Dharmapuri | ధర్మపురి, డిసెంబర్ 10: బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామశివారులో మద్దునూర్ కు చెందిన గొల్లపెల్లి జగ్గయ్యకు చెందిన ద్విచక్రవాహనం ఇంజన్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల రన్నింగ్‌లోనే మంటలు చెలరేగి నిప్పులు చిమ్ముతూ కాలిబుగ్గిపాలైంది. బాధితుడు జగ్గయ్య కథనం ప్రకారం.. మద్దుసూరు చెందిన గొల్లపెల్లి జగ్గయ్య బుధవారం గ్రామశివారులోని రాయపట్నం రోడ్డు వైపుగల తనపొలం వద్దకు తన ద్విచక్రవాహనం వెళ్లి వస్తుండగా.. మద్దునూర్ వాగు లోలెవల్ వంతెన వద్దకు చేరుకోగానే వాహనం ఒక్కసారిగా విఫరీతమైన వేడి అనిపించడంతో వాహనాన్ని ఆపి చూసుకునే సరికి అప్పటికే ఇంజన్లో మంటలు చెలరేగుతున్నాయి.
వెంటనే అప్రమత్తమైన జగ్గయ్య వాహనాన్ని పక్కకు నెట్టేసి దిగిపోయాడు. దీంతో ప్రాణాపాయం తప్పినట్లయింది. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ లాభంలేకుండా పోయింది. వాహనం పూర్తిగా దగ్ధమైంది. వాహనం కొనుగోలు చేసి 14 నెలలు మాత్రమే గడిచాయని బాధితులు తెలిపాడు.