Godavarikhani | కోల్ సిటీ , ఏప్రిల్ 24: రామగుండం నగర పాలక సంస్థ 47వ డివిజన్ కు చెందిన నిరుపేద ముస్లిం యువతి వివాహానికి వీహెచ్ఆర్ ఫౌండేషన్ చేయూతనందించింది. ఆ డివిజన్ కు చెందిన ఆఫీఫా తండ్రి అజీమ్ గతంలో మృతి చెందగా, తల్లి అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ కుటుంబ భారంను భుజాన వేసుకుంది. ఆమె కుమార్తె అఫీఫాకు పెళ్లి సంబంధం కుదరగా, కుటుంబ పరిస్థితి తెలుసుకొని నగర పాలక సంస్థ తాజా మాజీ కో-ఆప్షన్ సభ్యురాలు తస్నీమ్ భాను జాహిద్ పాషా వీహెచ్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ వ్యాల హరీష్ రెడ్డి దృష్టికి తీసుకవెళ్లారు.
వెంటనే స్పందించిన ఆయన యువతి పెళ్లి ఖర్చులకు తక్షణ సాయం కింద రూ.10వేలు అందించాలని సూచించారు. కాగా అమ్మాయి ఇంటికి వెళ్లి ఆమె తల్లికి రూ.10వేల నగదును మాజీ కో ఆప్షన్ తస్నీం భాను జాహిద్ పాషా గురువారం అందజేశారు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా తస్నీం భాను మాట్లాడుతూ పుట్టిన ఊరును మరిచిపోకుండా ఇక్కడి పేదవాళ్ల కష్టాలు తెలుసుకొని వారికి అండగా నిలుస్తున్న హరీష్ రెడ్డి గొప్ప మనసుకు రామగుండం ముస్లిం మైనార్టీ సమాజం తరపున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పొలాడి శ్రీనివాస రావు, బూరుగు వంశీకృష్ణ, రౌడ్డ సంపత్, కొల్లూరి ప్రసాద్, షఫీఖాన్, ముస్లిం మత పెద్దలు తహసీన్, జానీమియా, బాజా మయినొద్దిన్, షాకీర్ మౌలానా. ఫరూక్, పర్వీన్, రహీమా తదితరులు పాల్గొన్నారు.