Chinthakunta| కథలాపూర్, జనవరి 1 : ఉపాధిని వెతుక్కుంటూ సప్తసముద్రాలు దాటగా.. కాస్తా ఉపాధి దొరికినప్పటికీ గల్ఫ్ గుండెపోటుకు గురికావడంతో వలసజీవి మృతిచెందడం వల్ల బాధితకుటుంబం కన్నీటిపర్యంతమవుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన వేముల చొక్కయ్య (55) అనే వ్యక్తి దుబాయిలో గుండెపోటుకు గురై డిసెంబర్ 31న రాత్రి మృతిచెందారు.
చొక్కయ్య దుబాయి దేశంలో షార్జా సమీపంలోని అజ్మాన్ ఏరియాలో కార్మికుడిగా పనిచేసేవారు. ఎప్పటిలాగే బుధవారం డ్యూటీకి వెళ్లి రాత్రి తన గదికి తిరిగి వచ్చారు. రాత్రి 7 గంటల సమయంలో చొక్కయ్య చాతీలో నొప్పి ఉందంటూ అస్వస్థతకు గురై తాను ఉంటున్న గదిలో పడిపోయారు. తన గదిలో ఉంటున్న తోటి మిత్రులు గమనించేసరికి చొక్కయ్య మృతి చెందారు. చొక్కయ్య గత 10 ఏళ్లుగా దుబాయి వెళ్లి వస్తున్నారు. చివరగా రెండు నెలల క్రితం ఇంటికి వచ్చి వెళ్లినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. మృతుడికి భార్య నర్సవ్వ, ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. చొక్కయ్య మృతదేహం త్వరగా స్వగ్రామానికి చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని బాధిత కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.