chigurumamidi | చిగురుమామిడి, జూన్ 9: ఇందిరమ్మ ఇళ్లు ఎంపిక, రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరగలేదని అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై అనర్హులను ఎంపిక చేయడం జరిగిందని ఆరోపిస్తూ సీపీఐ మండల శాఖ ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట బైఠాయించి, సీపీఐ నాయకులు సోమవారం ధర్నా చేపట్టారు. 10 గంటలకు కార్యాలయం చేరుకొని కార్యాలయాల తలుపులు తెరవకుండా నాయకులు ముట్టడించారు. చాలా గ్రామాల్లో అర్హులైన నిరుపేదలకు ఇల్లు మంజూరు కాలేదని, కాంగ్రెస్ నాయకులు ఎంపీడీవోతో కలిసి అనర్హులను ఎంపిక చేయడం జరిగిందన్నారు.
రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదన్నారు. పలు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, నాయకుల చేతివాటం జరిగిందని ఆరోపణలు ఉన్నాయన్నారు. వీటిపై గ్రామాల్లో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నాయకులతో కుమ్మకైన ఎంపీడీవో పై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, సహాయ కార్యదర్శి బూడిద సదాశివ, జిల్లా కార్యవర్గ సభ్యులు అందే స్వామి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, రైతు సంఘం మండల అధ్యక్షులు గోలి బాపురెడ్డి, నాయకులు జిల్లా నాయకులు యుగంధర్, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, అందే చిన్నస్వామి,మండల నాయకులు బండారీ తిరుపతి, పైడిపల్లి వెంకటేష్, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
నాయకులు, పోలీసుల మధ్య తోపులాట
మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించిన సిపిఐ నాయకులను ధర్నా విరమించాలని ఎస్సై చందబోయిన శ్రీనివాస్ నాయకులకు నచ్చ చెప్పినప్పటికీ సమేమిరా అనడంతో, అధికారుల విధులకు ఆటంకాలు కలిగిస్తున్నారని పోలీసులు ధర్నా విరమించే ప్రయత్నం చేయగా, పోలీసులకు నాయకుల మధ్య వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తో పాటు సిపిఐ నాయకులందరినీ పోలీసులు స్టేషన్ కు తరలించారు.
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం : పంజాల శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి
అధికార కాంగ్రెస్ తో స్నేహపూర్వక పొత్తు ఉన్నప్పటికీ, ప్రజా సమస్యల పోరాటాలపై సిపిఐ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరగలేదని పూర్తిస్థాయిలో గ్రామాల వారిగా విచారణ జరిపించాలన్నారు. కొన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు సైతం లబ్ధిదారులతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు ఉన్నాయన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎంపీడీవో పై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.