పెద్దపల్లి రూరల్, జనవరి 13 : మరో వారంలో ఆస్ట్రేలియా వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఆ యువకుడు, అనుకోని రీతిలో మృత్యుఒడికి చేరాడు. బంధువుల ఇంటికి వెళ్లొస్తూ కారు బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు, గ్రామస్తులు వివరాల ప్రకారం.. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి అనుబంధ గ్రామం గుంటూరుపల్లికి చెందిన తుమ్మ విజయపాల్‌రెడ్డి-విజయ దంపతులు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లిలో నివాసముంటున్నారు. వీరికి వినీత్‌రెడ్డి (27), విక్రమ్‌రెడ్డి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు వినీత్‌రెడ్డి ఉద్యోగ రీత్యా ఆస్ట్రేలియా, విక్రమ్‌రెడ్డి అమెరికాలో స్థిరపడ్డాడు. క్రిస్మస్ పండుగ సెలవుల నేపథ్యంలో గత డిసెంబర్లో వినీత్‌రెడ్డికి ఇంటికి వచ్చాడు. ఈ నెల 20న గాని, ఆ తర్వాతగాని మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది.
కాగా, శుక్రవారం తన బంధువైన నల్గొండ జిల్లా జనగాంకు చెందిన గాదె అఖిల్‌రెడ్డితో కలిసి గుంటూరుపల్లికి కారులో వెళ్లారు. అక్కడ కటుంబసభ్యులు, బంధువులను కలసి ‘నేను మరో వారంలో వెళ్తున్నా’ అని చెప్పాడు. అర్ధరాత్రి వరకు అందరితో ఆనందంగా గడిపాడు. రాత్రి 2 గంటల ప్రాంతంలో అఖిల్‌రెడ్డి, నిమ్మనపల్లికి చెందిన దుగ్గెంపూడి సాయితేజరెడ్డి, అల్లం బాల అనురోహిత్రెడ్డితో కలిసి పెద్దపల్లికి తిరిగి బయలుదేరారు. నిమ్మనపల్లి శివారులో పెద్దకల్వలకు వెళ్లే మార్గంలో కారు అదుపు తప్పి దారి పక్కనున్న వ్యవసాయబావిలోకి దూసుకెళ్లింది.
కారుతో నీటిలో మునిగిపోతున్న క్రమంలోనే సాయితేజరెడ్డి డోరు తీసుకొని, ఈత కొడుతూ పైకి చేరుకున్నాడు. అక్కడ పెద్ద బండరాయి తీసుకొని కారు అద్దాలు పగులకొట్టాడు. దాంతో మరో ఇద్దరు అఖిల్‌రెడ్డి, బాల అనురోహిత్రెడ్డి పైప్‌ను పట్టుకొని పైకి వచ్చారు. డ్రైవింగ్ చేసిన వినీత్‌రెడ్డి సీటు బెల్టు పెట్టుకోవడంతో బయటికిరాలేకపోయాడు. అప్పటికే సమాచారం అందడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. ఇటు పోలీసులు, ఫైర్ అధికారులకు వారంతా అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి 3.30 గంటల ప్రాంతంలో వినీత్‌రెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. శనివారం మధ్యాహ్నం కారును క్రేన్ సహాయంతో పైకి తెచ్చారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లేశం తెలిపారు.