఢీ కొట్టింది. దీంతో రెండు వాహనాలతో పాటు వారు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో సతీష్ తలకు తీవ్ర గాయం కాగా, మిగిలిన ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. కాగా వీరిని చికిత్స నిమిత్తం 108లో జగిత్యాల ప్రభుత్వ దవాఖానాకు తీసుకెళ్లారు. కాగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సతీష్ మృతి చెందాడు. మిగిలిన ముగ్గురికి చికిత్స జరుగుతోందని, సతీష్ తల్లి వజ్రవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు.