ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు దిగువన భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో జరిగిన షార్ట్ సర్క్యూట్‌తో దుకాణ సముదాయం కాలిబూడిదైంది. ఒక షాపులో ఎగిసిపడిన నిప్పు రవ్వలు క్రమంగా ఒక దుకాణం నుంచి మరో దుకాణానికి విస్తరించడంతో సుమారు 30 దుకాణాలు కాలిపోయాయి. ప్లాస్టిక్ వస్తువులు, ఆట బొమ్మలు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు చెలరేగడంతో షాపులో ఉన్న నిత్యావసర వస్తువులు, నగదు, బంగారం అన్నింటినీ వదిలేసి భయాందోళనతో బాధితులు బయటికి పరుగులు తీశారు. దశాబ్దాలుగా రూపాయీ రూపాయీ పోగేసుకొని, చేసిన వ్యాపారం కండ్ల ముందే కాలిబూడిదవుతుంటే, ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో కన్నీరు పెట్టారు.
మల్యాల, నవంబర్ 30 : మల్యాల మండలం ముత్యంపేటకు అనుబంధంగా ఉన్న కొండగట్టు దిగువన చిరువ్యాపారులు, జగిత్యాల-కరీంగనర్ ప్రధాన రహదారిపై సామశ్రీనాథ్ సముదాయంలో ఆట వస్తువుల దుకాణాలు నిర్వహిస్తున్నారు. రాబోయే సమ్మక్క- సారక్క జాతరల నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ముందస్తుగా ఆట బొమ్మలు, దేవుళ్ల చిత్రపటాలు, ఆట వస్తువల స్టాక్ తెచ్చి షాపుల్లో పెట్టుకున్నారు. ఎప్పటిలాగే శనివారం రాత్రి షాపులను మూసి పడుకున్నారు. రాత్రి 11.30గంటల సమయంలో ఒక దుకాణంలో షార్ట్ సర్క్యూట్‌తో నిప్పు రవ్వలు ఎగిసి పడ్డాయి. అయితే ముప్పైకి పైగా దుకాణాలు ఒకదాన్ని ఆనుకొని ఒకటి ఉండడం, అన్ని రేకుల షెడ్లే కావడంతో ఒకదాని నుంచి మరొక దుకాణానికి మంటలు విస్తరించాయి.
మొదటి దుకాణంలో మంటలు అంటుకున్న సమయంలోనే దుకాణదారులు గమనించి, 108తోపాటు ఫైరింజన్‌కు సమాచారం ఇచ్చారు. అయితే జగిత్యాల నుంచి బయలు దేరిన ఫైరింజన్‌కు ఇబ్బంది రావడంతో మధ్యలోనే అది నిలిచిపోయింది. వచ్చిన మరో ఫైరింజన్‌కు సంబంధించిన మిషనరీ మొరాయించింది. విధి లేని పరిస్థితిలో కోరుట్ల, కరీంనగర్ నుంచి ఫైరింజన్లను పిలిపించగా, అవి వచ్చే సరికే దాదాపు అన్ని దుకాణాలు కాలి బూడిదయ్యాయి. తెల్లవారుజామున 2.30 గంటల వరకు మంటలను అదుపులోకి తెచ్చినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రతి దుకాణ యజమానికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు నష్టం వాటిల్లింది. మొత్తంగా సుమారు కోటి వరకు నష్టం వాటిలినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ చిరు వ్యాపారుల కుటుంబాల రోదన కొండగట్టు దిగువన అంజన్న ప్రతిమ సాక్షిగా మిన్నంటింది. ఇటుక ఇటుక పేర్చి నిర్మించుకున్న ఉపాధి క్షేత్రం కండ్ల ముందే కాలిపోయిందని, ఇక తాము ఎట్ల బతకాలని, తమ బిడ్డలను ఎలా సాకాలంటూ కన్నీరు పెట్టారు. ఆదివారం ఉదయం కాలిబూడిదైన షాపులను చూస్తూ బోరుమన్నారు. ఫైరింజన్లు సకాలంలో వచ్చి ఉంటే ఇంతలా ప్రమాదం జరిగి ఉండేదని కాదని, అధికారుల నిర్లక్ష్యం వల్లే అన్ని దుకాణాలు నాశనం అయిపోయాయని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తి నష్టంతో పాటు వ్యక్తిగత జీవనానికి సంబంధించిన నిత్యావసర వస్తువులు, పిల్లల పుస్తకాలు, సర్టిఫికెట్లు, ఇతర విలువైన డ్యాకుమెంట్లు, కొంత నగదు సైతం కాలిపోయిందని కంటతడి పెట్టారు.
రూ.20 వేలని.. ఇచ్చేది రూ.5వేలా..?
బాధిత కుటుంబాలను ఆదివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరామర్శించారు. ఆందోళన చెందవద్దని, అండగా నిలుస్తామన్నారు. ప్రభుత్వం తరఫున 20వేల సాయం అందజేస్తామని, భవిష్యత్తులో ఇతర పద్ధతుల్లో ఆందుకుంటామని చెప్పి వెళ్లిపోయారు. కానీ, సాయంత్రం వరకు పంచనామా చేసిన అధికారులు, చీకటిపడే వేళ బాధిత కుటుంబాలకు పది కిలోల బియ్యం, ఐదువేల రూపాయల తక్షణ సాయం అందించి చేతులు దులుపుకొన్నారు. మంత్రి, ఎమ్మెల్యేలు 20వేల సాయం చేస్తామని చెప్పారని, ఇప్పుడు 5వేలు అందించడం ఏంటని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు పద్ధతి ఇలానే ఉంటుందా..? అని వాపోయారు. ప్రమాదంపై బాధితుడు, దుకాణ యజమాని కొండ మహేశ్ ఫిర్యాదు మేరకు మల్యాల పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ అనుమండ్ల నరేశ్ కుమార్ తెలిపారు.

30లక్షల ఆర్థిక సాయం అందించాలి : కేటీఆర్
కొండగట్టు ప్రమాదం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఆయన ట్విట్టర్లో స్పందించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు ఫోన్ చేసి, నష్టం వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన ఆగ్రహిం చారు. ఫైరింజన్లు సకాలంలో రాకపోవడం, వచ్చిన ఫైరిజంన్లు పనిచేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి దుకాణదారుడికి 30 లక్షల ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. సంఘటనపై సకాలంలో స్పందించి, బాధితులకు సేవలందించిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను అభినందించారు. బాధిత కుటుంబాలకు 5వేల చొప్పున బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆర్థిక సాయం చేయడం అభినందనీయమన్నారు.