తిమ్మాపూర్ రూరల్, ఆగస్టు 9 : ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రైతుల పాలిట శాపంగా మారిందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. యూరియా కోసం సొసైటీల ఎదుట చెప్పుల లైన్లు పెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దకుతుందని ఎద్దేవాచేశారు. చెప్పుల లైన్లు చూస్తున్నా కూడా.. ఎమ్మెల్యే ఎరువుల కొరత లేదనడం సిగ్గుచేటని మండిపడ్డారు. శనివారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రసమయి మాట్లాడారు. సొసైటీల వద్ద పోలీసుల బందోబస్తుతో యూరియా పంపిణీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నియోజకవర్గంలోని అన్ని సొసైటీల పరిధిలో యూ రియా అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే కవ్వంపల్లికి సూచించారు.
రైతు వేదికలో కూర్చుని రాజకీయాలు మాట్లాడిన ఎమ్మెల్యేకు.. అది ఎవరు నిర్మించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతుబంధు, రైతుబీమా లేవని.. కరెంటు కోతలు మళ్లీ మొదలయ్యాయని మండిపడ్డా రు. అన్నం పెట్టే రైతులను తాగుబోతులని సంబోధించిన కవ్వంపల్లి సత్యనారాయణ అసమర్థ ఎమ్మెల్యేగా మిగిలిపోతాడని విమర్శించారు. మానకొండూరు నియోజకవర్గం లో లక్ష ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. ఇసుక క్వారీ లారీ ఢీకొని మృతి చెందిన సురే శ్ (మద్దికుంట) కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సిద్ధం వేణు, రావుల రమేశ్, కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, గంప వెం కన్న, మాతంగి లక్ష్మణ్, ఉల్లెంగుల ఏకానందం, పాశం అశోక్ రెడ్డి, ఎడ్ల బుచ్చిరెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు.