వేములవాడ, జూన్ 1 : వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ మహిళ తాను న్యాయమూర్తి అని చెప్పి ప్రోటోకాల్ దర్శనం, ఆలయ అతిథి మర్యాదలను అధికారుల ద్వారా పొంది చివరికి హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయడంతో రాజన్న ఆలయ అధికారులు కంగుతిన్నారు. హైదరాబాదులోని అంబర్‌పేటకు చెందిన ప్రసన్నారెడ్డి అనే మహిళ ఆదివారం వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే తాను మొదటగా న్యాయవాదిని, తర్వాత రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు న్యాయమూర్తి అని ఆలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులను నమ్మించింది.
దీంతో రాజన్న ఆలయ అధికారులు ప్రోటోకాల్ దర్శనం చేయించి సకల మర్యాదలు చేశారు. అయితే సదరు మహిళ హైకోర్టులో, హైదరాబాద్‌లో ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి నగదు వసూలు చేసి మోసాలకు పాల్పడినట్లుగా ఫిర్యాదులు రావడంతో మధురానగర్ పోలీసులు ఆమెను వెతుక్కుంటూ వేములవాడ వరకు వచ్చారని సమాచారం. దర్శనం చేసుకుని తిరిగి కరీంనగర్ మీదుగా వెళుతుండగా ఆమెను అరెస్టు చేయడంతో విషయం వెలుగు చూసింది. ఇక మహిళను పోలీసులు అరెస్టు చేయడంతో వేములవాడ రాజన్న ఆలయంలోనూ తాను న్యాయమూర్తి నని దర్శనం చేయించుకున్నట్లు విషయం వెలుగు చూడగా ఇటు రాజన్న ఆలయ అధికారులు, పోలీసులు కూడా కంగుతిన్నారు. సదరు మహిళలపై పోలీస్ శాఖ కూడా ఆరా తీసింది.