జగిత్యాల, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రం జ్వరాల కుప్పగా మారిపోయింది. అనారోగ్యంతో ప్రజలు అల్లాడుతున్నరు. ప్రభుత్వ దవాఖానల్లో మంచానికి ముగ్గురు, నలుగురు రోగులు అన్నట్లుగా పరిస్థితి తయారైన క్రమంలో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలి’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఆగస్టు చివరి నాటికే రాష్ట్రంలో 8.5 లక్షల మందికి పైగా విష జ్వరాల బారిన పడ్డారని, ప్రాణాంతక డెంగ్యూ, చికున్ గున్యాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం బాధాకరమన్నారు. ఆగస్టు 27 నాటికే రాష్ట్రం లో 4,459 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని చెప్పిన వైద్యారోగ్యశాఖ, డెంగ్యూ కేసుతోనే కాదు, ఇతర ఏ విషజ్వరం వల్ల ఒక మరణం సంభవించలేదని నివేదిక ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
డెంగ్యూ మరణాలు లేవని ప్రభుత్వం చెబుతుంటే పత్రికలు, మీడియాలో చికున్ గున్యా, డెంగీతో ప్రజలు చనిపోతున్నారన్న వార్తలు ఎలా వస్తున్నాయో..? చెప్పాలని ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేవలం లక్ష లోపు మంది మాత్రమే జ్వరాల బారిన పడ్డారని, జగిత్యాలలో 18 వేల మంది ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో పేర్కొన్నారని, అవన్నీ కాకి లెకలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క జగిత్యాల జిల్లాలోనే దాదాపు 50 వేల మందికి పైగా విషజ్వరాల బారిన పడ్డారని తెలిపారు.
ఇప్పటికే 20 మందికి పైగా డెంగ్యూ, చికున్ గున్యా లాంటి ప్రమాదకరమైన విషజ్వరాల బారిన పడి మృతిచెందారన్నారు. మూడు, నాలుగు రోజు ల క్రితమే సారంగాపూర్ మండలంలో ఒక సింగిల్ విండో సీఈవో విషజ్వరంతో చనిపోయాడని, మల్లాపూర్ మండలానికి చెందిన యువకుడు విదేశాల నుంచి వచ్చి వివాహం చేసుకున్న 15 రోజులకే విషజ్వరంతో చనిపోయాడన్నారు. ఇంతలా విషజ్వరాలు విజృంభిస్తున్నా, ప్రభుత్వం మాత్రం అంగీకరించకపోవడం సరికాదన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో కనీస సౌకర్యాల లేకుండా పోయాయని, విషజ్వరాలకు సంబంధించిన మందు లు, కీలకమైన అజిత్రోమైసిన్ , డైక్లోఫైన్ ఫార్ములా మెడిసిన్ అందుబాటులో లేకపోవడంతో రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో మార్కెట్లో కొనుగోలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేసీఆర్ హయాంలో దవాఖానల్లో ఉంచిన బఫర్ స్టాక్ మందులే ఇన్నాళ్లూ వినియోగిస్తూ వచ్చామని, స్టాక్ పూర్తి కావడంతో మందుల కొరత తీవ్రంగా ఏర్పడిందని వైద్య సిబ్బందే చెబుతున్నారని తెలిపారు. అన్ని రకాల వైద్య సేవలు కుంటుపడ్డాయన్నారు.
కేసీఆర్ కిట్లు అందడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 62 శాతం ప్రసవాలు నమోదైతే, ప్రైవేట్ లో 38 శాతం జరిగాయ ని, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని, ఈ విషయంలో ప్రభుత్వం సిగ్గుపడాలని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభు త్వం మేలొని పారదర్శకంగా విష జ్వరాల నివారణ కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు వొద్దినేని హరిచరణ్రావు, శీలం ప్రవీణ్, ప్రియాంక, దేవేందర్ నాయక్, వొల్లెం మల్లేశం పాల్గొన్నారు.