Godavarikhani | కోల్ సిటీ, జనవరి 3 : సహజ సిద్ధమైన లక్క పొగ శనివారం గోదావరిఖని నగరంను ఆవహించింది. అర్ధరాత్రి నుంచి మొదలు శనివారం ఉదయం 9 గంటల దాకా అదృశ్య వాతావరణం కేంద్రీకృతమైంది. సహజంగా అరకు లోయలో ఆవిష్కృతమయ్యే ఇలాంటి అదృశ్య వాతావరణం శనివారం గోదావరిఖనిలో అరుదుగా కనిపించింది. ఉదయం జనాలు బయటకు వచ్చేసరికి ఎదురుగా ఎవరికి ఎవరు కనిపించకుండా దట్టమైన పొగ దిగ్భందించి ఉండటంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.
అరుదైన ఈ వాతావరణం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదివరకు ఎప్పుడు లేని విధంగా గోదావరిఖనిలో ఇలాంటి ప్రభావం చోటు చేసుకోవడం కనువిందు చేసింది. ఉదయం పూట పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, డ్యూటీలకు వెళ్లే సింగరేణి కార్మికులు రోడ్లపై దట్టమైన పొగ కారణంగా ఎదురుగా ఏముందో కనిపించకుండా ఉండడంతో ఇబ్బందులకు గురయ్యారు. గద్యంతరం లేక వాహనాలను ఎక్కడికి అక్కడ నిలిపివేసి ఆగిపోవలసి వచ్చింది. ఈ దట్టమైన లక్క పొగ చాలామందిని కలవర పెట్టింది. ఉదయం 9 గంటల తర్వాత నెమ్మదిగా వాతావరణం పూర్వస్థితికి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.