మృత్యువు దూసుకొచ్చింది. అతివేగం ఆయువు తీసింది. ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. నిమజ్జన వేడుకల కోసం బైక్‌పై వెళ్తున్న తాతా, మనుమరాలికి అదే చివరి ప్రయాణమైంది. ఆదివారం వీరు ప్రయాణిస్తున్న బైక్‌తోపాటు మరో బైక్‌ను పొలాస వద్ద అతివేగంగా ఢీకొట్టగా, తాతా, మనుమరాలు అక్కడికక్కడే దుర్మరణం చెందడం కలిచివేసింది. మనుమడితోపాటు మరో బైక్‌పై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, ఘటన జరిగిన తీరును చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించగా, మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
జగిత్యాల రూరల్, సెప్టెంబర్ 15: నిమజ్జన వేడుకల కోసం వెళ్తున్న తాతా, మనుమరాలికి అదే చివరి ప్రయాణమైంది. ఆదివారం వీరు ప్రయాణిస్తున్న బైక్‌తోపాటు మరో బైక్‌ను జగిత్యాల జిల్లా పొలాస జంక్షన్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టగా, తాతా, మనుమరాలు అక్కడికక్కడే మృతిచెందగా, మనుమడితోపాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం అల్లీపూర్‌కు చెందిన బైండ్ల లచ్చన్న (55) ఆదివారం ధర్మపురిలోని తన కూతురు నారవేని మమత ఇంటికి వెళ్లాడు. సోమవారం అల్లీపూర్లో వినాయక నిమజ్జన వేడుకలు ఉండడంతో మనుమరాలు శ్రీనిధి(13), మనుమడు మల్లికార్జున్‌ను తీసుకొని బైక్‌పై అల్లీపూర్‌కు బయలుదేరాడు. అయితే పొలాస జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు ధర్మపురి వైపు వెళ్తూ ప్రయాణికులను దింపడానికి ఆగింది.
అదే సమయంలో కొండగట్టు నుంచి ధర్మపురి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (టీఎస్21యుడి9955) ఆర్టీసీ బస్సును ఓవర్‌టెక్ చేసే క్రమంలో జగిత్యాల నుంచి పొలాస వైపు వస్తున్న హోండా ఆక్టీవా బైక్‌ను ఢీకొట్టడంతోపాటు లచ్చన్న ప్రయాణిస్తున్న బైక్‌ను అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లచ్చన్న, మనుమరాలు శ్రీనిధి అకడికకడే మృతి చెందారు. మల్లికార్జున్ తీవ్రంగా గాయపడ్డాడు. హోండా ఆక్టీవా బైక్ మీద ప్రయాణిస్తున్న పొలాసకు చెందిన బదినేపల్లి నర్సయ్య, బూర్ల రాజన్న తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ప్రమాద ఘటనలో ప్రైవేట్ బస్సు బైక్‌తో సహా తాతా, మనుమడిని సుమారు 150 మీటర్లు ఈడ్చుకొని వెళ్లి ఆగింది. సంఘటనా స్థలాన్ని జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, రూరల్ సీఐ క్రిష్ణారెడ్డి, ఎస్ఐ సదాకర్ ఘటన స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులను జగిత్యాల జిల్లా దవాఖానకు తరలించారు. లచ్చన్న కూతురు నారవేని మమత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.