ఎండలు మొదలయ్యాయి. వాతావారణం వేడెక్కుతున్నది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు డిహైడ్రేషన్కు గురికాకుండా ఉండేందుకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ‘వాటర్ బెల్’ పేరిట సరికొత్త కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా రోజుకు రెండు సార్లు పిలలు సరిపడా మంచినీరు తాగేలా చూస్తున్నారు. సరైన మోతాదులో నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండడమే కాకుండా, పిల్లలు అనేక రుగ్మతలకు దూరం కానున్నారు. అంతేకాదు, పాఠశాలలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి విద్యార్థికీ స్టీల్ వాటర్ బాటిల్ ఇచ్చి.. వాటర్‌బెల్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న తీరు మిగతా పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
కరీంనగర్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎండాకాలం వచ్చిదంటేచాలు నాలుక తడారిపోతుంది. గుక్కెడు నీరు తాగితే బాగుండు అనిపిస్తుంది. కానీ, ఒక్కోసారి సమయానికి తాగునీరు దొరకదు. ఓసారోసారి కొద్దిపాటి నీళ్లతోనే దాహం తీర్చుకోవాల్సి వస్తుంది. విద్యార్థుల పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉంటుంది. ఉదయం పాఠశాలలకు వెళ్లే పిల్లలు చాలా మంది ఇంటి నుంచి మంచినీళ్లు తెచ్చుకోరు. ఒక వేళ తెచ్చుకున్నా.. తాగడానికి సమయం దొరక్కపోవడం, కంటిన్యూగా తరగతులు జరిగినప్పుడు మధ్యలో వెళ్లి తాగలేని పరిస్థితి ఉంటుంది. ఒకవేళ నీరు బాగా తాగితే మళ్లీ వాష్‌రూంకు వెళ్లాల్సి వస్తుందనే భయం కూడా వెంటాడుతుంటుంది. వేసవిలో అయితే చాలా మంది విద్యార్థులు నీళ్లు తాగక వివిధ రకాల రోగాల బారిన పడే ప్రమాదముంటుంది. తద్వారా బడులకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడడం, చదువులకు ఆటంకం కలగడం.. తిరిగి కోలుకోవడానికి విచ్చలవిడిగా మందులను వాడడం వల్ల విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నట్టు అనేక సర్వేల్లో వెల్లడవుతున్న విషయం తెలిసిందే.
నీటి వల్ల ఎన్నో లాభాలు
మంచినీరు శరీర ఉష్ణోగ్రతను సమతౌల్యం చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. సరైన సమయంలో సరైన మోతాదు మేరకు నీరు తాగకపోతే డిహైడ్రేట్‌కు గురికావడం. తద్వారా శరీర ఉష్ణోగ్రతలు పెరిగి మనిషి సొమ్మసిల్లి పోవడం, అలాగే శరీరంలో ఎలక్ట్రోలైట్స్, ప్లాస్మా పెరిగిపోయి అనారోగ్యం బారిన పడడం జరుగుతుంది. అందుకే ప్రతి మనిషి రోజుకు కనీసం రెండు లీటర్ల నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో చేరిన విష పదార్థాలు తొలగాలంటే సరైన మోతాదులో మంచినీరు తీసుకోవాలని, మంచినీరు సరిగ్గా తాగిన వ్యక్తికి కీళ్ల నొప్పులు, మలబద్ధకం, అజీర్ణం, రక్తపోటు లాంటి సమస్యలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు. సరిపడా మంచినీళ్లు తాగిన వారి శరీరంలో ఆక్సిజన్ సర్కులేషన్ సరిగా ఉండడం వల్ల శక్తి ప్రసరణ జరుగడంతోపాటు ఉత్సాహంగా ఉంటారని, చర్మం కూడా కాంతివంతంగా ఉంటుందని అనేక పరిశోధనల్లో వెల్లడించారు.
జిల్లెల్లలో ‘వాటర్ బెల్’ ప్రయోగం
ప్రస్తుతం వేసవి ప్రారంభమైన నేపథ్యంలో తాగునీరు తీసుకోవడం తప్పనిసరి కాగా, జిల్లెల్ల పాఠశాల ఉపాధ్యాయులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. హెచ్ఎం జోగినపల్లి అనురాధ ఆధ్వర్యంలో ‘వాటర్ బెల్’ పేరిట సరికొత్త కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా మంచినీటి ఉపయోగాలు పిల్లలకు వివరిస్తూ.. రోజుకు కనీసం రెండు లీటర్ల నీటిని తాగేలా విద్యార్థులకు ఒక అలవాటుగా మార్చుతున్నారు. అందుకోసం ప్రతి రోజూ పాఠశాలలో ఉదయం 10.45 గంటలకు, అలాగే మధ్యాహ్నం 2.45 గంటలకు గంట మోగిస్తున్నారు. ఈ స్వల్ప విరామంలో విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కలిసి తప్పనిసరిగా మంచినీరు తాగుతున్నారు. ఇదే సమయంలో ప్లాస్టిక్ రహిత పాఠశాలగా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా దాతల సహాయంతో విద్యార్థులందరికీ స్టీల్ బాటిల్స్ సమకూర్చారు.
పాఠశాలలోనే ఉన్న వాటర్ ఫిల్టర్ నీటిని నిల్వ చేసుకునేందుకు గాను దాతల సహాయంతో స్టీల్ నల్ల డబ్బాలను అందుబాటులోకి తెచ్చారు. నిర్దిష్ట సమయం ప్రకారం గంట మోగగానే విద్యార్థులు వాటర్ బాటిల్స్ తీసుకొని గ్రౌండ్లోకి వచ్చి నీటిని తాగేలా చర్యలు చేపట్టారు. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయని, వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇబ్బందులకు దూరంగా ఉండొచ్చని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జోగినపల్లి అనురాధ తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు రాజేశ్వరరావు, శారద, రమేశ్, లక్ష్మారెడ్డి, పద్మ, శైలజ ,శిరీష, నీరజ, ప్రణీత్, సంతోష్, పద్మ సహకారంతో ఈ ప్రయోగాన్ని సమర్థవంతగా అమలు చేస్తున్నామని, మంచి ఫలితాలు వస్తున్నాయని చెబుతున్నారు. త్వరలో దాతల సహకారంతో చల్లటి నీటి వసతిని కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.